National Judicial Nominating Commission
-
కొలీజియంపై ‘బార్’ విమర్శలు
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ)కి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలంగా మద్దతు తెలిపింది. కొలీజియం వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. సినీ తారలు, రాజకీయ నాయకులకు ఊరటనిస్తూ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయం ఇవ్వని జడ్జీలను ఈ కొలీజియం వ్యవస్థ అందించిందని ధ్వజమెత్తింది. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం జస్టిస్ జె.ఎస్.ఖేహర్ సారథ్యంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. మానవ విలువలు, మానవ హక్కుల ఉల్లంఘన కేసుల్లో సామాన్యులకు న్యాయం అందించలేకపోవటం మనకు సిగ్గుచేటని అన్నారు. ఒకవైపు అల్లర్ల కేసులో దోషిగా నిర్ధారితుడైన మాయా కొద్నాని వంటి వ్యక్తులు ఊరట పొందుతుంటే.. మరొకవైపు తీస్తా సెతల్వాద్ వంటి కార్యకర్తలు ముందస్తు బెయిలు కోసం అన్నివైపులా పరుగులు తీయాల్సి వస్తోందని ఆయన ఒక దశలో తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. న్యాయమూర్తుల వల్లే సినీతారలు, రాజకీయ నేతలకు తక్షణం ఊరట లభిస్తోందన్నారు. జడ్జీలు బురఖాలతో కోర్టుల ఆవరణలో తిరిగితే.. న్యాయవ్యవస్థ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. -
‘జడ్జీలను జడ్జీలే నియమించడం’ వ్యాఖ్యపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం తీవ్ర వాద, ప్రతివాదనలు చోటు చేసుకున్నాయి. ఉన్నత కోర్టుల్లో జడ్జీల నియామకానికి సంబంధించి గతంలో అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ ‘జడ్జీలే జడ్జీలను నియమించడం’ అనే పదాన్ని ఉపయోగించిన అటార్నీ జనరల్‌పై కేసును విచారిస్తున్న ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘వాట్ ఈజ్ దిస్?. పదం క్యాచీగా ఉంది కదా అని వాడినట్లున్నారు. ఇది కరెక్ట్ కాదు. జడ్జీలను నియమించేది జడ్జీలు కాదు. రాష్ట్రపతి’ అంటూ ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ అసహనం వ్యక్తం చేశారు. జడ్జీలే జడ్జీలను నియమిస్తారని రాజ్యాంగ రూపకర్తలు అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చన్న రోహత్గీ వ్యాఖ్యలను ధర్మాసనం తీవ్రంగా తీసుకుంది. ఈ విషయంలో కార్యనిర్వాహక వర్గం నుంచి అధికారం లాగేసుకున్న తీరును చూసి స్వర్గంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బాధ పడి ఉంటారన్న రోహత్గీ కామెంట్‌పై తీవ్రంగా స్పందించిన జస్టిస్ ఖేహర్.. ‘అవును..జరుగుతున్నదంతా చూసి అంబేద్కర్ చాలాసార్లు బాధ పడి ఉంటార’ని తిరిగి అన్నారు. ‘నా వీపు నీవు గోకు.. నీ వీపు నేను గోకుతా’ అన్నట్లు కొలీజియం వ్యవస్థ ఉండేదని, జడ్జీల నియామకం పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్లనే ప్రభుత్వం ఎన్‌జేఏసీని ముందుకు తెచ్చిందని రోహత్గీ వివరించారు.