breaking news
Nava Rathri celebrations
-
VHP: ‘నుదుటన కస్తూరి తిలకం’తో ‘లవ్ జిహాద్’కు చెక్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాండియా ఆటలు, గర్బా నృత్యాలు ప్రదర్శిస్తుంటారు. ఇటువంటి కార్యక్రమాల్లో హిందువులకు మాత్రమే ప్రవేశం ఉండేలా చూసుకోవాలని వేడకల నిర్వాహకులకు విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ఉత్సవాల్లో పాల్గొనేవారంతా నుదుటన కస్తూరి తిలకం ధరించాలని, పవిత్ర దారం(రక్షాసూత్రం) కట్టుకుని పూజల్లో పాల్గొనాలని కోరింది.రానున్న దసరా వేడుకలను పురస్కరించుకుని నాగపూర్‌లోని విశ్వహిందూ పరిషద్, విదర్భ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తిత్రే మీడియాతో మాట్లాడారు. దేశంలో సోమవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు జరిగే శరన్నవరాత్రులను వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ సభ్యులు పర్యవేక్షిస్తారని, ప్రతీచోటా హిందూ మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనేది చూస్తారని తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేవారిపై తాము గో మూత్రం జల్లుతామని అన్నారు. హిందూ సంప్రదాయ మార్గదర్శకాలను పాటించడం ద్వారా ‘లవ్ జిహాద్’ కేసులను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రతీయేటా నవరాత్రి వేడుకల సమయంలో లవ్ జిహాద్ ఉదంతాలు కనిపిస్తున్నాయన్నారు. మతమార్పిడికి కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.గర్బా అనేది కేవలం నృత్యం కాదని, దేవతను ప్రసన్నం చేసుకునేందుకు ఆచరించే ఒక ఆరాధన అని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి శ్రీరాజ్ నాయర్ పేర్కొన్నారు. హిందూ ఆచారాలపై నమ్మకం ఉన్నవారిని మాత్రమే ఇటువంటి నృత్యాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని నిర్వాహకులకు సూచించారు. ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తూ, సమాజాన్ని విభజిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని అయినా, హిందూ పరిరక్షణకు ఈ మార్గదర్శకాలు అవసరమని బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. గర్బా అనేది హిందువులకు సంబంధించిన వేడుక అని ఇతర మతాల వారు దీనిలో జోక్యం చేసుకోకూడదని మహారాష్ట్ర బీజేపీ మీడియా హెడ్ నవనాథ్ బాన్ అన్నారు. -
నవరాత్రులకు వైష్ణోదేవి ముస్తాబు.. ప్రత్యేక కార్యక్రమాల నిలిపివేత
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలోగల త్రికూట కొండలలో కొలువైన మాతా వైష్ణో దేవి పవిత్ర గుహ ఆలయం శారదా నవరాత్రులకు ముస్తాబయ్యింది. సోమవారం(సెప్టెబర్ 22) నుండి ప్రారంభమయ్యే తొమ్మిది రోజుల ఉత్సవాలకు ఆలయంలో సకల ఏర్పాట్లు చేశారు.నవరాత్రులలో వైష్ణోదేవిని సందర్శించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న దృష్ట్యా యాత్రికులకు సౌకర్యాలు కల్పించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు మాతా వైష్ణో దేవి పుణ్యక్షేత్ర బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 5,200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయాన్ని అత్యంత పవిత్రమైన హిందూ ఆలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి , విదేశాల నుండి కూడా యాత్రికులు వైష్ణోదేవి గుహ మందిరాన్ని సందర్శించేందుకు తరలివస్తారు. నవరాత్రుల ప్రత్యేక ఏర్పాట్ల గురించి ఆలయ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘మాతా వైష్ణో దేవి గర్భగుడి, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అద్భుతమైన పూలతో అలంకరిస్తున్నారని, ఆలయ ప్రాంతాన్ని ఆకర్షణీయమైన, రంగురంగుల లైట్లతో తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.ఉదయం, సాయంత్రం హారతి సమయంలో ప్రముఖ గాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు. మరోవైపు బోర్డు సీఈఓ సచిన్ కుమార్.. వైశ్య భవన్, బాన్ గంగా, తారకోట్ మర్గ్ లలో జరుగుతున్న ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆలయానికి వెళ్లే దారుల వెంబడి 24 గంటలూ నీరు, విద్యుత్ సరఫరా, శానిటైజేషన్, మెడికేర్, ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. కాగా ఆగస్టు 26న కొండచరియలు విరిగిపడి, 34 మంది యాత్రికులు మరణించిన దృష్ట్యా, ఈ ఏడాది ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం లేదు. దుర్ఘటన దరిమిలా ఎల్జీ మనోజ్ సిన్హా ఆగస్టు 29న అదనపు ప్రధాన కార్యదర్శి షలీన్ కబ్రా, ఐజీపీ భీమ్ సేన్ టుటి, జమ్ము డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్‌లతో కూడిన ప్యానెల్‌తో దర్యాప్తునకు ఆదేశించారు. -
కాత్యాయినీ అలంకారంలో బాసర సరస్వతీ దేవి
ఆదిలాబాద్ (బాసర) : ఆదిలాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా సెలవులు, నవరాత్రి ఉత్సవాలు కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆరవ రోజు సరస్వతీ దేవి కాత్యాయినీ అలంకార రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.