టీవీ ‘షో’లతో స్వచ్ఛ భారత్ సాధిస్తారా?
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూటిప్రశ్న
విజయవాడ సెంట్రల్ : ఫొటోలకు ఫోజులిచ్చి, టీవీలో షో చేస్తే స్వచ్ఛభారత్ అమలు సాధ్యమవుతుందా అని పీసీసీ అధ్యక్షుడు ఎం.రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. మాజీ ప్రధాని స్వర్గీయ చాచా నెహ్రూ 125వ జయంతి వేడుకల్ని ఆంధ్రరత్నభవన్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ స్ఫూర్తితో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టామని చెబుతున్న ప్రధాని మోదీ... క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. మురికివాడల్లో దుర్గంధాన్ని తొలగించకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చకుండా స్వచ్ఛ భారత్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.
టీవీలు, పేపర్లకు ఫోజులివ్వడంతోనే స్వచ్ఛభారత్‌ను సాధించేశామని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంబరపడుతున్నాయన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చేందుకు గాంధీజీ, నెహ్రూ ఎన్నో త్యాగా లు చేశారని చెప్పారు. ఏళ్లతరబడి జైళ్లలో గడిపిన వారు ఏనాడు బెయిల్ కోసం ప్రయత్నించలేదన్నారు. కాం గ్రెస్ పార్టీ వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలి పారు. దళిత, గిరిజనుల సంక్షేమం కార్యక్రమాలకు నెహ్రూ, ఇందిరాగాంధీ పెద్దపీట వేశారని చెప్పారు.
చిన్నారుల చేతిలోనే భవిష్యత్...
చిన్నారుల చేతిలోనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని రఘువీరారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తెర వెనుక నుంచి నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థ నిర్వహణలో సాగే పత్రికలో గాంధీని చంపిన గాడ్సే నెహ్రూను చంపాల్సి ఉందని పిచ్చి రాతలు రాశారన్నారు. ప్రతి భారతీయుడు దీన్ని ఖండించాలన్నారు. అనంతరం మడోనా బదిరుల పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులకు రఘువీరా రెడ్డి నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, సిటీకాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రాజేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి దేవినేని అవినాష్, సిటీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు, ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు పి.రాజీవ్త్రన్ తదితరులు పాల్గొన్నారు.