1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందు పంపిణీ
ఆత్రేయపురం : జిల్లా వ్యాప్తంగా 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రూ.78 లక్షలు మంజూరు చేసిందని పశు సంవర్ధక శాఖ జేడీ వి.వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని పులిదిండి, కట్టుంగ గ్రామాల్లో పశు వైద్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఈనెల 18 నుంచి 31 వరకు ఆయా గ్రామాల్లో 1.5 లక్షల పశువులకు నట్టల నివారణ మందులు పంపీణీ చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ మందు వల్ల పశువుల్లో పారుడు తగ్గి త్వరగా ఎదకు వచ్చి పాలదిగుబడి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశామన్నారు. అలాగే పశువులకు సంబంధించి జిల్లాలో 450 బోన్లు, గ్రామ స్థాయిలో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పొలంలో గడ్డి పెంచితే డెల్టా పరిధిలోని 18 వేలు, వెస్ట్రన్ డెల్టాలో రూ.20వేలు, మెట్టప్రాంతంలో రూ.16వేలు, ఏజెన్సీలో రూ.10 వేలు అందిస్తామన్నారు. పశుగ్రాసాన్ని కిలో రూపాయికి అందించాలని రైతులకు సూచించారు. పశుసంవర్ధక శాఖ ద్వారా అజోల్లా నాచు పెంచుకునేందుకు కిట్లు పంపిణీ చేస్తామన్నారు. కిట్ ఒక్కంటికి రూ.3250 కాగా రూ.325కి అందజేస్తున్నామన్నారు. నాచు, తవుడు నీళ్లల్లో కలిపి పశువులకు పెట్టడం ద్వారా అవి ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి పెరుగుతుందన్నారు. పశుమిత్రలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఆత్రేయపురం, ర్యాలి పశువుల ఆస్పత్రి నిర్మాణాలకు ఒకొక్క భవనానికి రూ.16లక్షలు మంజూరయ్యాయన్నారు. గొర్రెలకు సంబంధించి వచ్చే నెల 5 నుంచి 15 వరుకు శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఆయన ఆత్రేయపురం పశువైద్యశాలను పరిశీలించారు. డీసీసీబీ డైరెక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు, సర్పంచ్లు కనుమూరి ప్రసాదవర్మ, దొడ్డపనేని వెంకట్రావు, ఎంపీటీసీలు గొలుగులవాణి, దండు రాంబాబు, పశుసంవర్ధక శాఖ డీడీ గాబ్రియేల్, ఏడీ విశ్వేశ్వరరావు, వెలిచేరు, ర్యాలి పీహెచ్సీ వైద్యాధికారులు యు.ముఖేష్, రవి తేజ, వైద్య సిబ్బంది సూర్యనారాయణ, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.