కన్నీటి కడలి | Explosion, fire on submarine in Mumbai traps 18 sailors; some killed | Sakshi
Sakshi News home page

కన్నీటి కడలి

Published Thu, Aug 15 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM

కన్నీటి కడలి

కన్నీటి కడలి

పెదగంట్యాడ/సింహాచలం, న్యూస్‌లైన్ : ముంబయి డాక్ యార్డులో బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఐఎన్‌ఎస్ సింధు రక్షక్ సబ్‌మెరైన్ పేలుడు ప్రమాదంలో విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామానికి చెందిన మెకానికల్ ఇంజినీర్ తూతిక రాజేష్, అడవివరం కాపుదిబ్బ ప్రాంతానికి చెందిన చీఫ్ పెట్టీ ఆఫీసరు దాసరి ప్రసాద్ గల్లంతయ్యారు.
 
 పదోన్నతిపై ముంబయికి.. : నెల్లిముక్కు గ్రామానికి చెందిన తూతిక రాజేష్ (29) సైలర్‌గా పదేళ్ల క్రితం ముంబయి నేవల్ డాక్‌యార్డులో చేరారు. ఆరేళ్లపాటు అక్కడ పనిచేసిన అతను బదిలీపై విశాఖపట్నం డాక్‌యార్డుకు వచ్చారు. దూరవిద్యలో బీటెక్ పూర్తి చేయడంతో సబ్‌మెరైన్ ఇంజినీర్‌గా పదోన్నతి పొందారు. రాజేష్‌కు శ్రీకాకుళం జిల్లా బత్తిలి గ్రామానికి చెందిన దంతం జ్యోతితో 2011 జూన్‌లో వివాహమైంది. రాజేష్‌కు ముంబయి డాక్‌యార్డుకు బదిలీ కావడంతో రెండు నెలలుగా భార్యతో కలిసి ముంబయి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.

సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో ప్రమాదంలో రాజేష్  గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని హైదరాబాద్‌లో ఉంటున్న అతని భార్య జ్యోతి సోదరులు దయానంద్, సింహాచలంలకు నేవల్ అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్‌లో ఈ విషాద వార్తను తెలిపారు. దీంతో రాజేష్ తల్లిదండ్రులైన అప్పలనాయుడు, కృష్ణవేణి శోకసముద్రంలో మునిగిపోయారు. చివరి సంతానం కావడంతో రాజేష్‌ను అల్లారుముద్దుగా పెంచారు. ఈ వార్త విని అతని స్నేహితులు చలించిపోయారు. రాజేష్‌కు సోదరుడు రవికుమార్, సోదరి రోజా ఉన్నారు.
 
 రాత్రే ఫోన్ చేశాడు : మంగళవారం రాత్రే రాజేష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను 15 నుంచి 20 రోజుల వరకూ విధుల్లో చాలా బిజీగా ఉంటానని, భార్య జ్యోతిని ముంబయి లో రెలైక్కించి విశాఖ పంపిస్తానని తెలిపాడు.  
 
 ఏమిటీ ఘోరం! : ఈ ప్రమాదంలో గల్లంతైన చీఫ్ పెట్టీ ఆఫీసర్ దాసరి ప్రసాద్ (35)ది మరింత విషాదం. మరి కొద్దిగంటల్లో తనకు కొడుకో...కూతురో జన్మిస్తారని అతను ఎంతో ఆనందంగా ఉన్నారు. భార్యను ఆస్పత్రిలో కలవాలని సెలవు కూడా పెట్టుకున్నారు. ఆ దంపతుల ఆనందాన్ని విధి ఓర్వలేక పోయింది. మరికొద్ది గంటల్లో  విధి నిర్వహణ పూర్తవుతుందనగా అతను సాగరంలో గల్లంతయ్యారు.

ఇపుడు ఆ విషాదాన్ని భార్యకు చెబితే పుట్టబోయే బిడ్డకేమవుతుందో...తల్లిదండ్రులకు, అత్తింటివారికి చెబితే వారు తట్టుకోలేరేమోనని సంద్రమంత శోకాన్ని గుండెల్లో దిగమింగుకుని సోదరులు సమాచారాన్ని గుట్టుగా ఉంచారు. అతని సోదరుడు వెంటనే  ముంబ య్ వెళ్లారు. అడవివరం కాపుదిబ్బ ప్రాంతానికి చెందిన ప్రసాద్‌కు ఐదేళ్లక్రితం విజయవాడకు చెందిన మానస లక్ష్మితో వివాహమైంది. ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు పౌష్య ఉం ది. ఉద్యోగరీత్యా ప్రసాద్ ముంబయ్‌లో ఉం టున్నారు. కొద్దిరోజుల క్రితమే ఆయన అడవివరంలో ఇంటికి వచ్చి వెళ్లారు.

భార్యకు మరో పది రోజుల్లో డెలివరీ కావచ్చని వైద్యులు చెప్పడంతో ఆమెను ఇటీవలే పుట్టింటికి విజయవాడ పంపారు. ప్రసాద్ ముంబయ్ నుంచి భార్య డెలివరీ సమయానికి రావడానికి సెలవు కూడా పెట్టారు. అయితే ఆయన మంగళవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా బుధవారం తెల్లవారుజాము సమయంలో ఆయన ప్రయాణిస్తున్న సింధు రక్షక్ నేవల్ సబ్‌మెరైన్‌లో తీవ్రమయిన మంటలు వ్యాపించి, పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ చిక్కుకున్నాడని తెలియడంతో అడవివరంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రసాద్ భార్య మానస లక్ష్మికి ఈ వార్త తెలియనీయలేదు. ప్రసాద్ సోదరుడు వరాహనరసింహం బుధవారం మధ్యాహ్నం హుటాహుటిన విమానంలో ముంబాయి వెళ్లారు.
 
 సైన్యంపై మమకారంతోనే.. : దాసరి ప్రసాద్‌కి సైన్యంలో పని చేయడమంటే ఇష్టం. అందుకే ఆయన సెయిలర్‌గా పదవీ విరమణ కాలం 15 ఏళ్లు పూర్తయినా చీఫ్ పెట్టీ ఆఫీసరుగా పదోన్నతి రావడంతో నేవీలోనే ఉండిపోయారు. ప్రసాద్ తల్లిదండ్రులు అప్పారావు అచ్చయ్మ అడవివరంలోనే ఉంటున్నారు. వీరికి వున్న ఐదుగురు సంతానంలో ప్రసాద్ ఆఖరి కొడుకు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement