the National Womens Premier Chess
-
చాంప్ పద్మిని
జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా క్రీడాకారిణి పద్మిని రౌత్ విజేతగా నిలిచింది. మరో రౌండ్ మిగిలి ఉండగానే పద్మినికి టైటిల్ ఖాయమైంది. మంగళవారం జరిగిన పదో రౌండ్లో పద్మిని 94 ఎత్తుల్లో తెలంగాణకు చెందిన హిందూజా రెడ్డిపై గెలిచింది. ప్రస్తుతం పద్మిని 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నిషా మొహతా (పీఎస్‌పీబీ), మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్) ఏడేసి పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఫలితంగా బుధవారం జరిగే చివరిదైన 11వ రౌండ్ గేమ్ ఫలితాలతో ఎలాంటి సంబంధం లేకుండా పద్మినికి టైటిల్ ఖరారైంది. మరోవైపు ఇదే టోర్నీలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు బొడ్డ ప్రత్యూష, కె.లక్ష్మీ ప్రణీతలకు మరో పరాజయం ఎదురైంది. పదో రౌండ్ లో లక్ష్మీ ప్రణీత 54 ఎత్తుల్లో నిషా మెహతా చేతిలో; ప్రత్యూష 38 ఎత్తుల్లో వర్షిణి (తమిళనాడు) చేతిలో ఓడిపోయారు. -
ప్రత్యూషకు రెండో గెలుపు
సాంగ్లీ: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన కె.లక్ష్మీ ప్రణీతతో ఆదివారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ప్రత్యూష 47 ఎత్తుల్లో గెలిచింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి హిందూజా రెడ్డికి ఏడో ఓటమి ఎదురైంది. మేరీ ఆన్ గోమ్స్ (బెంగాల్)తో జరిగిన ఎనిమిదో రౌండ్లో హిందూజా 36 ఎత్తుల్లో పరాజయాన్ని చవిచూసింది. ఎనిమిదో రౌండ్ తర్వాత పద్మిని రౌత్ (ఒడిశా) ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రత్యూష నాలుగు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. 11 రౌండ్లపాటు జరిగే ఈ టోర్నీలో మరో మూడు రౌండ్లు మిగిలి ఉన్నాయి.