సోలార్ పవర్‌తో కరెంట్ కష్టాలకు చెక్
తిరుపతి, న్యూస్‌లైన్ : సోలార్ విద్యుత్‌తో గృహావసరాలకు కరెంట్ కష్టాలు తొలగడంతో పాటు అదనంగా ఆదాయం చేకూరనుంది. ఈ విధానాన్ని నెడ్‌క్యాప్ సంస్థ తిరుపతిలో ఆవిష్కరించింది. స్థానిక ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్న ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ కలాల రంగనాథం ఇంటిలో నెడ్‌క్యాప్ ఆధ్వర్యంలో 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ను నెలకొల్పారు.
దీనికి ఎస్పీడీసీఎల్ సంస్థ నెట్‌మీటరింగ్ పరికరాన్ని అమర్చింది. గృహావసరాలకు వాడుకున్నది పోను మిగిలిన సౌరవిద్యుత్‌ను గ్రిడ్‌కు సప్లై చేసే ఏర్పాటు ఉంది. దీని నుంచి ట్రాన్స్‌కో ఎంత వాడుకున్నదీ మీటర్లో నమోదవుతుంది. ప్రతి ఆరు నెలలకోసారి లెక్క చూసి వినియోగదారుడి నుంచి తీసుకున్న విద్యుత్‌కు ఏపీఈఆర్సీ నిర్ణయించిన మేరకు ట్రాన్స్‌కో చెల్లిస్తుంది.
కలాల రంగనాథం ఇంటిలో ఏర్పాటు చేసిన ఈ నెట్‌మీటరింగ్ విధానాన్ని శుక్రవారం మండల సమాఖ్య బృందాలకు చూపెట్టారు. ఈ సందర్భంగా కలాల రంగనాథం మాట్లాడుతూ 3 కి లోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ యూనిట్ ధర రూ.3.33 లక్షలు కాగా కేంద్ర ప్రభుత్వం రూ.90 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.60 వేలు వంతున సబ్బిడీ ఇచ్చాయన్నారు. యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గత 40 రోజుల్లో 498 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు.
ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్‌వై దొర మాట్లాడుతూ విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే కళాశాలలు, హాస్టళ్లకు నెట్‌మీటరింగ్ సోలార్ పవర్ యూనిట్లు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. గృహావసరాలకు వినియోగించే యూనిట్‌పై 50 శాతం, వాణిజ్య సంస్థలకు 30 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా నెడ్‌క్యాప్ మేనేజర్ జగదీశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ సుబ్బరాజు, డివిజనల్ ఇంజనీర్ మునిశంకరయ్య, ఏడీఈ చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ చెంగల్రాయనాయుడు పాల్గొన్నారు.