naxalbari movement
-
కడ వరకు విప్లవ స్వప్నాలే
నక్సల్బరీ విప్లవోద్యమంలో కొండపల్లి సీతారామయ్యది చాల విశిష్టమైన పాత్ర. ఈ 16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైన ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు.. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. వ్యవస్థ మార్పు కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడిన త్యాగశీలి, మార్గదర్శకుడు కొండపల్లి సీతారామయ్య అమరులై నేటికి 16 సంవత్సరాలు. ఆయన సహచరులు, అనుచరులు, అభిమానులు ఆయన్ని కె. ఎస్ అనీ, పెద్దాయన అనీ పిలుచుకుంటారు. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న ఆయన తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలిం చారు. కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సమాజంలో, ఇతర రాష్ట్రాలలోను వ్యవస్థ మార్పుకోసం సాగుతున్న ఉద్యమాలను వారు ప్రభావితం చేసిన సంగతి తెలి సిందే. చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, చారు మజుందార్ వంటి ఉన్నత స్థాయి కలిగిన అగ్రశ్రేణి నాయకుడాయన. నక్సల్బరీతో ప్రారంభమైన విప్లవోద్యమంలో ఆయనది చాల విశిష్టమైన, విస్మరించరాని పాత్ర. ఈ16 ఏళ్ల పాటు పూర్తిగా విస్మృతికి గురైనారు. ఆయన పేరిట సంస్మరణలు లేవు, స్మృతి గీతాలు లేవు, స్తూపాలు లేవు, స్మారకోపన్యాసాలు లేవు. ఓ గుర్తింపులేని హీరోగా మిగిలిపోయారు. అల్జీమర్స్‌తో బాధ పడుతున్న జార్జి ఫెర్నాండేజ్‌ని వారి అనుయాయులు ఎంతో అపురూపంగా చూసుకుం టున్నారట. అల్జీమర్స్ వ్యాధి గురించి మన సమాజానికి, ప్రత్యేకంగా ఉద్యమ శ్రేణులకు సరైన అవగాహన ఉండి వుంటే ఆయన పట్ల మరింత సహానుభూతి, సానుకూల దృక్పథం కలిగి ఉండే వారేమో! కాని చనిపోయే నాటికి ఒక దశాబ్దం ముందు నుంచే నిశ్శబ్దంగా, దొంగలా ఆయనలో ప్రవేశించిన అల్జీమర్స్ మాత్రం ఆయన్ని తన సహచరులకు దూరం చేసింది. అలాంటి స్థితిలో ఉండి కూడా ఆయన విప్లవ స్వప్నాలే కన్నారు. రోగ లక్షణంగా ఆయనకొచ్చిన మానసిక భ్రాంతుల్లో కూడ విప్లవ సైన్యం కదలికలు, కవాతులే ఉండేవి. మొగల్రాజపురంలోని ఇంటి పైన టెర్రస్ మీద కూర్చుని ఎదురుగా రోడ్డు పైన వెళ్తున్న జనాన్ని, వాహనాలను చూపిస్తూ రెడ్ ఆర్మీ కవాతుగా భ్రమించేవారు. ఆయన్ని చూడటానికి వచ్చిన అందరినీ పార్టీ పని చేయమని ప్రేరేపించేవారు. ఏ కారణం వల్లనైనా మేము అభ్యంతరపెడితే.. మీరు చెయ్యరు.. చేసేవాళ్లతో చేయిం చుకుంటుంటే అడ్డుపడతారు అనేవారు. తన మనవరాలు సుధ, నేను పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తల్లా పని యకుండా ఆమె లా కాలేజీ లెక్చరర్ గాను, నేను హాస్పిటల్ నడుపుతూ ఉండటం ఆయనకంతగా నచ్చేది కాదు. ఒకరోజు నా మూడేళ్ల కూతురితో ‘మీ నాన్న దొంగ. పార్టీ పని చేయకుండా డాక్టరై హాస్పిటల్ నడుపుతున్నాడు’ అన్నారు. దానికా పసిది పెద్దగా ఏడుస్తూ తనమీద కొట్లాటకు దిగింది. దాంతో కలవరపడి పసిదాన్ని బాధ పెట్టానే అని కలత చెందిన సున్నిత మనస్కుడాయన. భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కె.