National Institute of Oceanography
-
ఏం జరుగుతోంది?
సాక్షి, విశాఖపట్నం: సముద్రంలో స్వేచ్ఛగా సంచరించే విభిన్న జీవరాశులు విగతజీవులుగా విశాఖ తీరానికి చేరుతున్నాయి. మునుపెన్నడూ చూడని జలచరాలు మృత్యువాత పడి ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. తీరం వెంట ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) సహకారంతో కాలుష్య నియంత్రణ మండలి సిద్ధమవుతోంది. 2019 నాటికి సమగ్ర నివేదిక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. గత రెండు నెలలుగా లోతైన ప్రాంతాల్లో నివసించే సీ స్నేక్‌లతోపాటు అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు, స్టింగ్ రే (టేకు చేప), ముళ్ల చేప తదితరాలు మరణించి తీరానికి కొట్టుకొస్తున్నాయి. అసలు సాగర గర్భంలో ఏం జరుగుతోంది? అరుదైన జీవరాశులు ఇలా విగత జీవులు ఎందుకవుతున్నాయి అనేది నిగ్గు తేల్చనున్నారు. విశాఖ జిల్లావ్యాప్తంగా ఉన్న తీరం వెంట కాలుష్యాన్ని అధ్యయనం చేయాలని కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ ప్రాంతంలో ఫార్మా, రసాయన పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల నిర్వహణ సరిగా లేదనీ, వాటిని సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైడి భీమవరం నుంచి పాయకరావుపేట వరకూ సుమారు 200 కి.మీ. వరకూ ఉన్న తీరంలోని సముద్ర జలాల నమూనాలను సేకరించి, పరీక్షించి నివేదిక ఇవ్వాలని ఎన్ఐవోను కాలుష్య నియంత్రణ మండలి కోరింది. నైరుతి రుతుపవనాలకు ముందు, ఆ తర్వాత తీరంలోనూ, సముద్ర గర్భంలోనూ జరిగే పరిణామాలపై విశ్లేషణాత్మక అధ్యయనం జరగనుంది. దీనికోసం ఎన్‌ఐవోకు రూ.2 కోట్లు చెల్లించేందుకు మండలి అంగీకరించింది. 2009లోనూ ఎన్ఐవో ఈ తరహా అధ్యయనం నిర్వహించి నివేదికను 2010లో అందించింది. సముద్రంలో కాలుష్యం అంతగా లేదని నివేదికలో పేర్కొనడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, తాజా అధ్యయనంలో భాగంగా పారిశ్రామిక వ్యర్థాలు వదిలే 11 చోట్ల నమూనాలు సేకరించడంతోపాటు మరికొన్ని కీలక అనుమానిత ప్రాంతాల్లోనూ సముద్రంలోని నీటి నమూనాలు తీసుకుంటారు. దీంతోపాటు తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడి నీటి శాంపిల్స్ సేకరిస్తారు. వాటిని ప్రయోగశాలలో పరిశీలించి విశ్లేషణాత్మక నివేదికను రూపొందించి 2019లో ఎన్ఐవో నివేదిక సమర్పించనుంది. ఏయే ప్రాంతాల్లో ఎంత మేర సముద్ర కాలుష్యం పెరుగుతుంది? ఎలా పెరుగుతుంది? వంటి అంశాలను నివేదికలో పొందుపరచనుంది. ఎన్‌ఐవోతో సముద్ర జలాల కాలుష్యంపై అధ్యయనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం. విశాఖలో తీరం వెంట ఉన్న ప్రతి అనుమానిత ప్రాంతంలోనూ నమూనాలు సేకరించి వాటి స్థితిగతులు, కాలుష్యం మోతాదు వంటి అంశాలపై నిశిత పరిశీలన చేసి అధ్యయనం చేయాలని ఎన్ఐవో అధికారులకి సూచించాం. ఏడాదిలోపు నివేదిక అందించనున్నారు. – ఎన్వీ భాస్కరరావు, ఏపీపీసీబీ సంయుక్త ప్రధాన పర్యావరణ ఇంజనీర్, విశాఖపట్నం -
విశాఖ తీరంలో చమురు, గ్యాస్!
విశాఖ పోర్టుకు దక్షిణాన 3 చమురు లోయలు.. భీమిలికి ఉత్తర దిశలో మరో 3 లోయలు ♦ ఒక్కోటి 50 – 60 కి.మీ. మేర విస్తరణ ♦ ఎన్ఐవో అన్వేషణలో వెలుగులోకి లోయలు ♦ విశాఖ, సంకల్ప్‌గా నామకరణం ♦ మరింత లోతుగా శాస్త్రవేత్తల పరిశోధనలు సాక్షి, విశాఖపట్నం: విశాఖ సాగర తీరంలో కృష్ణా, గోదావరి(కేజీ) బేసిన్ తరహాలో చమురు, సహజ వాయువులకు అనువైన లోయలు(కాన్యన్లు) ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరానికి ఆనుకుని సముద్రంలో ఈ నిక్షేపాలున్నట్టు గుర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) శాస్త్రవేత్తలు ఆర్వీ సింధు సంకల్ప్ అనే అత్యాధునిక పరిశోధక నౌక ద్వారా విశాఖపట్నం–శ్రీకాకుళంల మధ్య సముద్రంలో ఇటీవల పరిశోధన సాగించారు. ఈ అధ్యయనంలో విశాఖ పోర్టుకు దక్షిణాన మూడు కాన్యన్లు, భీమిలికి ఉత్తర దిశలో మరో మూడు కాన్యన్లు ఉన్నట్టు తేల్చారు. గురువారం విశాఖలోని ఎన్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్ఐఓ(గోవా) యాక్టింగ్ డైరెక్టర్ ఎస్.ప్రసన్నకుమార్, సైంటిస్ట్ ఇన్చార్జి (విశాఖ), సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ జీపీఎస్ మూర్తి వివరాలను వెల్లడించారు. 1963లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర అధ్యయన విభాగం తొలిసారిగా కోస్తాంధ్రలో ఖనిజ నిక్షేపాలపై అన్వేషణ జరిపిందని చెప్పారు. అప్పట్లో విశాఖకు సమీపంలో మూడు కాన్యన్లు ఉన్నట్టు గుర్తించారన్నారు. దీంతో పరిశోధన సాగించిన విశ్వవిద్యాలయానికి ఆంధ్ర(ఎ), ప్రొఫెసర్ మహదేవన్(ఎం), వీసీ వీఎస్ కృష్ణ(కె) పేర్లతో ఏఎంకేగా నామకరణం చేశారని పేర్కొన్నారు. వచ్చే నెలలో కోస్తా తీరం మ్యాపింగ్ మళ్లీ 54 ఏళ్ల తర్వాత అత్యా«ధునిక వెసల్‌తో మార్చి 2 నుంచి నాలుగు రోజుల పాటు మల్టీబీమ్ సర్వే చేపట్టామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పరిశోధనలో సరికొత్తగా ఈ రెండు లోయలు వెలుగు చూశాయన్నారు. ఈ కాన్యన్లు మూడేసి చొప్పున (మొత్తం ఆరు) వేర్వేరుగా ఏర్పడి కొంత దూరం తర్వాత కలిసినట్టు గుర్తించామని తెలిపారు. ఇవి మిలియన్ల ఏళ్ల కిందటే ఏర్పడ్డాయని, ఒక్కొక్కటి 50–70 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయని చెప్పారు. వీటిలో హైడ్రో కార్బన్ నిక్షేపాలున్నాయన్నారు. సేకరించిన శాంపిళ్లను అధ్యయనం చేస్తామని, మరో ఏడాది నాటికి ఎంత పరిమాణంలో నిక్షేపాలున్నాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం మ్యాపింగ్ చేస్తామని పేర్కొన్నారు. తీరంలో మార్పులపై సముద్ర గర్భంలో మరింత లోతుగా పరిశోధనలు సాగిస్తామని, ఇందుకు కొంత సమయం పడుతుందని వివరించారు. విశాఖ, సంకల్ప్‌గా నామకరణం కొత్తగా వెలుగుచూసిన కాన్యన్లుకు విశాఖ, సంకల్ప్‌గా నామకరణం చేసినట్టు ఎన్ఐఓ చీఫ్ సైంటిస్ట్, సంకల్ప్ సింధు రీసెర్చి వెసల్ మేనేజ్మెంట్ అధిపతి పీఎస్ రావు వెల్లడించారు. ఎన్ఐవో కార్యాలయం లో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఇతర దేశాలు, ప్రాంతాల్లో కాన్యన్లు్లన్న సమీప నగరాల పేరును పెడుతున్నారన్నారు. విశాఖకు ఆనుకుని పోర్టుకు సమీపంలో ఉన్న కాన్యన్లకు ‘విశాఖ’ కాన్యన్గాను, భీమిలి వద్ద ఉన్న కాన్యన్ను కనుగొనడంలో సింధు సంకల్ప్ వెసల్ దోహదపడినందున ‘సంకల్ప్’ కాన్యన్గాను పేర్లను సూచించామని చెప్పారు. వీటిని రిజిస్టర్ చేయించాక అధికారికంగా ఖరారు చేస్తామ న్నారు. 2008లో జపాన్ నుంచి కొనుగోలు చేసిన సింధు సంకల్ప్ పరిశోధక వెసల్ ఇప్ప టిదాకా సముద్ర గర్భంలో 100 అన్వేషణ లను సాగించిందని రావు తెలిపారు. వందో క్రూయిజ్‌లో విశాఖ తీరంలో అత్యద్భుత మైన కాన్యన్లను కనుగొనడం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. -
ఇటు కోత..అటు మేట!
