దయ చూపమ్మా.. ధనలక్ష్మీ
కడప కల్చరల్:
పదులు, ఇరవైలు, యాభైలు, వంద, ఐదు వందలు, వెయ్యి నోట్లు.. ఇలా కొత్త కరెన్సీ నోట్లు తెంచుకున్నాయి.. అమ్మవారికి అభరణాలయ్యాయి.. పూలమాలలుగా ఒదిగిపోయాయి.. గోడలకు పరదాలుగా.. ఇతర అలంకార సామగ్రిగా దర్శనమిచ్చాయి. çశరన్నవ రాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దాదాపు అన్ని ఆలయాలలో అమ్మవారికి ధనలక్ష్మి అలంకారం చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మవారిని కొలువుదీర్చే వేదిక, ఇతర అలంకార సామాగ్రితోపాటు అమ్మవారికి దుస్తులను కూడా కరెన్సీ నోట్లతోనే ఏర్పాటు చేయడం విశేషం. అమ్మవారిశాలలో సరస్వతిమాతగా అలంకరించి ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు పెసల సత్యనారాయణ, బూరగడ్డ విశ్వనాథం ఆధ్వర్యంలో చిన్నారి బాలలకు పలకలు, పుస్తకాలు, పెన్నులు ఉచితంగా అందజేశారు. శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కాత్యాయిని అలంకారం చేశారు. రాజేశ్వరి ఆలయం, బాల పోలేరమ్మ ఆలయం, నబీకోట శివాలయాలలో అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. గడ్డిబజారు శివాలయంలో కాళీయమర్దనిగా, సరస్వతిదేవిగా అలంకారం చేశారు.