ఎస్.ది ఒక ప్రత్యేకమైన, ముఖ్యమైన అధ్యాయం. తెలంగాణా సాయుధ పోరాటకాలంలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కృష్ణాజిల్లా కార్యదర్శిగా ఆయన చాల కీలక పాత్ర నిర్వహించారు. చండ్ర రాజేశ్వరరావుతో కలిసి అనుబంధ ప్రజాసంఘాల నిర్మాణంలో, ముఖ్యంగా రైతు సంఘం, ప్రజా నాట్యమండలి నిర్మాణంలో కె.ఎస్ది ముఖ్యపాత్ర. అనంతర కాలంలో నక్సల్ బరీ ఉద్యమంతో సి.పి.ఐ(ఎం.ఎల్) పార్టీ ఏర్పడినప్పుడు, ఆ తర్వాత పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో తన పూర్వ అనుభవాన్నంతా రంగరించి పార్టీకి ‘మాస్ లైన్’ అందించటంలో తనదే ముఖ్య పాత్ర. రాడికల్ విద్యార్థి సంఘానికి వేసవి సెలవుల్లో ‘గ్రామాలకు తరలండి. పేద మధ్య తరగతి ప్రజలతో మమేకం కండి’ అని పిలుపునిచ్చారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు ముందుగా దళితవాడల్లో, బీసీవాడల్లో కాంపెయిన్ చెయ్యాలని, దళితవాడల్లో వాళ్లు పెట్టిందే తిని, రాత్రిపూట బస కూడా అక్కడే చేయాలని, వారితో పూర్తిగా మమేకం కావాలని ఆయనిచ్చిన డైరెక్షన్. ఆ పిలుపు మేరకు ప్రొఫెషనల్ కాలేజీలు, యూనివర్సిటీల నుంచి వేలాది మంది విద్యా ర్థులు గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్లి సామాన్య ప్రజ లతో మమేకమై ఉద్యమ స్ఫూర్తి రగిలించారు. 2009లో కూర రాజన్న అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కొందరు మిత్రులం ఆయన్ని చూడటానికి వెళ్ళాం. నన్ను చూడగానే రాజన్న ప్రస్తావించిన మొదటి విషయం కె.ఎస్.కు విజయవాడలో స్తూపం కట్టాలని. నాతో వచ్చిన మిత్రుడొకరు కె.ఎస్. గురించి మీ అభిప్రాయం ఏమిటి అని రాజన్నను అడిగాడు. దానికాయన ‘కె.ఎస్. మా గురువు’ అన్నారు. అదేంటి మీ పార్టీ ఆయన పార్టీ వేరు వేరు కదా... కరీంనగర్ జిల్లాలో మీ రెండు గ్రూపుల దళాలు చంపుకునే వరకు వెళ్లాయి కదా అని ఆ మిత్రుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికాయన ‘అవన్నీ క్షేత్రస్థాయిలో ఆచరణలో దొర్లిన పొరపాట్లు. ఉద్యమపరమైన ఎత్తుగడల విషయంలో ఆయన మాకు గురువే. ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధం పెరిగినప్పుడు మేము ప్రతిఘటనా పోరాటానికి పిలుపు నిచ్చాం. కె. ఎస్. అందుకు భిన్నంగా దండకారణ్యానికి విస్తరించమని పిలుపునిచ్చారు. ఆయనే కరెక్ట్ అని చరిత్ర రుజువు చేసింది‘ అన్నారు. రాజన్న అంచనా వేసిన రీతి లోనే చరిత్ర, భవిష్యత్తు తరాలు కొండపల్లి సీతారామయ్యని అంచనా వేస్తాయని నా ప్రగాఢ నమ్మకం. డాక్టర్ జి.గంగాధర్ (నేడు విప్లవోద్యమనేత కొండపల్లి సీతారామయ్య 16వ వర్థంతి సందర్భంగా) వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, విజయవాడ మొబైల్ 98483 34761 -
ఎర్రసైన్యం
-
50 వసంతాల నక్సల్బరీ
