జాతీయస్థాయి హాకీ టోర్నీ ప్రారంభం
- తొలిరోజు ఆతిథ్య ‘అనంత’ జట్టు విజయంతో బోణీ
అనంతపురం సప్తగిరి సర్కిల్ :
అనంత క్రీడా మైదానంలో సోమవారం సాయంత్రం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఫస్ట్ ఇన్విటేషన్ హాకీ అకాడమీస్ చాంపియన్ షిప్ - 2017 టోర్నీ ప్రారంభమైంది. హాకీ ఇండియా పర్యవేక్షణలో జూన్ మూడో తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఢిల్లీ, ఎర్నాకులం, ఊటీ, చెన్నై, తిరుచ్చి, కోవెల్‌పట్టీ, గుంటూరు, ధర్మవరం, అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్లు పాల్గొంటున్నాయి.
మొదటి మ్యాచ్ అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ, ఎమ్మిటీ హాకీ అకాడమీ (ఎర్నాకులం) జట్లు తలపడ్డాయి. మొదట ఎమ్మిటీ జట్టు గోల్ సాధించి ముందంజలో ఉండగా తర్వాత అనంతపురం జట్టు పుంజుకుని మొదటి హాఫ్‌లో ఏకంగా 4–1 గోల్స్ సాధించింది. అనంతరం సెకండ్ హాఫ్‌లోను 3 గోల్స్ సాధించి అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 7–1తో విజయం సాధించింది. జట్టులో సాయికుమార్ ఏకంగా 4 గోల్స్ సాధించి విజయాన్నందించాడు.›రెండవ మ్యాచ్‌లో ధర్మవరం, ఊటీ జట్లు తలపడగా ఊటీ జట్టు 3–1తో విజయం సాధించింది.
క్రీడలను ఆస్వాదించండి
క్రీడాకారులు క్రీడలను ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ సూచించారు. సోమవారం సాయంత్రం అనంత క్రీడా గ్రామంలో టోర్నీ ప్రారంభోత్సవానికి ఆయనతోపాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ దామోదర్, ఎస్కేయూ మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, టోర్నీ డైరెక్టర్ డాన్నీకెన్నీ, ఆడిటర్ వేణుగోపాల్‌రెడ్డి, సప్తగిరి క్యాంఫర్ హనీఫ్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ సభ్యులు సూర్యప్రకాష్, గోపీనాథ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి విజయ్‌బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ జాతీయస్థాయి టోర్నీని అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అబ్దుల్ ఘని, ట్రెజరర్ బాబయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, పీఈటీ నాగరాజు, కోచ్‌లు లక్ష్మీనారాయణ, అనిల్‌కుమార్, చౌడేశ్వరప్రసాద్, వైద్యులు సయ్యద్ హుస్సేన్, ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.