50 వసంతాల నక్సల్బరీ | 50 years later, is the Naxalbari movement on its last legs? | Sakshi
Sakshi News home page

50 వసంతాల నక్సల్బరీ

Published Thu, May 25 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

50  వసంతాల నక్సల్బరీ

50 వసంతాల నక్సల్బరీ

నక్సల్బరీ..! ఒక ఊరు కాదు, ఒక విప్లవం.. వ్యవస్థపై ఉప్పెనలాంటి ఒక తిరుగుబాటు.. నెత్తుటి చరిత్ర! చిన్నిచిన్న విజయాలు.. భారీ ఎదురుదెబ్బలు..! అయినా మొక్కవోని ఆశయంతో గమ్యంవైపు సాగే పయనం! దేశాన్ని పట్టికుదిపేసిన ఈ సాయుధ పోరాటానికి నేటితో యాభై ఏళ్లు పూర్తికానున్నాయి. పార్లమెంటు రాజకీయాలకు భిన్నంగా వసంతకాలంలో మేఘగర్జనలా మొదలై, దేశమంతా వ్యాపించి అలజడి సృష్టించిన, సృష్టిస్తున్న ఈ ఉద్యమం ఆధునిక భారత చరిత్రలోని ముఖ్య ఘటనల్లో ఒకటి. ఐదు దశాబ్దాల రుధిర ఉద్యమ చరిత్ర పుటలను ఒకసారి తిరగేస్తే..

మారుమూలపల్లెలో మొదలై..
అది పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ జిల్లా నక్సల్బరీ గ్రామం. చుట్టుపక్కల తేయాకు తోటలు, పొలాలు, అడవులు.. వాటి ఆధారంగా బతికే బీదరైతులు, ఆదివాసులు. వీరు పండించే పంటలో అధికభాగాన్ని భూస్వాములు దోచుకునేవారు. గోళ్లూడగొట్టి నానారకాల పన్నులు వసూలు చేసేవాళ్లు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దోపిడీపీడనలపై జనం 1967, మే 24న తిరగబడ్డారు. దున్నేవారికే భూమి అంటూ తాము సాగు చేస్తున్న భూములను ఆక్రమించుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతంలో భూపోరాటాలు చేస్తున్న సీపీఎం నేతలు చారుమజుందార్, కానూసన్యాల్‌ తదితరులు రైతు పోరాటానికి నాయకత్వం వహించారు. భూస్వాములు పోలీసులను పిలిపించారు.

రైతులు, గిరిజనులు చేతికి దొరికిన గొడ్డళ్లు, కొడవళ్లు, బాణాలతో పోలీసులను ఎదుర్కొన్నారు. ఓ రైతు బాణం తగిలి ఒక పోలీసు చనిపోయాడు. మరుసటి రోజు.. మే 25న పోలీసులు గ్రామంపై విరుచుకుపడి, ఇద్దరు పిల్లలను సహా 11 మందిని కాల్చిచంపారు.తర్వాత నక్సల్బరీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయుధ రైతాంగ పోరాటాలు మొదలయ్యాయి. చూస్తుండగానే ఉద్యమం దేశమంతటా నిప్పులా రాజుకుంది. బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌(శ్రీకాకుళం), మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌.. మరెన్నో చోట్ల పీడిత రైతులు భూస్వాములపై తిరగబడ్డారు. చారుమజుందార్, సన్యాల్‌లు సీపీఎంతో తెగతెంపులు చేసుకుని సీపీఐ(మార్క్సిస్ట్‌–లెనినిస్ట్‌) పార్టీని స్థాపించారు.

చైనా విప్లవ సారథి మావో బాటలో తుపాకీ ద్వారానే రాజ్యాధికారం సాధించాలని పిలుపునిచ్చారు. పార్టీ  పలు రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేసి పోరాటాలను ఉధృతం చేసింది. 1972లో చారుమజుందార్‌ పోలీసు కస్టడీలో చనిపోవడంతో ఉద్యమం పట్టుసడలింది. పార్టీ ముక్కచెక్కలైంది. పీపుల్స్‌వార్‌ తదితర గ్రూపులు ఉద్యమాన్ని తమ తమ సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్లాయి. 2004లో పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్‌ కలసిపోయి సీపీఐ(మావోయిస్టు) అవతరించాయి. గత 20 ఏళ్లలో భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన హింసలో 20వేల మంది చనిపోయారని అంచనా.

విమర్శలు..
నక్సల్బరీ ఉద్యమం వర్గశత్రునిర్మూలన పేరుతో వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతోందని తొలిదశలో ఆరోపణలు వచ్చాయి. ప్రజలకు దూరంగా అడవుల్లో ఉంటూ ఏం ఉద్యమాలు చేస్తారని, ప్రజల సొమ్ముతో నిర్మితమైన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు సబబని నక్సల్బరీ వ్యతిరేకులు ప్రశ్నిస్తుంటారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉందని, సాయుధపోరాటం విజయవంతం కాదని కొందరు చెబుతుంటారు. ఏదేమైనా.. అసమానత్వం, దోపిడీపీడనల్లోంచి పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం సమాజంలో అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి కనుక తన ఉనికికి ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంది.  

గిరిజన మహిళ నాయకత్వం
నక్సల్బరీ పోరాటం క్షేత్రస్థాయిలో శాంతి ముండా అనే ఈ గిరిజన మహిళ నాయకత్వంతో మొదలైంది. తను పండించిన పంటలో ఎక్కువ భాగం తనకే కావాలన్న కౌలు రైతు తరఫున శాంతి తిరుగుబాటు లేవదీసింది. సోనం వాంగ్డి అనే పోలీసు ఓ మహిళపై దాడి చేయడాన్ని సహించలేక తోటి రైతులతో కలసి ఆ పోలీసుపై బాణా లు వదిలింది.

అతడు చనిపోవడంతో పోలీసులు ఊరిపై దాడి చేసి 11 మందిని చంపేశారు. వీపున 15 నెలల బిడ్డను కట్టుకుని బాణం వేశానని శాంతి నాటి ఘటన గుర్తుచేసుకుంది. చారుమజుందార్, సన్యాల్‌ వంటి వారితో కలసి పనిచేశానంది. ‘మేం ఎన్నికలను బహిష్కరించి తప్పుచేశాం. ప్రజలు వాటిని బహిష్కరించరని అర్థం చేసుకోలేకపోయాం’ అని అంటున్న శాంతి రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది!

 –సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement