మంచి విత్తనానికి భరోసా ఇవ్వండి
♦ కంపెనీలకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపు
♦ దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య
♦ రెండు దశాబ్దాల్లో 2.75 లక్షల మంది బలవన్మరణం
♦ ఈ పరిస్థితి నివారణకు విత్తన కంపెనీలు ముందుకు రావాలి
♦ విత్తన పంటలకు బీమా సౌకర్యం కల్పిస్తామని వెల్లడి
♦ జాతీయ విత్తన సదస్సు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: దేశంలో అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ నేర నమోదు సంస్థ లెక్కల ప్రకారం 1995 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,75,940 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. సన్న, చిన్నకారు రైతులకు నాణ్యమైన విత్తనం దొరికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో విత్తన కంపెనీలు భరోసా ఇవ్వాలని, దీనికి కంపెనీలు ఏం చేస్తాయో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్ హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరిగే 8వ జాతీయ విత్తన సదస్సును మంత్రి మంగళవారం ప్రారంభించారు.
సదస్సు చేసే తీర్మానాలు, సిఫార్సులు, చర్చలు రైతులకు అనుకూలంగా ఉండాలన్నారు. దేశంలోనే కాకుం డా ప్రపంచంలోనే తెలంగాణ విత్తన భాండాగారంగా వెలుగొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 400కుపైగా విత్తన కంపెనీలున్నాయని, గంటకు 670 మెట్రిక్ టన్నుల విత్తనాలను శుద్ధి చేసే సామర్థ్యం వీటి సొంతమని చెప్పారు. దేశానికి అవసరమైన విత్తనాల్లో 60 శాతం రాష్ట్రం నుంచే సరఫరా అవుతున్నట్లు వెల్లడించారు. అలాగే 14 దేశాలకు విత్తనాలు ఎగుమతి అవుతున్నాయన్నారు. రెండు లక్షల మంది రైతులు 2.9 లక్షల హెక్టార్లలో విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం ఇటీవలే ‘విత్తన గ్రామం’ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ ఏడాది 1,458 గ్రామాలను ఎంపిక చేసి 36,415 మంది రైతులను భాగస్వాములను చేసి 14,500 హెక్టార్లలో 3.30 లక్షల క్వింటాళ్ల విత్తనాల్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. విత్తనాలకు సంబంధించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సు ప్రవేశపెడతామని తెలిపారు. పంటల బీమాను విత్తన పంటలకూ వర్తింపజేసే విషయాన్ని సానుకూలంగా పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పాదకతను పెంచడానికి విత్తనం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు.
పంటల ఉత్పాదకత పెరుగుదలలో ఆధునిక ఆవిష్కరణల పాత్రపై భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తోనఫి మాట్లాడారు. ఈ సదస్సులో కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కాంట్బ్రాడ్ఫోర్డ్, కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి ఎ.కె.శ్రీవాత్సవ, ఇక్రిశాట్ డిప్యూటీ డెరైక్టర్ జనరల్ డాక్టర్ పీటర్కార్బెర్రీ, భారత వ్యవసాయ పరిశోధనల మండలి ఏడీజీ డాక్టర్ చౌహాన్, రాష్ట్ర వ్యవసాయ ఉన్నతాధికారులు ఎం.వీరబ్రహ్మయ్య, వెంకట్రామిరెడ్డి, ఉషారాణి, కావేరీ సీడ్స్ ఎండీ భాస్కర్‌రావు, నూజివీడు సీడ్స్ సీఎండీ ఎం.ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
పేలవంగా ప్రారంభ సభ
మొదటి రోజు సభ పేలవంగా జరిగింది. జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్, కేంద్ర వ్యవసాయ మంత్రి వస్తారని ప్రచారం చేశారు. ఇతరత్రా కారణాల వల్ల ఇద్దరూ రాలేదు. సీఎం రాకపోయినా కనీసం ఇతర మంత్రులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో సమన్వయ లోపం కనిపించింది. వివిధ రాష్ట్రాల నుంచి సరైన ప్రాతినిధ్యం కనిపించలేదు. రైతుల జాడ లేకుండా పోయింది. మొత్తం విత్తన కంపెనీల హవానే కనిపించింది. వారి విత్తనాలకు మార్కెటింగ్ చేసుకునే సదస్సుగా పలువురు విమర్శించారు. రైతు సంఘాల ప్రతినిధులెవరినీ ఆహ్వానించలేదు.