నక్సల్బరీ..! ఒక ఊరు కాదు, ఒక విప్లవం.. వ్యవస్థపై ఉప్పెనలాంటి ఒక తిరుగుబాటు.. నెత్తుటి చరిత్ర! చిన్నిచిన్న విజయాలు.. భారీ ఎదురుదెబ్బలు..! అయినా మొక్కవోని ఆశయంతో గమ్యంవైపు సాగే పయనం! దేశాన్ని పట్టికుదిపేసిన ఈ సాయుధ పోరాటానికి నేటితో యాభై ఏళ్లు పూర్తికానున్నాయి. పార్లమెంటు రాజకీయాలకు భిన్నంగా వసంతకాలంలో మేఘగర్జనలా మొదలై, దేశమంతా వ్యాపించి అలజడి సృష్టించిన, సృష్టిస్తున్న ఈ ఉద్యమం ఆధునిక భారత చరిత్రలోని ముఖ్య ఘటనల్లో ఒకటి. ఐదు దశాబ్దాల రుధిర ఉద్యమ చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే.. మారుమూలపల్లెలో మొదలై.. అది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ గ్రామం. చుట్టుపక్కల తేయాకు తోటలు, పొలాలు, అడవులు.. వాటి ఆధారంగా బతికే బీదరైతులు, ఆదివాసులు. వీరు పండించే పంటలో అధికభాగాన్ని భూస్వాములు దోచుకునేవారు. గోళ్లూడగొట్టి నానారకాల పన్నులు వసూలు చేసేవాళ్లు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దోపిడీపీడనలపై జనం 1967, మే 24న తిరగబడ్డారు. దున్నేవారికే భూమి అంటూ తాము సాగు చేస్తున్న భూములను ఆక్రమించుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో భూపోరాటాలు చేస్తున్న సీపీఎం నేతలు చారుమజుందార్, కానూసన్యాల్ తదితరులు రైతు పోరాటానికి నాయకత్వం వహించారు. భూస్వాములు పోలీసులను పిలిపించారు. రైతులు, గిరిజనులు చేతికి దొరికిన గొడ్డళ్లు, కొడవళ్లు, బాణాలతో పోలీసులను ఎదుర్కొన్నారు. ఓ రైతు బాణం తగిలి ఒక పోలీసు చనిపోయాడు. మరుసటి రోజు.. మే 25న పోలీసులు గ్రామంపై విరుచుకుపడి, ఇద్దరు పిల్లలను సహా 11 మందిని కాల్చిచంపారు.తర్వాత నక్సల్బరీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటాలు మొదలయ్యాయి. చూస్తుండగానే ఉద్యమం దేశమంతటా నిప్పులా రాజుకుంది. బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్(శ్రీకాకుళం), మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్.. మరెన్నో చోట్ల పీడిత రైతులు భూస్వాములపై తిరగబడ్డారు. చారుమజుందార్, సన్యాల్‌లు సీపీఎంతో తెగతెంపులు చేసుకుని సీపీఐ(మార్క్సిస్ట్–లెనినిస్ట్) పార్టీని స్థాపించారు. చైనా విప్లవ సారథి మావో బాటలో తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీ పలు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి పోరాటాలను ఉధృతం చేసింది. 1972లో చారుమజుందార్ పోలీసు కస్టడీలో చనిపోవడంతో ఉద్యమం పట్టుసడలింది. పార్టీ ముక్కచెక్కలైంది. పీపుల్స్‌వార్ తదితర గ్రూపులు ఉద్యమాన్ని తమ తమ సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లాయి. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ కలసిపోయి సీపీఐ(మావోయిస్టు) అవతరించాయి. గత 20 ఏళ్లలో భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన హింసలో 20వేల మంది చనిపోయారని అంచనా. విమర్శలు.. నక్సల్బరీ ఉద్యమం వర్గశత్రునిర్మూలన పేరుతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతోందని తొలిదశలో ఆరోపణలు వచ్చాయి. ప్రజలకు దూరంగా అడవుల్లో ఉంటూ ఏం ఉద్యమాలు చేస్తారని, ప్రజల సొమ్ముతో నిర్మితమైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబని నక్సల్బరీ వ్యతిరేకులు ప్రశ్నిస్తుంటారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, సాయుధపోరాటం విజయవంతం కాదని కొందరు చెబుతుంటారు. ఏదేమైనా.. అసమానత్వం, దోపిడీపీడనల్లోంచి పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం సమాజంలో అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కనుక తన ఉనికికి ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది. గిరిజన మహిళ నాయకత్వం నక్సల్బరీ పోరాటం క్షేత్రస్థాయిలో శాంతి ముండా అనే ఈ గిరిజన మహిళ నాయకత్వంతో మొదలైంది. తను పండించిన పంటలో ఎక్కువ భాగం తనకే కావాలన్న కౌలు రైతు తరఫున శాంతి తిరుగుబాటు లేవదీసింది. సోనం వాంగ్డి అనే పోలీసు ఓ మహిళపై దాడి చేయడాన్ని సహించలేక తోటి రైతులతో కలసి ఆ పోలీసుపై బాణా లు వదిలింది. అతడు చనిపోవడంతో పోలీసులు ఊరిపై దాడి చేసి 11 మందిని చంపేశారు. వీపున 15 నెలల బిడ్డను కట్టుకుని బాణం వేశానని శాంతి నాటి ఘటన గుర్తుచేసుకుంది. చారుమజుందార్, సన్యాల్ వంటి వారితో కలసి పనిచేశానంది. ‘మేం ఎన్నికలను బహిష్కరించి తప్పుచేశాం. ప్రజలు వాటిని బహిష్కరించరని అర్థం చేసుకోలేకపోయాం’ అని అంటున్న శాంతి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది! –సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ నెత్తుటి తిరుగుబాటుకు 50 ఏళ్లు
సరిగ్గా ఈ రోజుకు 50 ఏళ్లు. పచ్చటి తేయాకు తోటలు, అడువులు రక్తంతో ఎరుపెక్కిన రోజు. భూస్వాముల వద్ద తరతరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న రైతులు తొలిసారి తిరగబడిన రోజు. కత్తులు, కటార్లు, విల్లంబులే కాకుండా పలుగు, పార, బరిసె, కొడవళ్లు.. దొరికిన వ్యవసాయ పనిముట్లను పట్టుకొని భూ స్వాములను తరిమికొట్టిన రోజు. నక్సల్బరి ఉద్యమం ఊపిరి పోసుకున్న రోజు. అదే 1967, మే 24వ తేదీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా, సిలిగురి సబ్ డివిజన్లోని నక్సల్బరి గ్రామం. ఓ పక్క చిన్న రైల్వే స్టేషన్, దట్టమైన అడవి, తేయాకు తోటల మధ్య వెలసిన గ్రామం. సిలిగురి నుంచి హతిగీస (ఏనుగు), బాగ్దోగ్రా (పులి) గ్రామాల మీదుగా వెళుతుంటే పచ్చని పంటపొలాల మధ్య కనిపించేది నక్సల్బరి గ్రామం. ఈ గ్రామాల్లో ఆదివాసులే ఎక్కువ ఉండేవారు కనుక ఊళ్ల పేర్లన్నీ ఎక్కువగా జంతువులు, ప్రకృతి పేర్ల మీదనే ఉన్నాయి. ఆ పచ్చని పొలాలు కొంతమంది భూస్వాముల చేతుల్లోనే ఉండేవి. ఆదివాసీలైన రైతులు తరతరాలుగా వెట్టిచాకిరి చేసేవారు. తీవ్రవాద కమ్యూనిస్టులు రైతులను, తేయాకు తోటల్లో పనిచేసేవారిని రెచ్చగొట్టారు. అప్పటికే తేయాకు తోటల్లో పనిచేసే కూలీల యూనియన్లు కమ్యూనిస్టు నాయకుల చేతుల్లో ఉండేవి. ఇక్కడ తీవ్రవాద కమ్యూనిస్టులంటే చైనా, క్యూబా విప్లవాలు విజయం సాధించిన స్ఫూర్తితో భారత్‌లో కూడా సాయుధ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని భావించిన వారు. వీరిలో సీపీఐ, సీపీఎం వారూ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు చెందని తీవ్రవాద కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ తీవ్రవాదులు ‘సిలిగురి గ్రూప్’గా ఏర్పడి నక్సల్బరితోపాటు ఊరూరా రైతు కమిటీలను ఏర్పాటు చేయించారు. 1967, మార్చి 3వ తేదీన ఓ రైతు కమిటీ ఆధ్వర్యాన ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకొని కొందరు రైతులు సాగు చేయడం ప్రారంభించారు. ఆరోజు నుంచి మార్చి 18 వరకు రైతులు, భూస్వాముల పొలాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, భూస్వాముల మధ్య ఘర్షణలు జరిగేవి. రైతుల తరఫున తేయాకు కార్మికులు కూడా రంగంలోకి దిగారు. ఓ రోజున పొలాన్ని కౌలుకు తీసుకున్న బికూ అనే రైతును భూస్వామి చితకబాదారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు మే 24వ తేదీన భూస్వాములపై తిరగబడ్డారు. భూస్వాములకు అండగా వచ్చిన పోలీసులపై కూడా కత్తులు, కొడవళ్లు, విల్లంబులు, పలుగు, పార పట్టుకొని దాడి చేశారు. ఈ దాడిలో జారుగావ్ పోలీసు ఇన్స్పెక్టర్ మరణించారు. మర్నాడే.. అంటే మే 25వ తేదీన అదనపు భద్రతా బలగాలు వచ్చి నక్సల్బరి గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. రైతుల ఇళ్లను కూల్చేశాయి. ఈ సందర్భంగా తిరగబడిన రైతులపైకి కాల్పులు జరపడంతో ధనలక్ష్మీ దేవీ, నయనేశ్వరి ముల్లిక్ సహా తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ రైతుల ఆందోళన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, బిహార్‌లోని ఎక్వారీ, ముషాహరి, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి, పంజాబ్‌లోని కొన్ని గ్రామాల్లో కూడా రైతులు తిరుగుబాటు చేశారు. పొరుగునే ఉన్న నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా రైతుల తిరుగుబాటుకు నైతిక మద్దతు ఇచ్చారు. జూలై 19వ తేదీన పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో అన్ని ప్రాంతాలతోపాటు నక్సల్బరీ ప్రాంతంలో ఆందోళన పూర్తిగా చల్లారిపోయింది. చారు మజుందార్ లాంటి కమ్యూనిస్టు నాయకులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లగా, కొంత మంది అరెస్టయ్యారు. కొంత మంది పోలీసు కాల్పుల్లో మరణించారు. రైతుల తిరుగుబాటుకు మద్దతిచ్చినందుకు చారు మజుందార్, సొరేన్ బోస్, మహదేవ్ ముఖర్జీ, దిలీప్ బాగ్చీ లాంటి నాయకులను సీపీఎం తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మజుందార్ ‘హిస్టరీస్ ఆఫ్ 8 డాక్యుమెంట్స్’ రాశారు. ఈ పుస్తకం ప్రాతిపదికనే 1969లో సీపీఐ (ఎంఎల్) ఏర్పడింది. నక్సల్బరీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు కనుకనే మావోయిస్టులకు నక్సలైట్లు అని పేరు వచ్చింది.