నయన సమ్మతిస్తే..
తమిళసినిమా: నవ్వడం ఒక యోగం. నవ్వించడం ఒక భోగం అంటారు. అలా తనదైన హాస్యంతో లక్షలాది మందికి వినోదం అందిస్తున్న హాస్య నటుడు సూరి. పరోటా సూరిగా అందరి మనసుల్లోనూ గూడు కట్టుకున్న ఆయనిప్పుడు నటి నయనతారతో డ్యూయెట్ పాడాలని ఆశ పడుతున్నారు.
ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం నటుడు సూరి అనే. అయితే ఆయనకీ నేమ్, ఫేమ్ అంత ఈజీగా రాలేదు. రెండున్నర దశాబ్దాల కఠిన శ్రమ ఉంది. కాలిన కడుపు, ఆకలిని తీర్చుకోవడానికి సినిమా సెట్లకు రంగులు దిద్దిన గతం ఆయనది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న నానుడికి నటుడు సూరి ఒక ఉదాహరణగా నిలుస్తారు. ఆయన గురించి తెలిస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. 25ఏళ్ల తన సినీ పయనాన్ని హాస్యనటుడు సూరి ఒక్క సారి గుర్తుకు తెచుకున్నారు. అదేమిటో ఆయన మాటల్లోనే...
తిçనడానికి అన్నం లేదు: 1996లో సినిమాల్లో నటించాలన్న ఆశతో మదురై సమీపంలోని ఒక గ్రామం నుంచి చెన్నై వచ్చాను. నిలవడానికి నీడలేదు. తినడానికి అన్నం లేదు. ఆకలి బాధ ఓర్చుకోలేక సినిమాల కోసం వేసే సెట్స్‌కు రంగులు వేసే పనిలో చేరాను. ఆ సమయంలో మిత్రులతో కలిసి చిన్న చిన్న నాటకాలు ఆడేవాడిని. అలా వీరప్పన్ ఇతివృత్తంతో ఆడిన నాటకం చూసిన పోలీసు అధికారులు నా నటనను ప్రశంసించి రూ.400 ఇచ్చారు.
ఆ తరువాత కాదల్, దీపావళి చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించాను. అప్పడు దీపావళి చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేసిన సుశీంద్రన్ దర్శకుడయిన తరువాత వెన్నెలా కబడ్డీ కుళు చిత్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. చిన్న పాత్ర అయిన అది ఆ తరువాత పెద్దగా పేరుతెచ్చింది. అందులోని పరోటా హాస్యం నన్నీ స్థాయికి చేర్చింది. వెన్నెలా కబడ్డీకుళు చిత్రం నాకు, నా భార్యకు చాలా నచ్చిన చిత్రం. మా పిల్లలు మాత్రం వెన్నెలా కబడ్డీకుళు, అరణ్మణై–2 చిత్రాల్లోని కామెడీని బాగా ఎంజాయ్ చేస్తారు.
నయన్‌తో డ్యుయెట్: నయనతారతో డ్యూయెట్ పాడాలని ఆశ ఉంది. అందుకు ఆమె సమ్మతించాల్సి ఉంటుంది. అంతకంటే హీరోగా నటించాలన్న కోరిక అస్సలు లేదు. కామెడీలో చేయాల్సింది ఇంకా చాలా ఉంది.
నాన్నే స్ఫూర్తి: నా కామెడీకి నాన్నే స్ఫూర్తి. ఆయన చేసిన దాంట్లో నేను ఇప్పుటికి 10 శాతం కూడా చేయలేదు. నాన్న నిజ జీవితంలోనే అంత వినోదాన్ని పంచేవారు. అప్పట్లో ఆకలి ఉండేది. డబ్బు ఉండేది కాదు. ఇప్పుడు దేవుని దయ వల్ల డబ్బు ఉన్నా, తినలేని పరిస్థితి. 10 కాలాల పాటు హీరోలకు స్నేహితుడిగా నటించి మెప్పించాలంటే శారీరక భాష చాలా ముఖ్యం. అందుకు ఆహార కట్టుబాట్లు చాలా అవసరం.