హెచ్1బీతో అమెరికా కంపెనీలకే లాభం
భారత రాయబారి నవతేజ్ సర్నా
వాషింగ్టన్ : హెచ్1బీ వీసాల వల్ల అమెరికా కంపెనీలకే లాభమని ఆ దేశంలోని భారత రాయబారి నవతేజ్ సర్నా చెప్పారు. ఈ వీసాల ద్వారా అమెరికా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వంతోపాటు సృజనాత్మక సామర్థ్యం పెరుగుతుందని, స్థానికంగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అమెరికాలో నిజానికి ఉద్యోగాలు సృష్టిస్తున్నది భారతీయ టెక్నాలజీ పరిశ్రమేనని మంగళవారం సీఎన్ఎన్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూ లో చెప్పారు.
‘అమెరికాలో 4 లక్షల కొత్త కొలువులు వచ్చే అవకాశముందని చట్టసభలే చెప్పాయి. భారతీయ కంపెనీలు గత నాలుగేళ్లలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టి, 20 బిలియన్ల పన్నులు చెల్లించాయి. ప్రతి 100 హెచ్1బీ వీసాల వల్ల అమెరికాలో 183 ఉద్యోగాలకు చేయూత లభిస్తోంది. భారత్‌లో టాప్ 15 టెక్ కంపెనీల్లో 9 అమెరికా కంపెనీలే. ఈ అనుబంధం వల్ల ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయి’ అని చెప్పారు.
భద్రతా సలహాదారు రాజీనామా
రష్యాతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైకేల్ ఫ్లిన్ తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఫ్లిన్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా చేపడుతున్న కార్యకలాపాల వివరాలను రష్యా రాయబారితో చర్చించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.