national holiday
-
స్ఫూర్తిదాయక పని కోసం సెలవు
నైరోబీ: కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కోసం జాతీయ సెలవు దినాన్ని ప్రకటించి కెన్యా తన సామాజిక స్పృహను చాటుకుంది. దేశంలోని వారంతా మొక్కలు నాటే కార్యక్రమంలో విధిగా పాల్గొనేందుకు వీలుగా నవంబర్ 13(సోమవారం) రోజున దేశవ్యాప్త సెలవు ప్రకటిస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే పది సంవత్సరాల్లో 1,500 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, వాయు కాలుష్యం సమస్యలతో సతమతమవుతున్న కెన్యాను కాపాడేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రస్తుతం దేశ విస్తీర్ణంలో కేవలం ఏడు శాతంగా ఉన్న అడవులను 10 శాతానికి పెంచేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. సోమవారం నాటి కార్యక్రమం కోసం ప్రభుత్వం ఇప్పటికే ఉచితంగా 15 కోట్లకుపైగా మొక్కలను ప్రభుత్వ నర్సరీల్లో పౌరుల కోసం అందుబాటులో ఉంచింది. వీటిని ప్రభుత్వ ఏజెన్సీ నిర్దేశించిన చోట్ల నాటాలి. ఇవిగాక ‘ప్రతి కెన్యా పౌరుడు కనీసం రెండు మొక్కలు కొని నాటండి’ అని పర్యావరణ మంత్రి సోపాన్ తుయా పిలుపునిచ్చారు. -
సౌదీ అరేబియా కమాల్ కియా...
లుజైల్ స్టేడియం 88 వేల మంది ప్రేక్షకులతో హోరెత్తిపోతోంది... అందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా అభిమానులే అయినా... అర్జెంటీనాను ఆరాధించేవారు కూడా తక్కువేమీ కాదు! ఆరంభంలోనే సూపర్ స్టార్ మెస్సీ గోల్‌తో అర్జెంటీనాకు ఆధిక్యం... మరో మూడుసార్లు బంతి గోల్‌పోస్ట్‌లోనికి... వాటిని రిఫరీ అనుమతించకపోయినా, మెస్సీ బృందం జోరును చూస్తే ఏకపక్ష మ్యాచ్ అనిపించింది... కానీ రెండో అర్ధభాగంలోకి వచ్చేసరికి ‘గ్రీన్ ఫాల్కన్స్’ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు... ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ కొట్టేశారు... ఇరు జట్లు సమంగా ఉన్న స్థితిలో 53వ నిమిషం...నవాఫ్ అల్ అబీద్ బంతిని గోల్‌పోస్ట్ వరకు తీసుకురాగలిగినా, రొమేరో దానిని హెడర్‌తో సమర్థంగా వెనక్కి పంపగలిగాడు... అయితే పెనాల్టీ ఏరియా కుడివైపు నుంచి అనూహ్యంగా దూసుకొచ్చి న మిడ్‌ఫీల్డర్ సలేమ్ అల్దవ్సరి ఇద్దరు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పించి బంతిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అతడిని నిలువరించేందుకు లియాండ్రో ప్రయత్నించినా లాభం లేకపోయింది. సలేమ్ అద్భుత కిక్ అర్జెంటీనా కీపర్ మార్టినెజ్‌ను దాటి గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. సలేమ్ ‘సోమర్సాల్ట్’తో జట్టు సంబరాలు మిన్నంటగా, అభిమానులతో స్టేడియం దద్దరిల్లింది. చివరి వరకు అదే ఆధిక్యం నిలబెట్టుకొని సౌదీ అరేబియా వరల్డ్ కప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనాకు షాక్ ఇచ్చి ఫుట్‌బాల్ ప్రపంచాన్ని కుదిపేసింది. దోహా: వరల్డ్‌కప్‌లో తొలి మ్యాచ్ ఆడే సమయానికి మాజీ చాంపియన్ అర్జెంటీనా జోరు మీదుంది. గత 36 మ్యాచ్‌లలో ఆ జట్టు ఓడిపోలేదు... 25 గెలవగా, 11 ‘డ్రా’ అయ్యాయి... టైటిల్ గెలిచే జట్లలో ఒకటిగా మెస్సీ సేన ఖతర్‌లో అడుగు పెట్టింది. మరోవైపు ప్రపంచ 51వ ర్యాంక్ సౌదీ అరేబియా.. 1994 నుంచి ఐదుసార్లు వరల్డ్ కప్ ఆడిన ఆ టీమ్ 3 మ్యాచ్‌ల్లో గెలిచింది. అవీ చెప్పుకోదగ్గవి కావు. కానీ ఆ దేశ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ విజయాన్ని మంగళవారం అందుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘సి’ పోరులో సౌదీ 2–1 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై ఘన విజయం సాధించింది. సౌదీ తరఫున సలేహ్ అల్ షహరి (48వ నిమిషం), సలేమ్ అల్ దవసరి (53వ నిమిషం) గోల్స్ నమోదు చేయగా... లయోనల్ మెస్సీ అర్జెంటీనాకు ఏకైక గోల్ (10వ నిమిషం) అందించాడు. తొలి హాఫ్‌లో సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించిన అర్జెంటీనా ఆట రెండో హాఫ్‌లో ఒక్కసారిగా పట్టు తప్పగా, సౌదీ దానిని సొమ్ము చేసుకుంది. ఆఖరి వరకు దానిని కొనసాగించి సరైన ఫలితాన్ని అందుకుంది. వరల్డ్ కప్ చరిత్రలో అది పెద్ద సంచలనాల్లో ఈ మ్యాచ్ కూడా ఒకటిగా మిగిలిపోనుంది. ఆ మూడు గోల్స్ ఇచ్చి ఉంటే... మ్యాచ్ ఆరంభంలో అర్జెంటీనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది. రెండు నిమిషాల్లోపే జట్టు ఖాతాలో గోలే చేరేది. అయితే మెస్సీ షాట్‌ను సౌదీ కీపర్ ఒవైస్ అడ్డుకోగలిగాడు. అయితే లియాండ్రోను హమీద్ దురుసుగా అడ్డుకోవడంతో మాజీ చాంపియన్‌కు పెనాల్టీ అవకాశం లభించింది. ప్రశాంతంగా గోల్ కొట్టి మెస్సీ జట్టును ముందంజలో నిలిపాడు. అయితే తర్వాతి మూడు షాట్లు అర్జెంటీనాకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. వరుసగా మెస్సీ, మార్టినెజ్ (రెండు సార్లు) చేసిన గోల్స్‌ను ‘ఆఫ్ సైడ్’ నిబంధన ద్వారా రిఫరీ తిరస్కరించాడు. బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపే సమయంలో గోమెజ్, మార్టినెజ్, రోడ్రిగో చేసిన తప్పులు జట్టును దెబ్బ తీశాయి. లేదంటే అర్జెంటీనా 4–0తో దూసుకుపోయేదే. రెండో అర్ధ భాగంలో మాత్రం సౌదీ చెలరేగింది. ఆట ఆరంభమైన మూడు నిమిషాల్లోనే షహరి గోల్‌తో లెక్క సమం చేశాడు. అతడిని ఆపేందుకు రొమెరో చేసిన ప్రయత్నం విఫలమైంది. మరో ఐదు నిమిషాల తర్వాత చేసిన గోల్‌తో అరబ్ టీమ్ ఆధిక్యం అందుకుంది. ఆ తర్వాత ఇంజ్యూరీ టైమ్ సహా మరో 60 నిమిషాల పాటు ఆట సాగినా... అర్జెంటీనా స్కోరును సమం చేయడంలో విఫలమైంది. మెస్సీ అద్భుతంగా ఆడుతూ గోల్‌పోస్ట్‌కు చేరువగా వచ్చిన క్షణంలో హసన్ అల్ తంబక్తి అతడిని టాకిల్ చేసిన తీరు హైలైట్‌గా నిలిచింది. చివరకు సౌదీ ఆటగాళ్ల ఆనందానికి హద్దు లేకపోగా, మెస్సీ విషణ్ణ వదనంతో నిష్క్రమించాడు. మ్యాచ్ అంకెల ప్రకారం చూస్తే ఎక్కువ శాతం (69) బంతి అర్జెంటీనా ఆధీనంలోనే ఉన్నా... 14 సార్లు గోల్పోస్ట్పైకి దాడులు చేసినా (సౌదీ 3 సార్లు), ప్రత్యర్థితో పోలిస్తే ఎక్కువ కార్నర్లు (6–2) లభించినా... సౌదీ చేసిన 21 ఫౌల్స్తో పోలిస్తే 6 ఫౌల్సే చేసినా... ఆరుగురు సౌదీ ఆటగాళ్లు ఎల్లోకార్డుకు గురైనా చివరకు విజయం మాత్రం సౌదీదే కావడం విశేషం! 1958 మ్యాచ్‌లో తొలి గోల్ సాధించాక ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఓడిపోవడం 1958 (జర్మనీ చేతిలో) తర్వాత ఇదే తొలిసారి. తొలి అర్ధ భాగం వరకు 1–0తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్‌లో ఓటమి చవిచూడటం అర్జెంటీనాకు 1930 తర్వాత ఇదే తొలిసారి. నేడు జాతీయ సెలవు దినం అర్జెంటీనాపై గెలుపు నేపథ్యంలో సౌదీ అరేబియాలో పెద్ద ఎత్తున సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ఆనందాన్నిరెట్టింపు చేస్తూ బుధవారం ఆ దేశంలో సెలవు ఇచ్చేశారు. ప్రజలు ఈ క్షణాన్ని వేడుకలా జరుపుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంస్థలతో పాటు విద్యా సంస్థలకు కూడా సెలవు ఇస్తున్నట్లు దేశపు రాజు సల్మాన్ ప్రకటించారు. -
అర్జెంటీనాపై గెలుపుతో సౌదీలో సంబరాలు.. బుధవారం సెలవు ప్రకటన
రియాద్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై చారిత్రక విజయం సాధించింది సౌదీ అరేబియా. పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా జైత్రయాత్రకు సౌదీ బ్రేకులు వేసింది. దీంతో సౌదీలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో బుధవారం సెలవు ప్రకటించింది సౌదీ. ఈ చారిత్రక విజయంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు ఇచ్చింది. సౌదీ జాతీయ జట్టు ఘన విజయం సాధించిన క్రమంలో విక్టరీ హాలీడేను ప్రకటించాలని యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ సూచించారు. ఆయన సూచనకు రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు దినంగా ప్రకటించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఇదీ చదవండి: FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్ చేసుకున్న అర్జెంటీనా -
