నాయర్ నిలబెట్టాడు
► డేర్‌డెవిల్స్‌ను గెలిపించిన కరుణ్ నాయర్
► 6 వికెట్లతో హైదరాబాద్ ఓటమి
► ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు సజీవం
ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ మళ్లీ ప్లే ఆఫ్ రేసులోకి వచ్చింది. ఆశలు నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు సమష్టిగా రాణించింది. ముందుగా బ్రాత్‌వైట్ బౌలింగ్, ఆ తర్వాత కరుణ్ నాయర్ మెరుపు బ్యాటింగ్‌తో డెవిల్స్‌కు కీలక విజయం దక్కింది. లీగ్‌లో ‘టాప్’లో ఉన్న సన్‌రైజర్స్... ఈసారి బ్యాటింగ్‌లో తడబడి ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆఖర్లో కాస్త ఉత్కంఠ ఎదురైనా... చివరి బంతికి ఢిల్లీ లక్ష్యం చేరడంలో సఫలం అయింది.
రాయ్‌పూర్: ఢిల్లీ విజయం కోసం చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా... భువనేశ్వర్ వేసిన తొలి నాలుగు బంతుల్లో ఐదు పరుగులే వచ్చాయి. ఆఖరి రెండు బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన స్థితిలో కరుణ్ నాయర్ ఒత్తిడిని అధిగమించాడు. వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఢిల్లీ ఆశలు సజీవంగా నిలబెట్టాడు. శుక్రవారం ఇక్కడి షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో డేర్ డెవిల్స్ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 73; 8 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి అర్ధ సెంచరీతో చెలరేగాడు. అనంతరం ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (59 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ముందుండి నడిపించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 32; 3 ఫోర్లు) అండగా నిలిచాడు. తాజా ఫలితంతో ఢిల్లీ ప్లే ఆఫ్ ఆశలు నిలిచాయి. ఆ జట్టు తమ చివరి మ్యాచ్‌లలో బెంగళూరుతో, సన్‌రైజర్స్ తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడతాయి.
వార్నర్ జోరు: సీజన్ ఆరంభంనుంచి రైజర్స్ బ్యాటింగ్ భారం మోస్తున్న కెప్టెన్ డేవిడ్ వార్నర్ మరో సారి ఆపద్బాంధవుడయ్యాడు. లీగ్‌లో ఏడో అర్ధ సెంచరీతో అతను జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. బ్యాటింగ్‌కు పెద్దగా అనుకూలించని నెమ్మదైన పిచ్‌పై ఒక వైపు వార్నర్ దూకుడైన బ్యాటింగ్ ప్రదర్శించినా...మరో ఎండ్‌లో ఐదు బంతుల వ్యవధిలో ధావన్ (10), హుడా (1) రనౌట్ కావడం సన్‌కు అడ్డుకట్ట వేసింది. తమ బౌలింగ్‌లోనే చక్కటి ఫీల్డింగ్‌తో బ్రాత్‌వైట్, మిశ్రా ఈ రెండు వికెట్లు తీశారు.
కొద్ది సేపటికే యువరాజ్ (10) బ్రాత్‌వైట్ బంతిని వికెట్లపైకి ఆడుకోవడంతో రైజర్స్ మరింత ఇబ్బందుల్లో పడింది. 40 బంతుల్లో వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతడిని కూడా బ్రాత్‌వైట్ వెనక్కి పంపి దెబ్బ తీయగా, హెన్రిక్స్ (18), మోర్గాన్ (14), ఓజా (16 నాటౌట్) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా చివరి ఐదు ఓవర్లలో సన్ 43 పరుగులు మాత్రమే చేయగలిగింది.
కీలక భాగస్వామ్యం: ఛేదనలో ఢిల్లీకి కూడా సరైన ఆరంభం లభించలేదు. బరీందర్ తన తొలి ఓవర్లోనే డి కాక్ (2)ను అవుట్ చేయడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అయితే బరీందర్ తర్వాతి ఓవర్లో నాయర్ మూడు బౌండరీలు కొట్టి జోరు పెంచే ప్రయత్నం చేశాడు. అనంతరం రైజర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగా, పంత్, నాయర్ కూడా భారీ షాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. దాంతో తర్వాతి ఏడు ఓవర్లలో కేవలం 2 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే వచ్చాయి. రెండో వికెట్‌కు 59 బంతుల్లో 73 పరుగులు జోడించిన అనంతరం భువనేశ్వర్ డెరైక్ట్ త్రోకు పంత్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో నాయర్, డుమిని (17) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 15వ ఓవర్లో నాయర్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను వార్నర్ వదిలేయడం ఆ జట్టుకు కలిసొచ్చింది. డుమినితో పాటు బ్రాత్‌వైట్ (10) అవుటైనా, నాయర్ చివరి వరకు నిలబడి విజయాన్ని అందించాడు.
స్కోరు వివరాలు: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) మిశ్రా (బి) బ్రాత్‌వైట్ 73; ధావన్ (రనౌట్) 10; హుడా (రనౌట్) 1; యువరాజ్ (బి) బ్రాత్‌వైట్ 10; హెన్రిక్స్ (సి) నేగి (బి) డుమిని 18; మోర్గాన్ (సి) బ్రాత్‌వైట్ (బి) కూల్టర్‌నీల్ 14; ఓజా (నాటౌట్) 16; భువనేశ్వర్ (రనౌట్) 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1-46; 2-48; 3-66; 4-105; 5-117; 6-132; 7-158.
బౌలింగ్: జహీర్ ఖాన్ 4-0-26-0; జయంత్ యాదవ్ 4-0-37-0; కూల్టర్‌నీల్ 4-0-36-1; బ్రాత్‌వైట్ 4-0-27-2; మిశ్రా 3-0-21-0; డుమిని 1-0-9-1.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) బరీందర్ 2; పంత్ (రనౌట్) 32; నాయర్ (నాటౌట్) 83; డుమిని (సి) వార్నర్ (బి) బరీందర్ 17; బ్రాత్‌వైట్ (సి) బరీందర్ (బి) ముస్తఫిజుర్ 10; శామ్సన్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1-9; 2-82; 3-117; 4-143.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-0; బరీందర్ 4-0-34-2; ముస్తఫిజుర్ 4-0-24-1; హెన్రిక్స్ 2-0-18-0; హుడా 2-0-16-0; కరణ్ శర్మ 3-0-25-0; యువరాజ్ 1-0-7-0.