‘ఆశ’...నిరాశ
నవాబుపేట: పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్య కార్యకర్తలు, అధికారులకు చేరవేసే ఆశ (అక్రెడిడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్) కార్యకర్తల వెతలు అన్నీఇన్నీ కావు. 2005లో స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్త పేరుతో ప్రారంభమై 2007 నుంచి ఆశాలుగా మారారు. జాతీయ ఆరోగ్య గ్రామీణ పథకం ఫేజ్ 2 నిధులతో 2005లో వారు నియమితులయ్యారు.
వికారాబాద్ డివిజన్లో ప్రస్తుతం 126 మంది ఆశ కార్యకర్తలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పదో తరగతి వరకు చదివి ఆరోగ్యంపై అవగాహన కలిగిన మహిళలు ఆశ కార్యకర్తలుగా పని చేయవచ్చు. వీరు సబ్‌సెంటర్లు, పీఎచ్‌సీల పరిధిలోని ఏఎన్ఎంలకు సహాయకులుగా ఉంటారు.
విధులివీ....
గర్భం దాల్చిన నాటి నుంచి పురుడు పోసుకునేంత వరకు మహిళలకు వైద్య పరంగా సేవలందించేది ఆశాలే. గర్భిణుల పేర ్లనమోదు, పురిటి బిడ్డలకు పది నెలల వరకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం, పిల్లల సంరక్షణ, మాతా శిశు మరణాలను నమోదు చేయడం, కాన్పులు ప్రభుత్వాస్పత్రుల్లోనే జరిగేలా గర్భిణులకు అవగాహన కల్పించడం వీరి ప్రధాన విధులు. అలాగే ట్యూబెక్టమీ, వాసెక్టమీ ఆపరేషన్లపై మహిళలకు, పురుషులకు అవగాహన కల్పించడం, జాతీయ పల్స్‌పోలియో వంటి కార్యక్రమాల నిర్వహణ, వైద్యశాలలో జరిగే సమావేశాల్లో పాల్గొనడం వంటివి వీరు చేయాల్సి ఉంటుంది.
ఆశాలకు వారి పరిధిలోని గ్రామాల్లో అందించే సేవల ఆధారంగా పారితోషికం ఉంటుంది.గర్భిణుల సంఖ్య నమోదుకు, మొదటి రెండు, మూడు తనిఖీలకు రూ. 60 చొప్పున.., తక్కువ బరువు ఉన్న పిల్లల గురించి తెలియజేసినందుకు రూ.75, మాతా శిశు మరణాలను తెలిపినందుకు రూ. 50 చొప్పున...ఇలా ఒక్కో సేవకు ఒక్కో రేటు చొప్పున ఆశలకు చెల్లించాలి. వీటన్నీంటికి ఎటువంటి టీఏ, డీఏలు ఇవ్వకపోవడం వల్ల వీరికి లభించే పారితోషికంలో మూడొంతులు చార్జీలకు ఖర్చు అవుతున్నాయి. కనీసం కూలీలకు లభించే వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని ఆశాలు ఆవేదన చెందుతున్నారు.
నాసిరకం యూనిఫాంలు
ఆశా కార్యకర్తలకు ఏడాదిలో రెండు సార్లు జనవరి, జులైలో యూనిఫాంలు పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిలో కూడా అధికారుల చేతివాటం వల్ల నాసిరకం యూనీఫాంలు ఆశాలకు అందుతున్నాయి. ఆరోగ్య కేంద్రంలో సమావేశాలకు హాజరైతే కనీసం కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు.
వేధిస్తున్న అధికారులు
ఆశాలు చేసిన పనిని ఏఎన్ఎంలు పరిశీలించి నివేదిక ఇచ్చిన అనంతరం వైద్యాధికారి బిల్లును జిల్లా కార్యాలయానికి పంపుతున్నారు. దీంతో అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్నారని , వైద్య అధికారుల సామానులు మోసే సిబ్బందిగా వినియోగించుకుంటున్నారని పలువురు కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా కార్యాలయంలో మూడు నెలలకు అంతకుపైగా అయితేనే పారితోషికాలు విడుదల అవుతున్నాయి. ప్రభుత్వం తమతో వెట్టిచాకిరి చేయించుకుంటూ సరిపడా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు.