National Maha Sabha
-
అక్టోబర్ 14 నుంచి విజయవాడలో సీపీఐ జాతీయ మహాసభలు
సాక్షి, న్యూఢిల్లీ: సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో నిర్వహించనున్నామని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ మహాసభలకు 29 రాష్ట్రాల నుంచి సీపీఐ నాయకులు పాల్గొంటారని, 20 దేశాల నుంచి కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్ట్ పారీ్టల నాయకులు సౌహార్ధ ప్రతినిధులుగా హాజరవుతారని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం గురువారం ఢిల్లీ ఏపీ భవన్లో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జాతీయ మహా సభ అజెండాపై జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించామన్నారు. జాతీయ మహాసభల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటాయన్నారు. 15న సభకు సీపీఐ నేతలతో పాటు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ఎంఎల్, ఫార్వార్డ్ బ్లాక్ నాయకులు హాజరవుతారని చెప్పారు. 16, 17 తేదీల్లో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అంశాలపై సెమినార్ జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సెక్యులర్ పారీ్టలు, ప్రజాతంత్ర పారీ్టల ముఖ్యమంత్రులు సెమినార్‌కు హాజరవుతారని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌లను ఆహ్వానిస్తామన్నారు. దేశ తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రాజకీయాలు ప్రమాదకరంగా తయారయ్యాయని, దేశంలో లౌకికవాదానికి ప్రమాదం ఏర్పడిందని అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, పాదయాత్ర చేస్తున్న వాళ్లకు సీపీఐ నాయకులు అండగా ఉంటారని తెలిపారు. -
మళ్లీ ఏచూరికే పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నిక కానున్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ఆయన.. మరో మూడేళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జాతీయ మహాసభల వేదికగా పార్టీ కొత్త పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకోనున్నారు. పార్టీ రాజకీయ తీర్మానం విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాల నేపథ్యంలో ఓటింగ్ వరకు వెళ్తే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏచూరి తప్పుకుంటారని ప్రచారం జరిగినా.. ఆ అంశం సామరస్యంగానే పరిష్కారం కావడంతో ఏచూరి మరోసారి అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. కాగా ఈసారి తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రంను పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 16 మంది.. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్ బోస్, బృందాకారత్, పినరయ్ విజయన్, కె. బాలకృష్ణన్, సూర్యకాంత్ మిశ్రా, ఎ.కె.పద్మనాభన్, హన్నన్‌ముల్లా, ఎం.ఎ.బేబీ, సుభాషిణి అలీ, ఎండీ.సలీం, జి.రామకృష్ణన్, బీవీ రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యులుగా పని చేస్తు న్నారు. వీరిలో రాఘవులు ఒక్కరే తెలుగు రాష్ట్రా లకు చెందిన వారు. ఏచూరిది ఏపీ అయినా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం కోటా నుంచి పదవిలో కొనసాగుతున్నారు. రామచంద్రన్ పిళ్లై, ఏకే రాఘవన్ ఈసారి రిటైర్ అవుతారనే చర్చ జరుగుతోంది. వయసు పెరిగిపోవడంతో వీరిద్దరికీ విశ్రాంతి కల్పిస్తారని అంటున్నారు. మళ్లీ కొనసాగాలనుకుంటే పొలిట్‌బ్యూరోలో అవకాశమిస్తారు. అయితే ఈసారి తమ్మినేనిని కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన క్రియాశీలంగా మారారు. పార్టీ స్తబ్ధుగా ఉన్న సమయంలో 4 వేల కి.