సుపరిపాలన అందిస్తాం: సూచీ
రోహింగ్యాలపై వివాదాన్ని పెద్దగా చేయొద్దని వినతి
యాంగోన్: మయన్మార్ ఎన్నికల్లో తమ నేషనల్ లీగ్ డెమొక్రసీ పార్టీ గెలిస్తే ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ఆంగ్ సాన్ సూచీ తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మిలటరీ పాలనలో నడుస్తోందని, తాముప్రజాస్వామ్యయుతమైన పాలన అందిస్తామని ఆమె తెలిపారు. ఆదివారం జరగనున్న ఎన్నికల్లో గెలిచాక ఎన్ఎల్డీ ఆదేశాలతో పనిచేసే వ్యక్తిని అధ్యక్షస్థానంలో కూర్చోబెట్టి మరీ.. మయన్మార్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతానని సూచీ ప్రకటించారు.
ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్రకారం ఏ నేత పిల్లలైనా విదేశాల్లో పుడితే ఆ నేత అధ్యక్ష పదవిలో కూర్చునేందుకు అర్హత లేదు. అయితే సూచీ ఇద్దరు పిల్లలకు బ్రిటీష్ పౌరసత్వం ఉన్నందున సూచీ అధ్యక్ష పదవిని అధిరోహించలేరు. మయన్మార్‌లోని మైనారిటీ వర్గమైన రోహింగ్యాల (ముస్లింలు)పై జరుగుతున్న అన్యాయాలను అనవసరంగా పెద్ద వివాదంగా మలచొద్దని సూచీ సూచించారు. ‘ఇదేం చిన్న సమస్య కాదు. అయితే ఇప్పుడు దీనిపై అనవసరంగా వివాదం చేయకండి.
మేం గెలిచాక మతాలకు అతీతంగా అందరి హక్కులను కాపాడతాం’ అని తెలిపారు. ప్రజాస్వామ్య నినాదంతో ప్రచారం చేస్తున్న సూచీ మైనారిటీ వర్గమైన రోహింగ్యాల గురించి మాట్లాడక పోవటంపై విమర్శలు వస్తున్నాయి.