అసెంబ్లీకీ.. తలోదారి
సాక్షి, ముంబై : రానున్న అసెంబ్లీ ఎన్నికల ఆట అప్పుడే షురూ అయ్యింది. మాజీ, ప్రస్తుతం పదవిలో ఉన్న మేయర్లు, అనేక ఏళ్లుగా కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారికి అసెంబ్లీ ఎన్నికలపై మోజు పెరిగింది. కానీ అభ్యర్థిత్వం లభించే అవకాశాలు లేకపోవడంతో శివసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారు. ఇలా పార్టీ నుంచి బయట పడినవారంతా ఇతర పార్టీలో చేరాలని లేదా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ బెడద ఆగస్టులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇది శివసేనకు తలనొప్పిగా మారనుంది.
కాంగ్రెస్, ఎన్సీపీదీ ఎవరిదారి వారే?
ప్రస్తుతం కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుల మధ్య కుంపటి రాజుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎవరికి వారే ప్రకటించుకుంటున్నారు. ఇరు పార్టీలపై వ్యతిరేకంగా వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో శివసేన తప్పకుండా లబ్ధి పొందనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శివసేన టికెటుపై పోటీచేస్తే గెలుపు ఖాయమని అందరు భావిస్తున్నారు.
దీన్ని అదనుగా చేసుకుని శివసేన టికెట్టుపై పోటీచేయాలని మాజీ, సిట్టింగ్ మేయర్లు, కార్పొరేటర్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు వీరంతా ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. తమ సమర్థులకే అభ్యర్థిత్వం ఇవ్వాలని నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల మాతోశ్రీ బంగ్లాకు నాయకుల రాకపోకలు పెరిగిపోయాయి.
తెరపైకి అసంతృప్తులు
ఇదిలాఉండగా 2012లో జరిగిన బీఎంసీ ఎన్నికల్లో టికెటు లభించని వారు అనేక మంది ఉన్నారు. ఆ సమయంలో అసంతృప్తితో ఉన్న వీరందరిని అసెంబ్లీ ఎన్నికల్లో మీ గురించి ఆలోచిస్తాం అని చెప్పి బుజ్జగించారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. అప్పుడు అసంతృప్తితో ఉన్నవారంతా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఇచ్చి మాకు న్యాయం చేయాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవేళ వీరిని కాదని మాజీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు లేదా కొత్త ముఖాలకు అభ్యర్థిత్వం కట్టబెడితే అప్పుడు శివసేన పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. పార్టీలోనే తిరుగుబాటు బెడద అధికమై మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. శివసేన, మిత్రపక్షమైన బీజేపీ మధ్య ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలి. కానీ తిరుగుబాట్ల బెడదవల్ల శివసేనకు సీఎం పదవీ చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి అవకాశమివ్వాలి...? ఎవరిని పక్కన బెట్టాలనేది శివసేన నాయకత్వానికి తలనొప్పిగా మారింది.