నేతాజీ జయంతికి సెలవు.. పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: స్వాతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్‌ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని.. సెలవు దినంగా ప్రకటించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యవహారాలతో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేయొద్దని పిటిషనర్‌ని మందలించింది న్యాయస్థానం. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. 1897 జనవరి 23వ తేదీన కటక్‌లో జన్మించారు. అయితే.. ఆయన జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. తద్వారా ఆ మహనీయుడికి ఓ గౌరవం దక్కుతుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సెలవు ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ పిల్లో అభ్యర్థించారు పిటిషనర్ కె కె రమేష్. అయితే.. దేశానికి ఆయన(నేతాజీ) చేసిన సేవలను గుర్తించడానికి ఉత్తమ మార్గం.. కష్టపడి పని చేయడమేనని, అంతేకానీ, ఇలా జయంతికి సెలవులను జోడించడం కాదు అని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అయినా ఇది పూర్తిగా భారత ప్రభుత్వ పరిధిలోని అంశమని, న్యాయ వ్యవస్థ పరిధిలోకి రాదని పేర్కొంటూ ఆ పిల్‌ను డిస్మిస్ చేశారాయన. ఇదీ చదవండి: గూగుల్ పోటీలో నెగ్గిన మన కుర్రాడు -
విషాదం నుంచి విహారం వైపు..
బీజింగ్: చైనా తన 71వ ప్రజా రిపబ్లిక్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎనిమిది రోజుల అధికారిక సెలవు దినాలు ప్రకటించింది. జాతీయ సెలవుదినాలతో పాటు ఈ యేడాది శరద్రుతువులో వచ్చే పండుగ కలిసి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు కోవిడ్ సంక్షోభం తరువాత, విహార యాత్రలకు సిద్ధమౌతున్నారు. చైనాలో జాతీయ సెలవుదినాలు, ప్రయాణాలపై ఆంక్షలు సడలించడంతో భారీ సంఖ్యలో వివిధ ప్రాంతాలకు ప్రజలు తరలివెళుతున్నట్టు టూర్ ఆపరేటర్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుం డడంతో, దేశీయ ప్రయాణాలకు, బంధువులను కలిసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు. దేశీయ విమాన ప్రయాణాలు 1.5 కోట్లకు చేరవచ్చునని, ఇది గత యేడాదితో పోల్చుకుంటే పది శాతం అధికమని హాంకాంగ్ కేంద్రంగా వెలువడే సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపింది. టికెట్ల బుక్కింగ్ వెబ్సైట్ ‘‘కునార్’’ ప్రారంభించిన కొద్ది సేపటికే టిక్కెట్లన్నీ పూర్తిగా అయిపోయాయని ఆ పత్రిక తెలిపింది. హై స్పీడ్ రైళ్ళల్లో కూడా సీట్లన్నీ రిజర్వు అయిపోయాయని జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోలుకుంటోన్న చైనా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామని ధీమా వ్యక్తం చేసింది. -
అధ్యక్షుని బర్త్‌డే.. దేశానికి హాలిడే
హరారే: జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పుట్టినరోజు వచ్చే ఫిబ్రవరి 21వ తేదీన దేశమంతటీ సెలవుగా ప్రకటించేశారు. ఈ రోజును నేషనల్ యూత్ డే అని నిర్ణయించారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయం కావాలని అధికార ప్రతిక తెలిపింది. దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టుకు ఆయన పేరు పెట్టాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది. ఒక మిలియన్ డాలర్ల ఖర్చుతో రాబర్ట్ ముగాబే యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి. 1980వ సంవత్సరంలో ఈ దేశానికి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి నుంచి అధికార పీఠంపై కూర్చున్న ఆయన అప్రతిహతంగా అధ్యక్షపదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 93 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆరోగ్యం సహకరించనప్పటికీ వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనున్నట్లు ముగాబే ప్రకటించారు. దేశం 200వ సంవత్సరం నుంచి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది.ప్రభుత్వ ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల వేతనాల చెల్లింపులకే సరిపోతోంది. వచ్చే ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ ఐక్యమై మూకుమ్మడిగా ఒకే అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కి ఆయన పాలన సాగిస్తున్నారని, దేశం ఆర్థిక వెనుకబాటుకు ఆయనే కారణమని ఆరోపణలున్నాయి.