సాగర్ చుట్టూ హైఫై టవర్స్..
* వంద అంతస్తుల వరకు భారీ నిర్మాణాలు.. పెట్రోనాస్ టవర్లలా అంతర్జాతీయ హంగు
* వెంటనే భూముల సర్వేకు ఆదేశం
* అంతర్జాతీయ స్థాయిలో నెక్లస్ రోడ్ సుందరీకరణ.. పూర్తి స్థాయిలో హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన
* రెవెన్యూ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ అందమైన ఆకాశహర్మ్యాలను నిర్మించాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. కనీసం 60 నుంచి వంద అంతస్తులుండే భారీ టవర్స్ నిర్మాణంపై బుధవారం ఆయన అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో కేసీఆర్ సమీక్ష జరిపారు. హుస్సేన్ సాగర్ చుట్టూ వచ్చే భారీ టవర్లు నగరానికి మణిహారంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.
అంతర్జాతీయ నగరాలకుండే ప్రత్యేకతల్లో బహుళ అంతస్తుల భవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉందంటూ, ప్రపంచంలోని మరే అంతర్జాతీయ నగరానికి తీసిపోని విధంగా ఎత్తయిన భవనాలను నిర్మించాలని కేసీఆర్ పేర్కొన్నారు. కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, ముంబై సముద్రతీరంలోని టవర్లను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిచేందుకు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తాయని చెప్పారు. బహుళ అంతస్తుల నిర్మాణాలకు అవరోధంగా ఉన్న నిబంధనలను సడలిస్తామని సీఎం పేర్కొన్నారు.
ఈ భారీ టవర్ల నిర్మాణ బాధ్యతలు ప్రభుత్వమే చేపట్టాలా.. లేక ప్రైవేటుకివ్వాలా అన్న దానిపై అధ్యయనం చేసి తగిన విధానాన్ని ఆచరిద్దామన్నారు. నగర ప్రజలు సేదతీరేందుకు ఉపకరిస్తున్న నెక్లెస్‌రోడ్డు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని, ఆ ప్రాంతాలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. జలవిహార్, లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, ఇందిరా పార్క్‌ను అంతర్జాతీయ స్థాయి వినోద కేంద్రాలుగా మరింతగా తీర్చిదిద్దాలన్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని అంబేద్కర్‌నగర్, తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల కోసం అందమైన టవర్ల సరసనే మరో టవర్ నిర్మిస్తామని చెప్పారు.
భారీ టవర్లలో స్టార్‌హోటళ్లు, పర్యాటకుల కోసం వసతి గృహాలు ఉంటాయన్నారు. హుస్సేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, వేసవిలో సాగర్‌లోని నీటినంతా ఖాళీ చేసి అడుగుభాగంలోని చెత్తాచెదారాల్ని తొలగించాలని అధికారులకు సూచించారు. టవర్ల నుంచి వెలువడే మురికినీరు సాగర్‌లో కలువకుండా నేరుగా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూములపై వెంటనే సర్వే నిర్వహించి లేఔట్ డిజైన్ చేయాలని, కోర్టు వివాదాలేమైనా ఉంటే వెంటనే పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని నిర్దేశించారు. అయితే హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో భారీ భవనాలను నిర్మించాలంటే సుప్రీంకోర్టు అనుమతి పొందాల్సి ఉండగా, సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు రానట్లు తెలిసింది.
నమూనాలు.. స్థలాల పరిశీలన
భారీస్థాయిలో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల నమూనాలతోపాటు వాటిని నిర్మించేందుకు అనువైన ప్రదేశాలను కూడా ముఖ్యమంత్రి గూగుల్ మ్యాప్ ద్వారా పరిశీలించారు. బోట్స్ క్లబ్ నుంచి మొదలుకొని నెక్లెస్‌రోడ్డు, జలవిహార్, అంబేద్కర్‌నగర్, సంజీవయ్యపార్కు, సికింద్రాబాద్ బోట్స్‌క్లబ్, మారియట్ హోటల్, డీబీఆర్‌మిల్స్, లోయర్ ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్ తదితర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను, ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు.
ఆయా ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో అద్భుతమైన టవర్స్‌ను నిర్మించవచ్చునని అభిప్రాయపడ్డారు. రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఈ స్థలాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఉన్న భూముల్లో ప్రతి అడుగుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో నివేదిక రూపొందించాలన్నారు. వాతావరణ పరిస్థితులు, భౌగోళికాంశాలతోపాటు నగరానికి హుస్సేన్‌సాగర్ కూడా ఒక వరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.