ట్రంప్ నమ్మినబంటుకి కీలక పదవి!
వాషింగ్టన్: తన విశ్వాసపాత్రుడికి కీలక పదవి కట్టబెట్టేందుకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారు. తనకు అత్యంత నమ్మకస్తుడైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మైఖేల్ ఫ్లిన్ ను అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు. నిఘా అధికారిగా పనిచేసిన 56 ఏళ్ల ఫ్లిన్ ముక్కుసూటి మనిషిగా పేరుంది. కొంతకాలంగా ట్రంప్ కు ఆయన సైనిక సలహాదారుగా వ్యవహరిస్తున్నారు.
తీవ్రవాదులకు చేయూతనివ్వడం మానుకోకుంటే పాకిస్థాన్ కు అమెరికా అందిస్తున్న ఆర్థిక సహాయం నిలిపివేయాలని ఫ్లిన్ తన పుస్తకంలో రాశారు. ఉగ్రవాదానికి అంతం చేయడానికి అవసరమైతే రష్యాతో చేతులు కలపాలని ట్రంప్ కు సలహాయిచ్చింది ఆయనేనని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఒకవేళ ఫ్లిన్ అమెరికా భద్రత సలహారుగా ఎంపికైతే సుసాన్ రైస్ స్థానంలో బాధ్యతలు చేపడతారు.