ఇలియట్ రచనా శైలిని అధ్యయనం చేయాలి
ఏయూక్యాంపస్: ఆంగ్ల రచయిత టి.ఎస్ ఇలియట్ వైవిధ్య రచనా శైలిని అధ్యయనం చేయాలని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉదయం ఏయూ ఆంగ్ల విభాగంలో రీ విజిటింగ్ టి.ఎస్ ఇలియట్ జాతీయ సదస్సును ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తర ప్రత్యేక రచనా శైలితో ఇలియట్ ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నారన్నారు. ఇలియట్ రచనలను నేటి తరానికి పరిచయం చేస్తూ, అధ్యయనాలు జరిపించే దిశగా నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం విద్యార్థులు ప్రముఖ రచయితల రచనలు, రచనా విధానాలను తెలుసుకుని అనుసరించాలన్నారు. తమ రచనలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల రచనలను యువత సునిశితంగా పరిశీలించడం అవసరమన్నారు.ఆచార్య విశ్వనాధరావు మాట్లాడుతూ విద్యను అందించిన ఆచార్యులను జీవితాంతం గుర్తుంచుకోవాలన్నారు. ఆచార్య కె.విశ్వనాధం తెలుగు, ఆంగ్ల, సంసత భాషలలో నిష్ణాతుడన్నారు. ఇటువంటి ఆచార్యులు నిరంతరం విద్యార్థులను తీర్చిదిద్దడానికి, పరిశోధనలను పెంపొందించడానికి పాటుపడ్డారని గుర్తుచేసుకున్నారు. బిఓఎస్ చైర్మన్ ఆచార్య టి.నారాయణ మాట్లాడుతూ రచనలో వైశిష్ట్యం, విమర్శనా వ్యాసాలను రచించి తన ప్రత్యేకతను చాటారన్నారు. విభాగాధిపతి ఆచార్య ఎల్.మంజుల డేవిడ్సన్ మాట్లాడుతూ ఆచార్య కె.విశ్వనాథం శత జయంతి సందర్భంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు.ఇలియట్ రచనలపై ఆచార్య విశ్వనాధం విశిష్ట పరిశోధనలు, అధ్యయనం జరిపారని గుర్తుచేశారు. కార్యక్రమంలో విభాగ ఆచార్యులు ఎస్.ప్రసన్నశ్రీ, జయప్రద, సాల్మన్బెన్నీ, విశ్రాంత ఆచార్యులు సుధీర్, చందు సుబ్బారావు, వాసుదేవరావు తదితరులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు.