సంచారజాతులు సుఖీభవ
భారత రాజ్యాంగం సాక్షిగా సంచార జాతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. సంచారజాతులకు సమున్నత స్థానం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరి పిల్లల్లాగే సంచారజాతుల పిల్లలు కూడా పుస్తకాల సంచులు భుజాన వేసుకొని బడులకు అడుగులు వేయాలని ఆయన అభిలషిస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలలో వారి పిల్లల్ని చేర్పించేందుకు సాంఘిక సంక్షేమ అధికారులు కృషి చేస్తున్నారు. సంచారజాతుల సమగ్రజీవన విధానంపై అధ్యయనం చేయాల్సిందిగా కేసీఆర్ బీసీ కమిషన్‌ను ఆదేశించారు. ఎంబీసీలకు ఉన్న కనీస రక్షణ కూడా సంచారజాతులకు లేదు. నాగరిక సమాజానికి వారు ఎంతో దూరంలో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించిన అలాంటి వారందరికీ న్యాయం చేసే కృషి మొదలైంది. 1968లో ఏర్పడ్డ అనంతరామన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించింది. ఆ తర్వాత వచ్చిన మురళీధర్‌రావు కమిషన్ దాన్ని ఏ విధంగా అమలు జరపాలో చెప్పింది.
బ్రిటిష్ ప్రభుత్వం 1871లో ఎస్టీ, ఎస్సీలలోని సంచారజాతులను క్రిమినల్ ట్రైబ్స్ అంది. భారత ప్రభుత్వం 1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ అనే అపవాదం నుంచి విముక్తం చేస్తూ వీరిని విముక్త జాతులు అంది. కానీ సంచారజాతుల వారికి నిలకడ ఉండదు. సంచారమే వారి జీవనం. వారిని నిలకడగల స్థానంలో నిలబెట్టే పని చేయాలి. వారికి ఇళ్లు ఉండవు. వారి పిల్లలకు చదువులుండవు. వారికి ప్రత్యేకంగా ఒక ఊరంటూ కూడా లేని వారున్నారు. వారిని సెటిల్ చేయాలన్నదే లక్ష్యం. ఇప్పుడు ఊరు–వాడ మాత్రమే లెక్కకు వస్తున్నాయి. కానీ, లెక్కలోకి రానిది ఊరులేని కడగొట్టు వారు సంచారజాతి. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీలకుప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‌ను వేసింది. ఇటీవల సంచారజాతులకు చెందిన వారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తులను బీసీ కమిషన్‌కు అందించింది. వారు అనేక విషయాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతోపాటుగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు తమతో కలసి ఒక రోజంతా ఉండాలన్న కోరిక ఉందని తెలిపారు. కేసీఆర్ వారితో కలసి భోజనం చేయడమే కాదు, వారి జీవన ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రణాళికలు రూపొందించే పని మొదలైంది. సంచారజాతులు సుఖీభవ!
నేడు సంచార జాతుల విముక్త దినం
వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు‘ మొబైల్: 9440169896
జూలూరు గౌరీశంకర్