Navy employe
-
కూలిన గ్లైడర్.. ఇద్దరు నేవీ సిబ్బంది మృతి
తిరువనంతపురం: నేవీ పవర్ గ్లైడర్ కూలిన ప్రమాదంలో ఇద్దరు నేవీ సిబ్బంది మరణించిన ఘటన ఆదివారం ఉదయం కేరళలోని తొప్పంపడీ బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తూ ఉన్న సమయంలో ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లెఫ్టినెంట్ రాజీవ్ ఝా, పెట్టీ ఆఫీసర్ సునీల్ కుమార్‌లను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే వారు మరణించారని వైద్యులు తెలిపారు. రాజీవ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, సునీల్‌కు పెళ్లి కాలేదని అధికారులు చెప్పారు ఈ ఘటనపై దక్షిణ నేవీ కమాండ్ విచారణకు ఆదేశించింది. -
రిటైర్డ్ నేవీ ఆఫీసర్‌పై కత్తులతో దాడి
-
ఐదు మృతదేహాల వెలికితీత
సాక్షి, ముంబై: నగరంలోని నౌకాశ్రయంలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదానికి గురైన ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో గల్లంతైన 18 మంది నేవీ సిబ్బందిలో శుక్రవారం నాటికి ఐదుగురి మృతదేహాలు లభించాయి. పేలుళ్లు, అగ్ని ప్రమాదం కారణంగా శవాలు గుర్తుపట్టరాని విధంగా మారాయి. డీఎన్ఏ పరీక్షలు చేస్తే తప్ప ఆ శవాలు ఎవరివన్నది తేల్చలేమని నేవీ అధికారులు వెల్లడించారు. దీంతో ఏదో అద్భుతం జరిగి కొందరైనా బతికి ఉండకపోతారా? అన్న ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. మరోవైపు జలాంతర్గామిలోని మిగతా 13 మంది నౌకాదళ సిబ్బంది ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. వీరి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్రంగా ధ్వంసమైన జలాంతర్గామిలోకి వెళ్లేందుకు గజ ఈతగాళ్ల ప్రయత్నం 36 గంటల అనంతరం ఫలించింది. మొదటి కంపార్ట్మెంట్ నుంచి రెండవ కంపార్ట్మెంట్లోకి వారు ప్రవేశించగలిగారు. ఎట్టకేలకు శుక్రవారం ఐదు శవాలను వెలికితీశారు. శవాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా ఎవరివి? అన్నది నిర్ధారించేందకుగాను ‘ఐఎన్ఎస్ అశ్వినీ’ ఆసుపత్రికి తరలించినట్లు నేవీ అధికారులు తెలిపారు. జలాంతర్గామిలో చిక్కుకున్న ముగ్గురు అధికారులు, 15 మంది నావికుల వివరాలను నేవీ గురువారం వెల్లడించింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నావి కులు.. దాసరి ప్రసాద్, రాజేశ్ తూతిక, సీతారాం బాడపల్లె కూడా ఉన్న విషయము తెలిసిందే. కాగా, జలాంతర్గామిలో చిక్కుకున్నవారిలో తమిళనాడుకు చెందిన అధికారి ఆర్.వెంకట్రాజ్ కూడా ఉన్నారు. ఈ సబ్‌మెరైన్‌లో ఆయనకు ప్రత్యేక చాంబర్ ఉందని, అందులో 15 రోజులకు సరిప డా ఆక్సిజన్, ఆహార పదార్థాలుంటాయి కాబట్టి ఆ చాంబర్ ధ్వంసం కాకపోతే ఆయన బతికే అవకాశముందని భావిస్తున్నారు. బురదనీరు, చీకటితో తీవ్ర ఇబ్బందులు... జలాంతర్గామిలో మంటలు, వేడి వల్ల నీరు మరుగుతుండటంతో బుధవారం దాకా డైవర్లు లోపలికి వెళ్లలేకపోయారు. బురద నీటితోపాటు చిమ్మచీకటి వల్ల శుక్రవారం కూడా సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. జలాంతర్గామి కంట్రోల్ రూం ధ్వంసం కావడం, లోపలి ఉక్కు కరిగిపోవడం, నిచ్చెనలు వంగిపోవడం వల్ల లోపలికి వెళ్లేందుకు దారి దొరకడం లేదు. తీవ్ర వేడి, మంటల వల్ల శవాలు భస్మం అయిపోయి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. శక్తివంతమైన లైట్లను వినియోగిస్తున్నప్పటికీ ఏమీ కనిపించడంలేదని, అయినా మిగతావారి కోసం అడుగడుగునా గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. తమవారి కోసం ఎదురుచూపులు... సింధురక్షక్ ప్రమాదానికి గురైందన్న వార్త.. అందులోని 18 మంది సిబ్బంది కుటుంబసభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న అనేక మంది ముంబైకి చేరుకున్నారు. వీరికి సమాచారం అందించేందుకు అధికారుల నేతృత్వంలో ఫ్యామిలీ సెల్‌ను ఏర్పాటు చేశారు. నేవీ సిబ్బంది మృతి.. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పేర్కొంటూ ముంబై పోలీసులు కేసు నమోదుచేశారు. జలాంతర్గామిలో పేలుడు ఘటన విద్రోహపూరిత చర్య అని చెప్పేందుకు ఆధారాలేమీ లభించలేదని నేవీ ప్రకటించింది. విచారణకు సహాయపడతామన్న రష్యా: సింధు రక్షక్ ప్రమాదంపై దర్యాప్తులో సహాయం చేస్తామని రష్యా తెలిపిం ది. సింధురక్షక్‌ను రష్యాలో ఇటీవలే ఆధునీకీకరించి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, నేవీ సిబ్బంది గాలింపు చర్యల్లో సాయపడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు తెలిపాయి. రాష్ట్రపతి, విజయమ్మ సంతాపం: నేవీ సిబ్బంది మృతిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి మరణం బాధాకరమని, వారి కుటుంబాలకు ఈ విపత్తును తట్టుకునే స్థైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ డీకే జోషీకి పంపిన సందేశంలో పేర్కొన్నారు. నేవీ సిబ్బంది మృతి పట్ల వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అసువులుబాసిన రాష్ట్ర నావికులు తూతిక రాజేష్, దాసరి దుర్గాప్రసాద్, సీతారాం బాడపల్లె కుటుంబాలకు, ఇతర సిబ్బంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
కన్నీటి కడలి
పెదగంట్యాడ/సింహాచలం, న్యూస్‌లైన్ : ముంబయి డాక్ యార్డులో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఐఎన్ఎస్ సింధు రక్షక్ సబ్‌మెరైన్ పేలుడు ప్రమాదంలో విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన మెకానికల్ ఇంజినీర్ తూతిక రాజేష్, అడవివరం కాపుదిబ్బ ప్రాంతానికి చెందిన చీఫ్ పెట్టీ ఆఫీసరు దాసరి ప్రసాద్ గల్లంతయ్యారు. పదోన్నతిపై ముంబయికి.. : నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్ (29) సైలర్‌గా పదేళ్ల క్రితం ముంబయి నేవల్ డాక్‌యార్డులో చేరారు. ఆరేళ్లపాటు అక్కడ పనిచేసిన అతను బదిలీపై విశాఖపట్నం డాక్‌యార్డుకు వచ్చారు. దూరవిద్యలో బీటెక్ పూర్తి చేయడంతో సబ్‌మెరైన్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. రాజేష్‌కు శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామానికి చెందిన దంతం జ్యోతితో 2011 జూన్‌లో వివాహమైంది. రాజేష్‌కు ముంబయి డాక్‌యార్డుకు బదిలీ కావడంతో రెండు నెలలుగా భార్యతో కలిసి