ఇక ఉత్తమ ఉపాధ్యాయుడికి రూ.50 వేలు
న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడికి అవార్డు రూపంలో ఇచ్చే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రెండింతలు చేసింది. గతంలో ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుకు ఎంపికైన వారికి రూ.25 వేలు ఇవ్వగా ఇక నుంచి రూ.50వేలు అందించనున్నారు. దీంతోపాటు గతంలో మాదిరిగా ఒక సర్టిఫికెట్ వెండిపతకం ఇస్తారు. ఈ విషయాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ బుధవారం లోక్సభలో ప్రకటించింది.
ఇది 2014 నుంచి వర్తించనుంది. గతంలో ఈ అవార్డు రూ.10 వేలుగా ఇవ్వగా దానిని 1999లో రూ.25 వేలకు పెంచారు. అప్పటి నుంచి మరోసారి పెంచడం ఇదే తొలిసారి. ప్రతి ఏటా రాష్ట్రపతి చేతుల మీదుగా సెప్టెంబర్ 5న ఈ అవార్డును అందిస్తారు. ప్రాథమిక, ప్రాథమికొన్నత, ప్రత్యేక అవసరాలు తీర్చగల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో ఉత్తమ సేవలను అందించిన వారిని గుర్తించి ఈ అవార్డును ప్రధానం చేస్తారు. వీరితోపాటు సంస్కృతం, అరబిక్, పర్షియన్ భాషల్లో బోధించే ఉపాధ్యయులకు సంప్రదాయ బద్ధంగా అవార్డును అందిస్తారు.