నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వాములుకండి
డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): నవ్యాంధ్ర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం నవనిర్మాణ దీక్షలో భాగంగా రాజ్‌విహార్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు అన్ని శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి లైవ్ టెలికాస్ట్ ద్వారా నవనిర్మాణ దీక్ష ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్బంగా కేఈ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎన్ని ఆందోళనలు చేసినా ఫలితం లేకపోయిందని, రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకపోయినా 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ధైర్యం కోల్పోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని మూడేళ్లలోనే ప్రగతి పథంలోకి తెచ్చారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కర్నూలు నుంచే ప్రారంభమై రాష్ట్రం మొత్తానికి వ్యాపించిందన్నారు. రాయలసీమ నుంచి ప్రారంభమైన ఉద్యమం రాష్ట్ర విభజనను కొంతకాలం పాటు ఆపిందన్నారు. ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసివుంటే పరిస్థితి మరోరకంగా ఉండేదని తెలిపారు.
జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో మూడేళ్లలో సాధించిన ప్రగతిని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో జరిగే సమావేశాలు, సెమినార్లలో వివరిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సి.హెచ్.వెంగళ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులు ముందుండి జీతాలు లేకపోయినా సమైక్య ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ఎన్జీఓ అసోసియేషన్‌కు దక్కుతుందని వివరించారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్.వి.మోహన్‌రెడ్డి, ఎస్పీ ఆకే రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జేసీ–2 రామస్వామి, తెలుగుదేశం నేతలు బి.టి.నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీలు సుధాకర్ బాబు, మసాల పద్మజ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.