ముంబయి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదంలో రాజేష్ గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న అతని భార్య జ్యోతి సోదరులు దయానంద్, సింహాచలంలకు నేవల్ అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్లో ఈ విషాద వార్తను తెలిపారు. దీంతో రాజేష్ తల్లిదండ్రులైన అప్పలనాయుడు, కృష్ణవేణి శోకసముద్రంలో మునిగిపోయారు. చివరి సంతానం కావడంతో రాజేష్‌ను అల్లారుముద్దుగా పెంచారు. ఈ వార్త విని అతని స్నేహితులు చలించిపోయారు. రాజేష్‌కు సోదరుడు రవికుమార్, సోదరి రోజా ఉన్నారు. రాత్రే ఫోన్ చేశాడు : మంగళవారం రాత్రే రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను 15 నుంచి 20 రోజుల వరకూ విధుల్లో చాలా బిజీగా ఉంటానని, భార్య జ్యోతిని ముంబయి లో రెలైక్కించి విశాఖ పంపిస్తానని తెలిపాడు. ఏమిటీ ఘోరం! : ఈ ప్రమాదంలో గల్లంతైన చీఫ్ పెట్టీ ఆఫీసర్ దాసరి ప్రసాద్ (35)ది మరింత విషాదం. మరి కొద్దిగంటల్లో తనకు కొడుకో...కూతురో జన్మిస్తారని అతను ఎంతో ఆనందంగా ఉన్నారు. భార్యను ఆస్పత్రిలో కలవాలని సెలవు కూడా పెట్టుకున్నారు. ఆ దంపతుల ఆనందాన్ని విధి ఓర్వలేక పోయింది. మరికొద్ది గంటల్లో విధి నిర్వహణ పూర్తవుతుందనగా అతను సాగరంలో గల్లంతయ్యారు. ఇపుడు ఆ విషాదాన్ని భార్యకు చెబితే పుట్టబోయే బిడ్డకేమవుతుందో...తల్లిదండ్రులకు, అత్తింటివారికి చెబితే వారు తట్టుకోలేరేమోనని సంద్రమంత శోకాన్ని గుండెల్లో దిగమింగుకుని సోదరులు సమాచారాన్ని గుట్టుగా ఉంచారు. అతని సోదరుడు వెంటనే ముంబ య్ వెళ్లారు. అడవివరం కాపుదిబ్బ ప్రాంతానికి చెందిన ప్రసాద్‌కు ఐదేళ్లక్రితం విజయవాడకు చెందిన మానస లక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు పౌష్య ఉం ది. ఉద్యోగరీత్యా ప్రసాద్ ముంబయ్‌లో ఉం టున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన అడవివరంలో ఇంటికి వచ్చి వెళ్లారు. భార్యకు మరో పది రోజుల్లో డెలివరీ కావచ్చని వైద్యులు చెప్పడంతో ఆమెను ఇటీవలే పుట్టింటికి విజయవాడ పంపారు. ప్రసాద్ ముంబయ్ నుంచి భార్య డెలివరీ సమయానికి రావడానికి సెలవు కూడా పెట్టారు. అయితే ఆయన మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా బుధవారం తెల్లవారుజాము సమయంలో ఆయన ప్రయాణిస్తున్న సింధు రక్షక్ నేవల్ సబ్‌మెరైన్‌లో తీవ్రమయిన మంటలు వ్యాపించి, పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ చిక్కుకున్నాడని తెలియడంతో అడవివరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రసాద్ భార్య మానస లక్ష్మికి ఈ వార్త తెలియనీయలేదు. ప్రసాద్ సోదరుడు వరాహనరసింహం బుధవారం మధ్యాహ్నం హుటాహుటిన విమానంలో ముంబాయి వెళ్లారు. సైన్యంపై మమకారంతోనే.. : దాసరి ప్రసాద్‌కి సైన్యంలో పని చేయడమంటే ఇష్టం. అందుకే ఆయన సెయిలర్‌గా పదవీ విరమణ కాలం 15 ఏళ్లు పూర్తయినా చీఫ్ పెట్టీ ఆఫీసరుగా పదోన్నతి రావడంతో నేవీలోనే ఉండిపోయారు. ప్రసాద్ తల్లిదండ్రులు అప్పారావు అచ్చయ్మ అడవివరంలోనే ఉంటున్నారు. వీరికి వున్న ఐదుగురు సంతానంలో ప్రసాద్ ఆఖరి కొడుకు.