National Hockey
-
జాతీయ హాకీ విజేత మధ్యప్రదేశ్
సాక్షి, కాకినాడ: జాతీయ మహిళల సీనియర్ హాకీ చాంపియన్‌షిప్‌లో మధ్యప్రదేశ్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో మధ్యప్రదేశ్ 5–1 గోల్స్ తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. మధ్యప్రదేశ్ తరఫున దీక్షా తివారి (2వ నిమిషం, 4వ ని.), మన్మీత్ కౌర్ (38వ ని.), ప్రీతి దూబే (42వ ని.), ఐశ్వర్య చవాన్ (42వ ని.) గోల్స్ సాధించగా... మహారాష్ట్ర జట్టునుంచి లాల్రిండికి (25వ ని.) ఏకైక గోల్ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రతిభ ఆర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మరో వైపు ప్లే ఆఫ్ పోరులో హరియాణాను 2–1తో ఓడించిన జార్ఖండ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. -
జాతీయ హాకీ జట్టు... అండగా రాష్ట్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ప్రముఖ కంపెనీలు, వ్యాపార దిగ్గజ సంస్థలు క్రీడల జట్లకు స్పాన్సర్లుగా వ్యవహరించడం సర్వసాధారణం. కానీ ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిచేస్తే అది గొప్ప విశేషం. ఆనవాయితీకి భిన్నంగా ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్షిప్ అందించనుంది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. గురువారం ఇక్కడ ఘనంగా నిర్వహించిన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు భారత పురుషులు, మహిళా జట్ల సభ్యులు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్), ఐఓఏ అధ్యక్షుడు కూడా అయిన నరీందర్ బాత్రా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. ఈ సం దర్భంగా ఒడిశా సీఎం మాట్లాడుతూ ‘మా రాష్ట్రంలో హాకీ ఆట కాదు... ఆటకంటే ఎక్కువే. ఇది మా జీవితంలో భాగమైపోయింది. ఇక్కడి మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా చిన్నారులు బంతి, కర్రల సాయంతో హాకీని ఆడతారు. దిలీప్ టిర్కీ, ఇగ్నీస్ టిర్కీ, లాజరస్ బార్లాలాంటి మేటి ఆటగాళ్లు ఒడిశా నుంచే వచ్చారు. ఇప్పుడు ఈ క్రీడ ఉన్నతి కోసం మేం పాటు పడతాం. హాకీ ఇండియా (హెచ్ఐ)తో కలిసి పనిచేస్తాం. ఇది భారత హాకీకి ఒడిశా ప్రభుత్వం ఇచ్చే కానుక’ అని అన్నారు. 2014 చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరగనుండటం విశేషం. -
భారత జట్టులో చోటు దక్కించుకోవాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్ : భారత జట్టులో లక్ష్యంగా దూసుకెళ్లాలని ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో ఆర్డీటీ అకాడమీకి చెందిన భవానీ జాతీయ హాకీ అకాడమీకి ఎంపికైన సందర్భంగా అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే క్రీడాకారుల కృషి, పట్టుదలే ప్రధానమన్నారు. హాకీ క్రీడ కోసం విశాఖపట్టణం నుంచి అనంతపురం ఆర్డీటీ అకాడమీలో శిక్షణ తీసుకుని జాతీయస్థాయి క్యాంప్‌కు ఎంపికవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. భవానీ అనంతపురం ఆర్డీటీ అకాడమీలో 2013లో చేరిందని, ఆనాటి నుంచి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించి జూనియర్, సీనియర్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ హాకీ కోఆర్డినేటర్ విజయ్‌బాబు, కోచ్ అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడు అబ్దుల్ఘనీ, బాబయ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం
తొలిరోజు ఆతిథ్య ‘అనంత’ జట్టు విజయంతో బోణీ అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంత క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫస్ట్ ఇన్విటేషన్ హాకీ అకాడమీస్ చాంపియన్ షిప్ - 2017 టోర్నీ ప్రారంభమైంది. హాకీ ఇండియా పర్యవేక్షణలో జూన్ మూడో తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్లో ఢిల్లీ, ఎర్నాకులం, ఊటీ, చెన్నై, తిరుచ్చి, కోవెల్పట్టీ, గుంటూరు, ధర్మవరం, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు పాల్గొంటున్నాయి. మొదటి మ్యాచ్ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మిటీ హాకీ అకాడమీ (ఎర్నాకులం) జట్లు తలపడ్డాయి. మొదట ఎమ్మిటీ జట్టు గోల్ సాధించి ముందంజలో ఉండగా తర్వాత అనంతపురం జట్టు పుంజుకుని మొదటి హాఫ్‌లో ఏకంగా 4–1 గోల్స్ సాధించింది. అనంతరం సెకండ్ హాఫ్‌లోను 3 గోల్స్ సాధించి అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 7–1తో విజయం సాధించింది. జట్టులో సాయికుమార్ ఏకంగా 4 గోల్స్ సాధించి విజయాన్నందించాడు.›రెండవ మ్యాచ్‌లో ధర్మవరం, ఊటీ జట్లు తలపడగా ఊటీ జట్టు 3–1తో విజయం సాధించింది. క్రీడలను ఆస్వాదించండి క్రీడాకారులు క్రీడలను ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. సోమవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయనతోపాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ దామోదర్, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, టోర్నీ డైరెక్టర్ డాన్నీకెన్నీ, ఆడిటర్ వేణుగోపాల్‌రెడ్డి, సప్తగిరి క్యాంఫర్ హనీఫ్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు సూర్యప్రకాష్, గోపీనాథ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఘని, ట్రెజరర్ బాబయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, పీఈటీ నాగరాజు, కోచ్‌లు లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, చౌడేశ్వరప్రసాద్, వైద్యులు సయ్యద్ హుస్సేన్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.