‘నవీముంబై’లో కాంగ్రెస్‌తో పొత్తు
- కూటమిగా కొనసాగాలని నిర్ణయం
- స్వతంత్ర అభ్యర్థుల మద్దతు కూడగట్టిన పార్టీలు
సాక్షి, ముంబై: నవీముంబై కార్పొరేషన్లో కూటమిగా కొనసాగాలని ఎన్సీపీ, కాంగ్రెస్ నాయకులు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎంపిక చేసేందుకు మార్గం సుగమమైంది. నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజే పీ, శివసేన కలసి పోటీ చేయగా కాంగ్రెస్, ఎన్సీపీ ఒంటరిగా పోటీకి దిగాయి. కాని ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది.
కార్పొరేషన్లో మొత్తం 111 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్‌కు 56 స్థానాలు కావాలి. ఇందులో ఎన్సీపీకి 52 స్థానాలు రావడంతో అధికారం చేజిక్కించుకునేందుకు ఈ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. తమకు ఐదుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని, పది స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్‌తో జతకట్టాల్సిన అవసరం లేదని ఫలితాల తరువాత ఎన్సీపీ స్పష్టం చేసింది. దీంతో ఇండిపెండెంట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. సోమవారం జరిగిన చర్చల్లో కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు అశోక్ చవాన్, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తట్కరే కూటమిగా కొనసాగాలనే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఎన్సీపీ 52, కాంగ్రెస్ 10 స్థానాలతో మొత్తం సంఖ్య 62కు చేరింది.
ఐదుగురు ఇండిపెండెంట్లు కూడా కూటమితో కొసాగడంవల్ల ఈ సంఖ్య 67కు చేరనుంది. ఇండిపెండెంట్ల సాయంతో అధికారం ఏర్పాటుకు బీజేపీ, శివసేన కూడా ప్రయత్నించాయి. అయితే కాంగ్రెస్ ఎన్సీపీతో జతకట్టడం వల్ల కాషాయ కూటమి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఎన్సీపీ అభ్యర్థి ఐదేళ్లు మేయర్‌గా పనిచేస్తారు. కాంగ్రెస్‌కు చెందిన 10 మంది కార్పొరేటర్లలో ఇద్దరు రెండున్నర ఏళ్ల చొప్పున డిప్యూటీ మేయర్ పద విలో కొనసాగుతారు. మిగిలిన ఎనిమిది మంది వివిధ కమిటీ పదవుల్లో కొనసాగుతారు.