26 నుంచి డీఆర్డీవోలకు శిక్షణ
హైదరాబాద్: కొత్తగా కొలువుదీరిన అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులకు(డీఆర్డీవో) ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో గతంలో ఉన్న డ్వామా సంస్థను ప్రభుత్వం డీఆర్డీఏలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆయా సంస్థలకు ప్రాజెక్ట్ డెరైక్టర్లుగా ఉన్న అధికారులను డీఆర్డీవోలుగా జిల్లాకు ఒకరిని నియమించింది.
దీంతో డ్వామా పీడీలకు డీఆర్డీఏ పైనా, డీఆర్డీఏ అధికారులకు డ్వామా కార్యక్రమాల అవగాహన లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆసరా పింఛన్లు, ఉపాధిహామీ పథకం, నగదు చెల్లింపు విధానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేస్తున్నామని డెరైక్టర్ నీతూ కుమారి ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఐపార్డ్)లో జరగనున్న ఈ వర్క్‌షాప్‌కు అన్ని జిల్లాల డీఆర్డీవోలు హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.