పరుపులను తలపించే ఇసుకతిన్నెలు లేవు.. తీరం వెంబడి సరదాగా కూర్చునేందుకు చదునైన చోటూ లేదు. తెల్లని ఇసుకంతా నల్లని బొగ్గుపొడిలా దర్శనమిస్తోంది. ఎగుడు దిగుడు గట్లను తలపిస్తోంది. ఆవేశంతో వస్తున్న కెరటాలు ముందుకెళ్లడం మా వల్లకాదంటూ వెనక్కి తగ్గుతున్నాయి. హుద్‌హుద్ తుఫాన్ దెబ్బకు మునుపటి విశాఖ సాగరతీరం అందాలు చెల్లాచెదురయ్యాయి. నిత్యం వేలాదిమందికి ఆహ్లాదాన్ని పంచే ప్రాంతాల్లో ఇప్పుడు వేల టన్నుల ఇసుక కోతకు గురైంది. మరికొన్ని చోట్ల భారీగా ఇసుక మేటలు వేసింది. మళ్లీ అక్కడ పూర్వ స్థితి రావడానికి ఎన్నాళ్లు పడుతుందో చెప్పలేని పరిస్థితి! సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు విశాఖ తీరం అతలాకుతమైంది. ఎగసిపడ్డ అలలు బీచ్‌రోడ్డును సైతం తాకడంతో సహజసిద్ధంగా పరచుకున్న ఇసుక రూపురేఖల్ని మార్చేసింది. ప్రధానంగా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాల్లో భారీగా ఇసుక కోరుకుపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) విభాగం అంచనాల ప్రకారం ఐదు వేల టన్నుల ఇసుక కోతకు గురై మాయమైంది. మరోవైపు రుషికొండ, ఫిషింగ్ హార్బర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. దీంతో అక్కడా సహజ సౌందర్యానికి గండి పడింది. కోతకు గురైన ఇసుకలో కొంత ఆయా చోట్ల మేటలు వేసినట్టు, చాలావరకు సముద్రంలోకి లాక్కుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై చెన్నై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది. వీరు బీచ్ నుంచి సముద్రంలోకి బోటులో వెళ్లి ఎక్కడెంత ఇసుక పేరుకుపోయిందో, ఎక్కడ నుంచి వెళ్లిందో అధ్యయనం చేస్తారు. భారీగా ఇసుక మాయమవ్వడంతో తిరిగి దానంతట అది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విశాఖ సాగరతీరంలో ఇదివరకటిలా సహజ సుందరమైన ఇసుక తిన్నెలు ఏర్పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సముద్రంలో ఇసుకను తెచ్చి కోతకు గురైన చోట ఫిల్లింగ్ చేయడమే సరైన మార్గంగా భావిస్తున్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ల సాయంతో ఆ పనిని పూర్తి చేయనున్నట్టు తెలిసింది. బీచ్‌లో తగ్గిన సందడి హుద్‌హుద్ బీభత్సం అనంతరం రూపుమారిన బీచ్‌లో హాయిగా పిల్లాపాపలతో గడపడానికి వీలు లేకుండా పోయింది. దీంతో గతంకంటే సంద ర్శకుల తాకిడి తగ్గింది. విశాఖవాసులు గాని, ఇక్కడకు వచ్చే పర్యాటకులు గాని, సందర్శకులు గాని ఆర్కేబీచ్, కురుసుర మ్యూజియంలు చూడకుండా వెళ్లరు. విశాఖ బ్రాండ్ ఇమేజిని పెంచిన వాటిలో వీటిదే అగ్రస్థానం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడకు వెళ్లేందుకు వీరు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇదివరకటిలా ఆర్కే బీచ్, కురుసుర మ్యూజియం ప్రాంతాలు సందర్శకులతో కళకళలాడేందుకు... ఇసుక ఫిల్లింగ్ను వేగవంతం చేసి, మునుపటి రూపురేఖలు సంతరించుకునేలా చేయాలన్న యోచనలో అధికారులున్నారు.