'అక్టోబర్ 6న కొత్తపార్టీ'
గాంధీనగర్ (విజయవాడ): ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ 30వ వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్ ఆరో తేదీన నవ్యాంధ్ర పార్టీ పెడుతున్నట్లు మహాసభ ప్రధాన కార్యదర్శి కత్తి పద్మారావు చెప్పారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మహాసభ సమావేశం జరిగింది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా నవ్యాంధ్ర పార్టీ పనిచేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల పాఠశాలల్లో టాయిలెట్లు లేవని, చంద్రబాబు మాత్రం హెచ్ఎంలకు ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తానంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
సీఎంకు ధైర్యముంటే ఒక రోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లో నిద్రచేయాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ విద్యను నాశనం చేయడం ద్వారా దళితులను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోందని పద్మారావు అభిప్రాయపడ్డారు. సీఎం పాలన దళితులకు వ్యతిరేకంగా సాగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 150 అడుగుల విగ్రహానికి స్థలం కేటాయించకుండా 14 నెలలుగా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.