జాతీయ క్రీడా దినోత్సవ సంబరాలు
– నేటి నుంచి మూడు రోజుల క్రీడాపండుగ
– డీఎస్ఏ, ఆర్డీటీ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
– 29న ర్యాలీ, సాయంత్రం ముగింపు కార్యక్రమాలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: జిల్లాలోని క్రీడాకారులకు శుభవార్త. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ (డీఎస్), ఆర్డీటీ సంస్థలు ప్రత్యేక క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నాయి. డీఎస్ఏ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జిల్లాస్థాయిలో బాక్సింగ్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్, వాలీబాల్, కబడ్డీ పోటీలు ఉండగా.. ఆర్డీటీ ఆధ్వర్యంలో అనంత క్రీడా గ్రామంలోని అకాడమీలకు చెందిన 170 మంది క్రీడాకారులను భాగస్వాములను చేసి క్రికెట్, యోగా, అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ పోటీలు నిర్వహిస్తున్నారు. 170 మంది క్రీడాకారులను 11 మంది సభ్యులతో కూడిన 17 జట్లుగా విడగొట్టి వారిని అన్ని క్రీడల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారుల పేర్లను ఆయా జట్లకు కేటాయించి వారికి మూడు రోజులు పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు ప్రతిరోజు జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించి వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరచిన ఉత్తమ క్రీడాకారులను రోజుకు ముగ్గురు చొప్పున సత్కరించనున్నారు.
సత్కారం అందుకుంటున్న వారి వివరాలు
27–08–2017 : డాక్టర్ అక్బర్ సాహెబ్ – టేబుల్ టెన్నిస్, ప్రకాష్–ఫుట్‌బాల్, ముద్దుకృష్ణ–అథ్లెటిక్స్
28–08–2017 : అబ్దుల్ రజాక్–టెన్నిస్, చంద్రమౌళి–షట్టిల్, మునీర్‌బాషా–హాకీ
29–08–2017 : నరేష్–వాలీబాల్, విశ్వనాథచౌదరి–కబడ్డీ, శ్రీకాంత్‌రెడ్డి–బాస్కెట్‌బాల్
ర్యాలీ
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా 29న ఉదయం టవర్‌క్లాక్ నుంచి డీఎస్ఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.