Nawanshahr
-
విద్యార్థులకు కరోనా: పాఠశాల మూసివేత
చంఢీగఢ్: మహమ్మారి కరోనా వైరస్‌తో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఇప్పుడిప్పుడే విద్యాలయాలు పునఃప్రారంభమవుతున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు తెరచుకున్నాయి. కరోనా వ్యాపించకుండా జాగ్రత్తలు పాటిస్తున్నా విద్యార్థులకు కరోనా సోకుతోంది. తాజాగా పంజాబ్‌లో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌లోని షహీద్ భగత్‌సింగ్ నగర్ జిల్లా నవన్‌షహర్ పరిధిలోని సలో గ్రామ ప్రభుత్వ పాఠశాలలో కరోనా కల్లోలం సృష్టించింది. మొత్తం 350 మంది విద్యార్థుల్లో 110 మంది విద్యార్థుల నమూనాలు పరీక్షించారు. వారిలో 14 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ తేలింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆ పాఠశాలను మూసివేసింది. ఈ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి జగ్జీత్ సింగ్ తెలిపారు. అయితే పాఠశాలలో కరోనా ఎలా సోకిందో ఇంకా తెలియలేదు. దీనిపై అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ పాఠశాలలో కరోనా రావడంతో విద్యాలయాల్లో కరోనా జాగ్రత్తలు పక్కాగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. -
భార్య ఉరి.. భయంతో భర్త..!
సాక్షి, అమృత్సర్ : ఆత్మహత్యాయత్నం చేసిన భార్య మృతిచెందడంతో ఆందోళనకు గురైన భర్త సైతం బలవన్మరణం చెందాడు. పంజాబ్‌లోని నవాన్ షహర్ జిల్లాలో దంపతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. నవాన్షహర్ నగర పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో షాబాజ్ సింగ్ కథనం ప్రకారం.. భార్యాభర్తలు రికీ(27), పూనమ్ ఘాయ్ (25)లు వాల్మీకి మోహలా నవాన్‌షహర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం భార్య పూనమ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త రికీ ఫ్యాన్‌కు వేలాడుతున్న భార్యను కిందకి దించి ఆస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు పూనమ్ చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఆందోళనకు గురైన భర్త రికీ.. డబ్బులు తెచ్చి హాస్పిటల్ ఫీజు చెల్లిస్తానంటూ ఇంటికి వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్లిన రికీ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రికీ రాకపోవడంతో పోలీసులకు వైద్యులు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లి చూడగా రికీ అప్పటికే చనిపోయి ఉన్నాడని, అతడు విషం తాగినట్లు గుర్తించినట్లు షాబాజ్ సింగ్ వెల్లడించారు. కపర్తలాలో ఉంటున్న పూనమ్ తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. భార్యాభర్తలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై విచారణ చేపట్టినట్లు వివరించారు. వీరి మధ్య ఏం గొడవలు లేకున్నా ఆత్మహత్య చేసుకోవడంతో కేసు మిస్టరీగా మారనుందని పోలీసులు భావిస్తున్నారు.