పానీయాల నావికుడు
లోకల్
బాల్యం గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. మీ ఊరి తిరునాళ్లకో లేదా జాతరకో వెళ్లండి ఒకసారి....ఎర్రటి ఎండలో తిరిగీ తిరిగీ, అలసిపోయి దాహం వేసినప్పుడు... నన్నారి బండి దగ్గరికో, పుదీన డ్రింక్స్ దగ్గరికో, ఎర్రై నిమ్మకాయ షర్బత్ బండి దగ్గరికో పరుగెత్తుకు వెళ్లి హాయి హాయిగా, తీయతీయగా దాహం తీర్చుకున్న జ్ఞాపకం... ఇప్పటికీ మీతో భద్రంగా ఉండే ఉంటుంది. ఊళ్లో ఉన్నా సరే.... ఏ దేశానికో వెడుతూ విమాన ప్రయాణంలో ఉన్నాసరే...
యంబీఏ చదువుకున్న నీరజ్ కక్కర్.... ఆరోజు విమాన ప్రయాణంలో ఉన్నారు. ఆయన పక్కన కూర్చున్న వ్యక్తి చేతిలో సరికొత్త ‘సట్టు డ్రింకు’ కనిపిస్తుంది. అది ‘పేపర్ బోట్’ అనే సంస్థకు చెందిన ఉత్పత్తి. నీరజ్ టీషర్ట్ మీద కనిపించిన ‘పేపర్ బోట్’ సంస్థ లోగోను చూసి ‘‘పేపర్ బోట్ వాళ్లు చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారండీ’’ అని మెచ్చుకోలుగా మాట్లాడాడు ఆయన పక్కన కూర్చున్న బీహార్‌కు చెందిన న్యాయవాది. ‘సట్టు డ్రింక్’ను ఆ న్యాయవాది ఇష్టపడడం వెనుక ప్రధాన కారణం... అది తమ ప్రాంతానికే చెందిన ఇష్టమైన పానీయం కావడం.
ఒక్క ‘సట్టు డ్రింకు’ అని మాత్రమే కాదు... ఆమ్స్,్ర ఆమ్పాన, జామున్ కల్కత్తా, ఇమిలీ కా ఆమ్లాన, రసం, తులసి, జింజర్, లెమన్ ఐస్ టీ... ఎలా ఎన్నో ప్రాంతాలకు చెందిన ఇష్టమైన పానీయాలను సరికొత్త రీతిలో ఉత్పతి చేస్తూ ప్రాచుర్యం పొందుతోంది ‘పేపర్ బోట్’. ఈ విజయం వెనుక ప్రధాన కారకుడు నీరజ్ కక్కర్. ఒకప్పుడు ఆయన కోకోకోలా కంపెనీలో ఉద్యోగి. విశేషమేమిటంటే తన స్నేహితులతో కలిసి నీరజ్ ఏర్పాటు చేసిన ‘పేపర్‌బోట్’ పానీయాల సంస్థ ప్రసిద్ధ కోకోకోలా, పెప్సిలాంటి భారీ పానీయాలతో పోటీ పడుతుండటం. మరిచిన పోయిన సంప్రదాయ పానియాలను ‘పేపర్‌బోట్’ మరోసారి గుర్తుకు తెస్తోంది మరి.
‘‘ఒకే ప్రాంతానికి పరిమితమై పానీయాలను జాతీయస్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేయాలనే ఆలోచనలో భాగంగానే పేపర్బోట్ను ప్రారంభించాం. పేపర్‌బోట్ అనేది భౌగోళిక, చరిత్ర జ్ఞాపకాలతో మిళితమైన పానీయం’’ అంటున్నారు కక్కర్. బాల్య జ్ఞాపకాలకు బలమైన ప్రతీకగా నిలుస్తుందనే కారణంతో తమ పానీయాల ఉత్పత్తికి ‘పేపర్ బోట్’ అని నామకరణం చేశారు కక్కర్. ఎసిడిటీ కారకాలు దరి చేరకుండా ఈ సంప్రదాయ పానీయాలను తయారుచేశారు. ఢిల్లీ కేంద్రంగా ఉత్పత్తి అవుతున్న ‘పేపర్ బోట్’ పానీయాలు కేవలం మన దేశంలోనే కాకుండా అమెరికా, యుఎయి, కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా... మొదలైన దేశాల్లో అమ్ముడవుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పంపిణీ వ్యవస్థ బలంగా ఉండడం కూడా ‘పేపర్ బోట్’ విజయ రహస్యం.