మీ. పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి వచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పాటు చేసి ఉద్యమాలను ఉధృతం చేశారు.ఇప్పుడు ఈ బీఎల్ఎఫ్ దేశవ్యాప్త సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా మారింది. వీటికితోడు తమ్మినేనికి పార్టీ పట్ల ఉన్న విధేయత, చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకుని పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయనతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నేత విజయ రాఘవన్, ఏపీకి చెందిన సీఐటీయూ నాయకురాలు హేమలతకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా తమ్మినేనితోపాటు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, ప్రత్యేక ఆహ్వానితురాలిగా మల్లు స్వరాజ్యం, ఏపీ నుంచి ఎస్.పుణ్యవతి, పెనుబల్లి మధు, పాటూరి రామయ్య, ఎం.ఎ.గఫూర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పాటూరి ఈసారి రిటైర్ అయ్యే అవకాశాలున్నాయి. ‘29 దేశాల సౌహార్ద సందేశాలు’ సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రపంచంలోని 29 దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తమ సౌహార్ద సందేశాలను పంపాయి. చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలతో పాటు పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలు పంపిన సౌహార్ద సందేశాలను శనివారం ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు. నేడు బహిరంగ సభ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ ఎన్నిక అనంతరం జాతీయ మహాసభల ముగింపు సూచికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. సభను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్ నుంచి రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. ఈ కవాతులో 20 వేల మంది ఎర్ర సైన్యం పాల్గొననుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. దాదాపు మూడు లక్షల మంది ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. -
‘లాల్’ జెండా.. ‘నీల్’ ఎజెండా
సాక్షి, హైదరాబాద్: సీపీఎం చరిత్రలో మరో అధ్యాయానికి తెలంగాణ వేదిక కాబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా ఈ నెల 18 నుంచి 22 వరకు పార్టీ 22వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 764 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరై పలు కీలకాంశాలపై పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ నియమావళిలో పేర్కొన్న వర్గ పోరాటాలకు తోడు సామాజిక అంశాన్ని కూడా చేర్చనున్నారు. వర్గ, సామాజిక జమిలీ పోరాటాలతో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా చరిత్రాత్మక నిర్ణయాన్ని ఈ మహాసభల్లోనే తీసుకోనున్నారు. పార్టీ సైద్ధాంతిక మౌలిక స్వరూపాన్ని సామాజిక ఉద్యమాల దిశగా మార్చుకోవడంతోపాటు దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఏర్పాటు చేసేందుకూ ఆమోదం తెలపనున్నారు. పోరాట పంథా ఇక కొత్తగా.. ఇన్నాళ్లూ వర్గ పోరాట దృక్పథంతో ముందుకెళ్తున్నా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాల రూపకల్పన జరగడం లేదని సీపీఎం భావిస్తోంది. అందులో భాగంగానే విశాఖపట్నంలో 2015లో జరిగిన పార్టీ 21వ జాతీయ మహాసభలో ఈ అంశంపై చర్చ జరిగింది. గత 30 ఏళ్ల నయా ఆర్థిక విధానాల కారణంగా దేశ మౌలిక స్వరూపంలో మార్పు వచ్చిందని, ప్రజా సమస్యల్లో వైరుధ్యం వచ్చిందన్న అంచనాకు పార్టీ వచ్చింది. కార్పొరేట్ సంస్కృతి కార్మిక వర్గ పోరాటాలను దెబ్బతీసిందనే నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగానే వర్గ, సామాజిక జమిలి పోరాటాలు చేయాలన్న చర్చ జరిగినా తుది నిర్ణయం తీసుకోలేదు. ఆ తర్వాత 2015 డిసెంబర్లో జరిగిన కోల్‌కతా మధ్యంతర సమీక్షలో వర్గ, సామాజిక జమిలి పోరాటాల దిశగా ప్రయాణం చేయాలని తీర్మానించింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో మాత్రమే ఆ దిశలో ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మహాసభల్లో సామాజిక అంశాన్ని పార్టీ కార్యక్రమంలో అధికారికంగా చేర్చి పోరాట కార్యాచరణను రూపొందిస్తారని, లాల్ జెండా.. నీల్ ఎజెండా బాటలో పయనిస్తుందని పార్టీ వర్గాలంటున్నాయి. మతోన్మాదంపై పోరాటమే ... రాజకీయ విధానాల విషయానికి వస్తే దేశంలో మతోన్మాదంపై పోరాటమే ప్రధాన ఎజెండాగా చర్చ ఉంటుందని సమాచారం. దేశంలోని తాజా పరిణామాలు, దళితులు, మైనార్టీలపై దాడుల వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనుంది. సంఘ్ పరివార్‌పై పోరాట కార్యాచరణ రూపొందించుకుని దేశవ్యాప్తంగా సామాజిక శక్తులను ఐక్యం చేయాలని నిర్ణయం తీసుకోనుంది. ఎన్నికల ఎత్తుగడల్లో భాగంగా ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం చేయాలని, మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయాలని, దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి కూడా ఈ సభల్లో ఆమోదముద్ర లభించనుంది. కేసీఆర్, చంద్రబాబు దొందూ దొందే తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే కేసీఆర్, చంద్రబాబులు అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారని, వారికి దూరంగానే ఉండాలని సీపీఎం భావిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కేసీఆర్ ప్రయత్నాలు, ఇన్నాళ్లూ బీజేపీతో అంటకాగిన చంద్రబాబుల విషయంలో రాజకీయ వైరంతోనే ముందుకెళ్లాలని భావిస్తోంది. తెలంగాణలో ఏర్పాటు చేసిన బీఎల్ఎఫ్ గొడుగు కిందకు సామాజిక శక్తులను తీసుకురావాలని, కోదండరాం ఏర్పాటు చేసిన జనసమితి, ఇతర వామపక్షాలతో పనిచేయాలనే ఆలోచనలో ఉంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి సీపీఎం 22వ జాతీయ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మహాసభల్లో పార్టీ రాజకీయ పంథాతో పాటు మతోన్మాద రాజకీయాలను తిప్పి కొట్టే అంశంపై ప్రతినిధుల సభ చర్చిస్తుంది. దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఆర్థిక, సామాజిక దోపిడీలపై చర్చించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటాం. – జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మహాసభల ప్రచార కమిటీ కన్వీనర్ -
సొంతకాళ్లపై నిలబడదాం!
జాతీయ మహాసభలో సీపీఎం నిర్ణయం ⇒ జాతీయ స్థాయి పొత్తులు, కూటములు ఉండవు ⇒ రాష్ట్రస్థాయిలో పొత్తులపై నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ⇒ దానికీ కొన్ని షరతులు..!! ⇒ బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకతే ప్రాతిపదిక ⇒ లౌకికవాదం పేరిట ఎవరితో పడితే వారితో దోస్తీకి నై ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సీపీఎం ఇక ముందు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించదు. ఆ స్థానంలో వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ప్రత్యామ్నాయానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కొన్ని షరతులు విధిస్తుంది. ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి, వామపక్ష సంఘటనకు లాభమో పరిగణనలోకి తీసుకునే అవకాశాన్ని రాష్ట్ర పార్టీ శాఖలకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. సీపీఎం 21వ జాతీయ మహాసభల రెండో రోజైన బుధవారం రాజకీయ ఎత్తుగడల పంథాపై చర్చించారు. కాగా, ఎత్తుగడలపై పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరిలు వేర్వేరు పంథాలు వెల్లడించడం గమనార్హం. కారత్ చెబుతున్న విధానం ఏమిటంటే.. ⇒ లౌకిక శక్తులతో వ్యూహాత్మక ఎత్తుగడల పేరిట ఏ పార్టీతో పడితే ఆ పార్టీతో పొత్తులు వద్దు. ⇒ గతం మాదిరే.. మరింత ఉధృతంగా పోరాటాలు చేద్దాం. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులతో మాత్రమే పొత్తులు పెట్టుకుందాం. ⇒ యూపీ, బిహార్, ఏపీలో ప్రాంతీయ పార్టీలు, ⇒ కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని ఎంతో నష్టపోయిన మాట నిజం కాదా?. ⇒ ఆ గుణపాఠాలను పరిగణనలోకి తీసుకుని పాత పద్ధతిలో పోరాటాలు చేద్దాం. ⇒ వామపక్షాలు చిన్నవా, పెద్దవా? అనే దాంతో నిమిత్తం లేకుండా ⇒ అన్ని గ్రూపుల్నీ ఏకం చేద్దాం. ⇒ కేరళలో వామపక్ష సంఘటన నుంచి ఆర్ఎస్పీ తప్పుకుని కాంగ్రెస్‌తో ⇒ కలవడం వల్ల ఎంఎ బేబీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. ⇒ ఆ పార్టీ చిన్నదే కావచ్చు. మనం చెల్లించిన మూల్యం మాత్రం పెద్దది. ⇒ గత 25 ఏళ్ల అనుభవాలు చాలు. పొత్తులు వద్దు. ఇక సొంత కాళ్లపై నిలబడదాం. ⇒ స్వతంత్రంగా ఎదుగుదాం. మనమే ప్రత్యామ్నాయం అని నిరూపిద్దాం. ఏచూరి వర్గం వైఖరి ఇదీ... ⇒ వామపక్ష, ప్రజాతంత్ర ఐక్య సంఘటనకు ప్రయత్నిస్తూనే భావసారూప్యత ఉన్న ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొందాం. ⇒ ప్రాంతీయ, అస్తిత్వ ఉద్యమాలున్న ఈ సమయంలో అందర్నీ కాదనుకుంటే ఎలా? ⇒ మనం చెబుతున్న లాటిన్ అమెరికా, గ్రీస్ తదితర దేశాల్లో సైతం కమ్యూనిస్టులు స్వతంత్రంగా అధికారంలోకి రాలేదు. ⇒ అన్ని వామపక్ష గ్రూపులు, ప్రజాస్వామి కవాదులు కలిస్తేనే అధికారం వచ్చింది. మనమూ అదే పని చేయాలి. ⇒ ప్రాంతీయ పార్టీల్లో లౌకికత్వాన్ని సమర్థించేవాటితో పొత్తుపై నిర్ణయించే స్వేచ్ఛను రాష్ట్ర కమిటీలకు ఇవ్వాలి. ⇒ అవసరం మేరకు ప్రాంతీయపార్టీలతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండాలి. షరతులు వర్తిస్తాయి ‘సాక్షి’తో రాఘవులు ⇒ రాజకీయ ఎత్తుగడల పంథాపై రాఘవులు మాట్లాడుతూ.. ప్రాంతీయ పార్టీలతో పొత్తులపై కొన్ని షరతులుంటాయన్నారు. ⇒ ప్రాంతీయ పార్టీలు, లౌకిక బూర్జువా పార్టీలతో కలసి జాతీయస్థాయిలో పొత్తులుండవు. వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన మాత్రమే జాతీయస్థాయిలో ఉంటుంది. ⇒ ఎన్నికల సమయంలో ఏ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో రాష్ట్ర కమిటీలే నిర్ణయిస్తాయి. ⇒ అయితే, మతతత్వానికి దూరంగా ఉంటూ, సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించాలి. ఉద్యమాల్లో కలసిరావాలి. ⇒ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ అవకాశవాద బూర్జువా పార్టీలే. వీటికి మా ఫ్రంట్‌లో చోటులేదు. అందరూ అంగీకరిస్తున్న విధానాలు ⇒ సొంత పునాదులపైనే ఎదగాలి. వామపక్ష సంఘటనకు ప్రాధాన్యం ఉండాలి. ⇒ సైద్ధాంతిక నిబద్ధత పెరగాలి. అణగారిన వర్గాలకు దగ్గరవ్వాలి. మధ్యతరగతిని ఆకట్టుకోవాలి. ⇒ ఎన్నికల పొత్తులనేవి వామపక్ష ప్రజాతంత్ర శక్తులకు అనుక్రమణికగా ఉండాలే గానీ అవే ప్రధానం కాకూడదు. ⇒ ఈ ముసాయిదాపై చర్చలు గురువారం మధ్యాహ్నంతో ముగుస్తాయి. అనంతరం ప్రకాశ్ కారత్ సమాధానం ఇస్తారు.