గిరిజనుడి దారుణ హత్య
కుక్కునూరు : పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం తొంటిపాక పంచాయతీ రామాపురం గుత్తికోయల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హతుడు చత్తీస్‌గఢ్‌కు చెందిన సుకుమా జిల్లా బూరుగుపాడు గ్రామానికి చెందిన యేమ్ల రమేష్ (24)గా గుర్తించారు. హతుడు గతంలో ఎస్పీవో(పోలీస్ ఇన్ఫార్మర్)గా పనిచేశాడు. నక్సల్స్ కార్యకలాపాలు తెలుసుకునేందుకు పోలీసులు గతంలో కొంతమంది గిరిజన యువకులను ఎంపిక చేసుకుని ఎస్పీవోలుగా నియమించుకున్నారు.
నాలుగు రోజుల క్రితం రమేష్ బంధువులు మండలంలోని రామాపురం గ్రామానికి రావడంతో వారిని తీసుకువెళ్లేందుకు మంగళవారం వచ్చాడు. బుధవారం ఉదయం బంధువులను తన వెంట తీసుకు వెళ్తుండగా మాటు వేసిన దుండగులు నలుగురు రమేష్‌పై దాడిచేసి హతమార్చారు. నలుగురిలో ఇద్దరు రమేష్ వెంటపడి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి అతిదారుణంగా కత్తితో నరికి చంపారు. మరో ఇద్దరు రమేష్ బంధువైన రాము వెంట పడగా.. అతను అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అయితే రాము జాడ ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉండగా, రమేష్ మృతదేహాన్ని మాత్రం పోలీసులు అటవీప్రాంతంలో గుర్తించారు. ఘటనా స్థలానికి ఏఎస్ఐ పార్థసారథి తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్ హత్యకు పాల్పడింది నక్సల్సా లేక నక్సల్స్ సానుభూతిపరులా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.