నవ్యాంధ్ర నిర్మాణంలో వైశ్యులు భాగస్వాములవ్వాలి
హైదరాబాద్: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో వైశ్యులు భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రోడ్డు-రవా ణా, భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్ హాల్లో మూడు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ (ఐవీఎఫ్) 2వ వార్షికోత్సవ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ.. దేశ విదేశాల్లో స్థిరపడిన వైశ్యులు నవ్యాంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
వైశ్యులు.. వ్యాపారం, పరిశ్రమలు, దేవాలయ నిర్మాణాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ఐవీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎంపీ రాందాస్ అగర్వాల్, ఐవీఎఫ్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధ్యక్షులు ఉప్పల శ్రీనివాసులు మాట్లాడుతూ.. వెశ్యులు సేవా దృక్పథంతో పాటు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. పలు రాష్ట్రాల్లో వైశ్యుల జనాభాకు అనుగుణంగా పలు పార్టీలు సీట్లు కేటాయించడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీలు రాంచందర్రావు, ఫారూఖ్ హుస్సేన్లు మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థకు వైశ్యులు వెన్నెముకలాంటి వారని కొనియాడారు.
ప్రపంచ వ్యాప్తంగా హాజరైన వైశ్య ప్రతినిధులు..
ఐవీఎఫ్ సదస్సుకు దేశంలోని 22 రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వైశ్య ప్రతినిధులు హాజరయ్యారు. వైశ్యుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, సేవా కార్యక్రమాలు, రాజకీయ భాగస్వామ్యంపై చివరి రోజు చర్చించారు. పలు విభాగాల్లో చురుకైన పాత్ర పోషిం చిన వారిని ఐవీఎఫ్ కమిటీ ఘనంగా సన్మానించింది. వైశ్యుల సేవా కార్యక్రమాలపై రూపొంది ంచిన లఘుచిత్రం ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి టి.జి. వెంకటేశ్, ఎమ్మెల్యే బిగాల గణేష్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఐవీఎఫ్ సెక్రటరీ జనరల్ గంజి రాజమౌళి గుప్తా, పంజాబ్ మంత్రి మదన్ మోహన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శి బాబురాం, సినీనటి కవిత,మేఘమాల, సుజాత, భాగ్యలక్షి్ష్మ, రాజ్యలక్షి్ష్మ పాల్గొన్నారు.