ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్
రాయ్‌పూర్/చింతూరు (రంపచోడవరం)/చర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో నక్సలైట్లు, భద్రతా దళాలకు మధ్య సోమవారం జరిగిన రెండు ఎన్కౌంటర్లలో 9 మంది నక్సల్స్‌తోపాటు ఇద్దరు పోలీసులు మరణించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులోని సుక్మా జిల్లా దక్షిణ ప్రాంతమైన కిస్తారం, చింతగుహ అడవుల్లో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ‘ఆపరేషన్ ప్రహార్ – ఐV’ పేరిట 1,200 మంది సిబ్బంది మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తుండగా అడవుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక డీజీపీ (నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు) డీఎం అవస్థీ చెప్పారు.
తెలంగాణ పోలీసులతో కలసి ఛత్తీస్‌గఢ్ ఎస్టీఎఫ్, డీఆర్జీ దళాలు, సీఆర్పీఎఫ్ అనుబంధ కోబ్రా బృందాలు ఆదివారం రాత్రి తొండమర్క, సలెతోంగ్ గ్రామాలు, సక్లేర్ అడవుల్లో కూంబింగ్ ప్రారంభించారని తెలిపారు. కిస్తారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సక్లేర్ గ్రామాన్ని డీఆర్జీ భద్రతా దళాలు సోమవారం ఉదయం 9.40 గంటలకు చుట్టుముట్టాయనీ, అక్కడ ఉన్న నక్సల్స్ కాల్పులకు దిగారన్నారు. అనంతరం డీఆర్జీ దళాలు కూడా ఎదురు కాల్పులు ప్రారంభించగా ఈ ఎన్కౌంటర్లో ఎనిమిది మంది నక్సల్స్‌తోపాటు దిర్డో రామ, మడివి జోగా అనే ఇద్దరు జవాన్లు కూడా మృతి చెందారు.
మృతదేహాలను వాయుసేనకు చెందిన హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. చనిపోయిన నక్సల్స్‌లో ఇద్దరిని గుర్తించారు. వారిద్దరూ తాటి భీమ, పొడియం రాజే అనీ, వారిద్దరి తలలపై 8 లక్షల బహుమానం ఉందని అధికారులు తెలిపారు. చింతగుహ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్మగుండ గ్రామ సమీపంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో కోబ్రా దళాలు ఓ నక్సల్‌ను అంతం చేశాయి. రెండు ఎన్కౌంటర్ ప్రదేశాల నుంచి పదికి పైగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వా«ధీనం చేసుకున్నామని అవస్థీ చెప్పారు. ఆపరేషన్ ప్రహార్ మొదటి మూడు దశలు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి.
పక్కా సమాచారంతోనే దాడి...
త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి కొయెడ సాంబయ్య అలియాస్ ఆజాద్ నేతృత్వంలో సమావేశం జరుగుతోందన్న సమాచారంతో ఛత్తీస్ పోలీసులు దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈనెల 12న ఛత్తీస్‌లోని మావోప్రాబల్య ప్రాంతంలో ఎన్నికలు ముగియగా తెలంగాణలోని మావోయిస్టు ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో డిసెంబర్ 7న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి కేడర్‌కు దిశానిర్దేశం చేసేందుకు ఆజాద్ సరిహద్దుల్లో ఓ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు పక్కా సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమయానికి ఆజాద్ సమావేశానికి హాజరు కాలేదని, ఈలోపుగానే బలగాలు ఆ సమావేశంపై దాడి నిర్వహించడంతో 8 మంది మావోలు మృతి చెందినట్లు సమాచారం.