విభజన చట్టంలో ‘హోదా’ అంశమే లేదు
అప్పుడు చేర్చకుండా ఇప్పుడు కాంగ్రెస్ నాటకాలాడుతోంది
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
నెల్లూరు: రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి తనయుడు రామ్‌కుమార్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల గొంతు కోసిందన్నారు. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలపై మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు.
విభజన చట్టంలో ప్రత్యేక హోదాను ఎందుకు చేర్చలేదని పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నించినట్లు తెలిపారు. విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రెవెన్యూ లోటును పూడ్చేందుకు ఐదేళ్లలో రూ.26,819 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మాణానికి రూ.1,000 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ నెల 28న తిరుపతిలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గంగా, కావేరి నదులతోపాటు కృష్ణా, పెన్నా, గోదావరి నదులను అనుసంధానిస్తామన్నారు.
కాంగ్రెస్ నుంచి నేదురుమల్లి కుమారుడి బహిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించారు. ఈమేరకు పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆదివారం ఆదేశాలు జారీచేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున రాంకుమార్‌రెడ్డిని బహిష్కరిస్తున్నట్లు రఘువీరా పేర్కొన్నారు.