
ఆ నెత్తుటి తిరుగుబాటుకు 50 ఏళ్లు
సరిగ్గా ఈ రోజుకు 50 ఏళ్లు. పచ్చటి తేయాకు తోటలు, అడువులు రక్తంతో ఎరుపెక్కిన రోజు. భూస్వాముల వద్ద తరతరాలుగా వెట్టి చాకిరి చేస్తున్న రైతులు తొలిసారి తిరగబడిన రోజు. కత్తులు, కటార్లు, విల్లంబులే కాకుండా పలుగు, పార, బరిసె, కొడవళ్లు.. దొరికిన వ్యవసాయ పనిముట్లను పట్టుకొని భూ స్వాములను తరిమికొట్టిన రోజు. నక్సల్బరి ఉద్యమం ఊపిరి పోసుకున్న రోజు. అదే 1967, మే 24వ తేదీ.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా, సిలిగురి సబ్ డివిజన్‌లోని నక్సల్బరి గ్రామం. ఓ పక్క చిన్న రైల్వే స్టేషన్, దట్టమైన అడవి, తేయాకు తోటల మధ్య వెలసిన గ్రామం. సిలిగురి నుంచి హతిగీస (ఏనుగు), బాగ్‌దోగ్రా (పులి) గ్రామాల మీదుగా వెళుతుంటే పచ్చని పంటపొలాల మధ్య కనిపించేది నక్సల్బరి గ్రామం. ఈ గ్రామాల్లో ఆదివాసులే ఎక్కువ ఉండేవారు కనుక ఊళ్ల పేర్లన్నీ ఎక్కువగా జంతువులు, ప్రకృతి పేర్ల మీదనే ఉన్నాయి. ఆ పచ్చని పొలాలు కొంతమంది భూస్వాముల చేతుల్లోనే ఉండేవి. ఆదివాసీలైన రైతులు తరతరాలుగా వెట్టిచాకిరి చేసేవారు. తీవ్రవాద కమ్యూనిస్టులు రైతులను, తేయాకు తోటల్లో పనిచేసేవారిని రెచ్చగొట్టారు. అప్పటికే తేయాకు తోటల్లో పనిచేసే కూలీల యూనియన్లు కమ్యూనిస్టు నాయకుల చేతుల్లో ఉండేవి. ఇక్కడ తీవ్రవాద కమ్యూనిస్టులంటే చైనా, క్యూబా విప్లవాలు విజయం సాధించిన స్ఫూర్తితో భారత్‌లో కూడా సాయుధ పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని భావించిన వారు. వీరిలో సీపీఐ, సీపీఎం వారూ ఉన్నారు. ఈ రెండు పార్టీలకు చెందని తీవ్రవాద కమ్యూనిస్టులు ఉన్నారు.
ఈ తీవ్రవాదులు ‘సిలిగురి గ్రూప్’గా ఏర్పడి నక్సల్బరితోపాటు ఊరూరా రైతు కమిటీలను ఏర్పాటు చేయించారు. 1967, మార్చి 3వ తేదీన ఓ రైతు కమిటీ ఆధ్వర్యాన ఓ స్థలాన్ని స్వాధీనం చేసుకొని కొందరు రైతులు సాగు చేయడం ప్రారంభించారు. ఆరోజు నుంచి మార్చి 18 వరకు రైతులు, భూస్వాముల పొలాలను స్వాధీనం చేసుకోవడాన్ని ఓ ఉద్యమంగా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు, భూస్వాముల మధ్య ఘర్షణలు జరిగేవి. రైతుల తరఫున తేయాకు కార్మికులు కూడా రంగంలోకి దిగారు. ఓ రోజున పొలాన్ని కౌలుకు తీసుకున్న బికూ అనే రైతును భూస్వామి చితకబాదారు. దాంతో కోపోద్రిక్తులైన రైతులు మే 24వ తేదీన భూస్వాములపై తిరగబడ్డారు. భూస్వాములకు అండగా వచ్చిన పోలీసులపై కూడా కత్తులు, కొడవళ్లు, విల్లంబులు, పలుగు, పార పట్టుకొని దాడి చేశారు. ఈ దాడిలో జారుగావ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మరణించారు.
మర్నాడే.. అంటే మే 25వ తేదీన అదనపు భద్రతా బలగాలు వచ్చి నక్సల్బరి గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. రైతుల ఇళ్లను కూల్చేశాయి. ఈ సందర్భంగా తిరగబడిన రైతులపైకి కాల్పులు జరపడంతో ధనలక్ష్మీ దేవీ, నయనేశ్వరి ముల్లిక్ సహా తొమ్మిది మంది మహిళలు, ఇద్దరు పిల్లలు మరణించారు. ఈ రైతుల ఆందోళన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, బిహార్‌లోని ఎక్వారీ, ముషాహరి, ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి, పంజాబ్‌లోని కొన్ని గ్రామాల్లో కూడా రైతులు తిరుగుబాటు చేశారు. పొరుగునే ఉన్న నేపాల్‌లోని కమ్యూనిస్టులు కూడా రైతుల తిరుగుబాటుకు నైతిక మద్దతు ఇచ్చారు. జూలై 19వ తేదీన పారా మిలటరీ దళాలు రంగంలోకి దిగడంతో అన్ని ప్రాంతాలతోపాటు నక్సల్బరీ ప్రాంతంలో ఆందోళన పూర్తిగా చల్లారిపోయింది. చారు మజుందార్ లాంటి కమ్యూనిస్టు నాయకులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లగా, కొంత మంది అరెస్టయ్యారు. కొంత మంది పోలీసు కాల్పుల్లో మరణించారు.
రైతుల తిరుగుబాటుకు మద్దతిచ్చినందుకు చారు మజుందార్, సొరేన్ బోస్, మహదేవ్ ముఖర్జీ, దిలీప్ బాగ్చీ లాంటి నాయకులను సీపీఎం తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తర్వాత మజుందార్ ‘హిస్టరీస్ ఆఫ్ 8 డాక్యుమెంట్స్’ రాశారు. ఈ పుస్తకం ప్రాతిపదికనే 1969లో సీపీఐ (ఎంఎల్) ఏర్పడింది. నక్సల్బరీ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు కనుకనే మావోయిస్టులకు నక్సలైట్లు అని పేరు వచ్చింది.