విమానంలో ఆ రోజు ఏం జరిగిందీ....?
న్యూఢిల్లీ: పాన్ అమెరికా ఎయిర్వేస్ విమానంలో అటెండెంట్‌గా పనిచేస్తున్న నీర్జా భానోత్ టెర్రరిస్టుల బారి నుంచి 359 మంది ప్రయాణికులను రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించిన యదార్థ సంఘటనపై సోనమ్ కపూర్ నటించిన హిందీ సినిమా ‘నీర్జా’ బాక్సాఫీసు వద్ద హిట్ అయిన విషయం తెల్సిందే. అసలు ఆ రోజు విమానంలో ఏం జరిగింది ? విమానంలోకి టెర్రరిస్టులు ఎలా ప్రవేశించారు? ప్రయాణికులను ఎలా చంపారు? అన్న అంశాలను ఆ రోజు విమానం నుంచి ప్రాణాలతో బయటపడ్డ సంగీత విద్వాంసుడు నయన్ పాంచోలి చెప్పిన కథనం ఇదీ...
‘అది 1986, సెప్టెంబర్ 5, అహ్మదాబాద్‌కు చెందిన మ్యూజిక్ కంపోజర్స్. గాయనీ గాయకులతో కూడిన బృందం మాది. అమెరికాలోని పలు నగరాల్లో సంగీత విభావరి నిర్వహించేందుకు మేము వెళుతున్నాం. పాన్ ఏఎంకు చెందిన ముంబై నుంచి కరాచి, ఫ్రాంక్‌ఫర్ట్‌ల మీదుగా న్యూయార్క్ వెళ్లే విమానంలో ఎక్కాం. అప్పుడు నాకు 21 ఏళ్లు. మా విమానం ముంబై నుంచి బయల్దేరి తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో కరాచి విమానాశ్రయంలో దిగింది. కొంతమంది ప్రయాణికులు కరాచిలో దిగి పోయారు.
విమానాన్ని క్లీనర్లు విమానం ఎక్కి తమ పని ముగించుకొని వెళ్లడానికి సిద్ధమయ్యారు. అంతలో విమానాశ్రయం సెక్యూరిటీ దుస్తుల్లో ఉన్న నలుగురు సాయుధులు బిజినెస్ క్యాస్ వైపునున్న ద్వారం గుండా లోపలికి ప్రవేశించారు. అటువైపు నుంచి అరుపులు, కేకలు వినిపించాయి. గాలిలోకి మూడు, నాలుగు సార్లు కాల్పులు జరిపిన శబ్దాలు వినిపించాయి. ముందు భాగానికి, వెనక భాగానికి ఇద్దరు చొప్పున సాయుధులు విడిపోయారు. వారిలో ఒకరి వద్ద మిషన్ గన్ ఉండగా, మిగతా వారి వద్ద పలు తుపాకులు, గ్రెనేడ్లు ఉన్నాయి.
ప్రతి ప్రయాణికుడు తన నెత్తికి రెండు చేతులు పెట్టుకోవాలని వారు ఆదేశించారు. నాతో సహా ప్రయాణికులందరం అలాగే చేశాం. అదే సమయంలో వెంటనే స్పందించిన సీనియర్ ఫ్లైట్ అటెండెంట్ నీర్జా భానోత్ కాక్‌పిట్‌లోకి వెళ్లి కెప్టెన్, కోపైలట్, ఇతర సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే విమానాన్ని టేకాఫ్ చేయాల్సిందిగా సూచించారు. కానీ వారంతా విమానం దిగి పారిపోయారు.
ఈలోగా నీర్జాను మినహా మిగతా ఫ్లైట్ అటెండర్లందరిని టెర్రరిస్టులు బంధించారు. ఎయిర్‌వేస్‌తో మాట్లాడేందుకు నీర్జాను బంధించలేదు. ప్రయాణికులను భయపెట్టేందుకు రాకేష్ కుమార్ అనే వ్యక్తిని ముందుగా కాల్చి చంపారు. అతని శవాన్ని విమానం నుంచి బయట పడేశారు. ప్రయాణికుల పాస్‌పోర్టులను సేకరించడం మొదలు పెట్టారు. ఈలోగా కొంత మంది అమెరికా పౌరుల పాస్‌పోర్టులను నీర్జా తీసుకొని సీట్ల కింద దాచిపెట్టారు. మమ్మల్ని భయపెడుతూ టెర్రరిస్టులు అరబిక్ భాషలో అరపులు, కేకలు వేశారు. మధ్యాహ్నం శాండివిచ్‌లు ఆఫర్ చేశారు. ఆ పరిస్థితిలో ఎవరికీ తినేందుకు మకస్కరించలేదు. సాయంత్రం నెత్తిమీద చేతులు పెట్టుకొని నిలబడాల్సిందిగా ఆదేశించి ప్రయాణికులు క్యూలో టాయ్లెట్లకు వెళ్లేందుకు అనుమతించారు.
విమానాన్ని హైజాక్ చేసిన 17 గంటలకు విమానంలోని ఇంధనం ఖాళీ అయింది. దాంతో జనరేటర్ నడవక విమానంలో లైట్లన్నీ ఆరిపోయాయి. భయపడిన టెర్రరిస్టులు ప్రయాణికులపై గుడ్డిగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఎంతో మంది చావు కేకలు వినిపించాయి. నీర్జా భానోత్ (23 ఏళ్లు)తో పాటు నా ట్రూప్‌నకు చెందిన ఇద్దరు కాల్పుల్లో మరణించారు. గ్రెనేడ్లు కూడా విసిరారు. ప్రాణాలు రక్షించుకోవడం కోసం నేను నా పక్కనే ఉన్న ఎమర్జెన్సీ డోర్‌ను తీసుకొని బయటకు దూకుతుండగా, ఓ గ్రెనేడ్ శకలాలు వచ్చి నా ఎడమ కంటికి తాకాయి.
అలాగే కింద పడిపోయాను. నన్ను కరాచి ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. 48 గంటల తర్వాత ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ముంబై తీసుకెళ్లారు. అక్కడ కంటికి చికిత్స చేయించుకున్నా లాభం లేకపోయింది. అమెరికాలోని చికాగో ఆస్పత్రికి వెళ్లాను. అక్కడా నా కంటి చూపును ఎవరూ పునరుద్ధరించలేక పోయారు. ఆ రోజును ఇప్పటికీ మరచిపోలేను. మానవత్వానికి చీకటి రోజు. ప్రయాణికులు జాతి,కుల, మత విభేదాలను విస్మరించిన రోజు. ఒకరి పట్ల ఒకరు మానవత్వంతో వ్యయహరించిన రోజు’ అంటూ ఆ నాటి సంఘటనను వివరించారు.