National Scholarship Portal
-
పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్షిప్ ఇకపై అందనుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్షిప్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుంటేనే స్కాలర్షిప్లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ సంవత్సరం తప్పనిసరిగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సీహెచ్‌ఓఎల్‌ఏఆర్‌ఎస్‌హెచ్‌ఐపీఎస్.జీఓవీ.ఐఎన్’ లో నవంబర్ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏ విధంగా స్కాలర్షిప్ మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో పోర్టల్‌లో నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం కూడా రెన్యువల్ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలా చేసుకోని వారికి రానున్న కాలంలో స్కాలర్షిప్ అందదని పేర్కొంది. పాఠశాలలు/కాలేజీలు తమ విద్యార్థుల వివరాలను డిసెంబర్ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్ 31లోగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసి తమ అప్లికేషన్‌ను పాఠశాల, డీఈవో కార్యాలయాలు ఆమోదించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్ షిప్‌లకు సంబంధించి ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ను సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
మార్గదర్శకాలు లేని ఉపకారవేతనాలు
కేంద్ర, రాష్ట్ర వైఖరులతో గిరిజన విద్యార్థులకు అవస్థలు సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఉపకారవేతనాల మంజూరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టతలేని వైఖరితో వ్యవహరించడంతో వేలాదిమంది అవస్థలు పడుతున్నారు. దీనిపై సమన్వయం కొరవడి దరఖాస్తు గడువు చేరువవుతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంనుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడమే ఇందుకు కారణమని రాష్ట్ర అధికారులు అంటున్నారు. వాస్తవంగా దరాఖాస్తుదారుల్లో 40శాతం మందికే కేంద్రం ఉపకారవేతనాలను తనవంతుగా చెల్లిస్తుంది. అయితే అందుకు సంబంధించి గైడ్‌లైన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంతో కాకుండా కేంద్రమే వీటిని నేరుగా అందించాలన్న భావనతోనే జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. దీంతో రాష్ట్రప్రభుత్వాల భూమిక ఎలా ఉండాలన్నది తెలియడం లేదని ఇక్కడి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పోస్ట్‌మెట్రిక్‌స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల (జూలై) 31 ఆఖరు తేదీ కాగా రాష్ట్రం నుంచి నేషనల్ పోర్టల్‌లో ఒక్కశాతంమంది కూడా దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఇక ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దర ఖాస్తుకు ఆగస్టు 31 చివరి తేదీగా కేంద్రం ప్రకటించింది. 2015-16లో ఈ విద్యార్థులకు నేరుగా స్కాలర్షిప్లను వారి బ్యాంక్‌ఖాతాల్లో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.అయితే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ పథకాన్ని ఏ విధంగా అనుసంధానిస్తారనే దానిపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో రాష్ట్రాలకు ఎటూ పాలుపోని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్’ ద్వారా www.scholarships.gov.in వెబ్సైట్లో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం నిర్దేశించగా, రాష్ట్రంలో 2008 నుంచి, ఇప్పుడు తెలంగాణ, ఏపీలలో ఈ-పాస్ విధానాన్ని అమలుచేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20,21 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాపును నిర్వహించగా తెలంగాణ, ఏపీ నుంచి ఎస్టీశాఖ ఉన్నతాధికారులు హాజరై తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను గురించి వివరించారు. అయితే ఇప్పటికీ కేంద్రంనుంచి ఉపకార వేతనాలపై స్పష్టమైన వైఖరితో ఆదేశాలు లేక గిరిజన విద్యార్థులు కలవరపడుతున్నారు.