జమునకు ‘నవరస నట కళావాణి’ బిరుదు
‘‘ప్రతి ఏడాది నా పుట్టినరోజు నాడు ఆధ్యాత్మిక ప్రముఖులను, కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. అదే విధంగా ఈ ఏడాది సర్వమత గురువులను సన్మానించనున్నాం. జమునగారిని ‘నవసర నట కళావాణి’ బిరుదుతో సత్కరిస్తాం’’ అన్నారు కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. ఈ నెల 17న ఆయన బర్త్డే.
ఈ సందర్భంగా విశాఖలో టి.ఎస్.ఆర్. లలితకళా పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 16న ఆధ్యాత్మిక, 17న సాంస్కృతిక సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ‘‘1978లో ‘30 ఏళ్లు ఏకధాటిగా మీరు కథానాయికగా నటించారు’ అని సిల్వర్ జూబ్లీ వేడుక నిర్వహించారు. ఇప్పుడీ అవార్డుతో సత్కరిస్తున్నట్టు చెప్పారు. చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు జమున. రచయితలు పరుచూరి బ్రదర్స్, జమున కుమార్తె స్రవంతి పాల్గొన్నారు.