ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
అమలాపురం : అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అధ్యా పకుడి వేధింపులే కారణమంటూ విద్యార్థులు ఆగ్రహించి కళాశాలలో విధ్వంసానికి పాల్పడ్డారు. కళాశాలలో సివిల్ బ్రాంచి రెండో ఏడాది విద్యార్థి అమరా నవ్య క్రాంతికుమార్(20) శనివారం తన అద్దె గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. విద్యార్థి మృతికి ప్రిన్సిపాల్, అధ్యాపకుల వేధింపులే కారణమని ఆరోపిస్తూ తోటి విద్యార్థులు ఆగ్రహించారు. కళాశాల ఆవరణలో ఉన్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన క్రాంతికుమార్ ఓడలరేవు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదే మండలంలోని కొమరగిరిపట్నంలో కొంతమంది విద్యార్థులతో కలిసి ఉంటున్న వసతి గదిలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
కళాశాలలో శుక్రవారం క్రాంతికుమార్ కు, ఓ అధ్యాపకుడికి మధ్య నోట్సు విషయ మై శుక్రవారం వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో క్రాంతికుమార్ తన పెన్నును ఆయన పైకి విసిరాడు. శనివారం ఉదయం కళాశాలకు వచ్చి తరగతికి హాజరయ్యాడు. అయితే అధ్యాపకుడు ‘నీకు హాజరు ఇవ్వం, ప్రిన్సిపాల్‌ను కలవ’మని సూచించారు. దీనితో క్రాం తికుమార్ ప్రిన్సిపాల్‌ను కలి శాడు. ‘నీ చదువు, హాజరు సంతృప్తికరం గా లేవు, పెపైచ్చు అధ్యాపకునితో వివాదానికి దిగావు, నీ తల్లిదండ్రులను తీసుకువస్తేనే కళాశాలకు అనుమతిస్తా’మని ప్రిన్సిపాల్ తెగేసి చెప్పారు. దీంతో క్రాంతికుమార్ ‘నేను మా రూమ్‌కు వెళిపోతాను, నా ఫోను ప్రిన్సిపాల్ తీసుకున్నారు. మా ఇంట్లో ఎవరైనా ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్‌గారు రమ్మన్నారని చెప్పండి’ అని తన రూంమేట్లకు చెప్పి గది తాళం తీసుకుని కొమరగిరిపట్నంలోని రూమ్‌కు వెళ్లిపోయాడు.
ఓ గంట తర్వాత భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు రూమ్‌కు వచ్చారు. తాళం తీసి చూడగా అప్పటికే క్రాంతికుమార్ గదిలోని ఫ్యాన్‌కు వేలాడుతున్నాడు. 108కు సమాచారం అందించగా, అప్పటికే క్రాంతికుమార్ మరణించినట్టు సిబ్బంది తెలిపారు. అయి నా అతడి మిత్రులు బీవీసీకి చెందిన అంబులెన్సులో అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి క్రాంతికుమార్‌ను తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. తమ కళాశాల విద్యార్థి మరణాన్ని తోటి విద్యార్థులు జీర్ణించుకోలేక ఆగ్రహంతో ఓడలరేవు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహోద్రిక్తులై కళాశాలకు చెందిన బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అమలాపురం ఏరియా ఆస్పత్రిలో క్రాంతికుమార్ మృతదేహానికి పోలీసులు శనివారం రాత్రి శవపంచనామా నిర్వహించారు. అమలాపురం రూరల్ సీఐ డి.శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ప్రిన్సిపాల్ వివరణ
‘క్రాంతికుమార్ చదువుపై శ్రద్ధ పెట్టడం లేదు. హాజరు శాతం కూడా తక్కువగా ఉంది. తరగతి గదిలో నోట్సు రాయమన్న అధ్యాపకుడిపై పెన్ను విసిరాడని ఫిర్యాదు అందింది. దీనిపై శనివారం అధ్యాపకుల సమక్షంలో పిలిపించి మాట్లాడాను. దీనిపై తల్లిదండ్రులతో మాట్లాడాలి తీసుకురమ్మని అతడితో చెప్పి పంపించాను. తన రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అంబులెన్సు పంపాం. ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా చనిపోయాడు. ఇందులో అధ్యాపకులు కానీ, తాను కానీ అతన్ని వేధించలేదు’ అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీఎస్వీ ప్రసాద్ వివరణ ఇచ్చారు.