‘నెక్కంటి’లో మళ్లీ ప్రమాద ఘంటికలు
వాంతులతో 26 మందికి అనారోగ్యం
మొత్తం అస్వస్థులైన వారి సంఖ్య 56 మంది
కాకినాడ, రాజమండ్రి ఆస్పత్రులకు తరలింపు
ఫ్యాక్టరీ తాత్కాలిక మూసివేతకు జేసీ ఆదేశం
పెద్దాపురం : పెద్దాపురం–జగ్గంపేట మార్గంలోని నెక్కంటి సీఫుడ్స్‌లో మరోమారు ప్రమాద ఘంటికలు మోగాయి. సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో 30 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం సంభవించిన ప్రమాదంలో మరో 26 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇప్పటి వరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య 56కు చేరింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం యథావిధిగా నెక్కంటి సీఫుడ్స్‌లో విధులకు హాజరైన మహిళలు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కిందపడిన మహిళలు వాంతులు చేసుకుంటూ బాధపడుతుండడంతో కాకినాడ, రాజమండ్రిల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా సీఫుడ్స్ యాజమాన్యం పోలీసు, మీడియా, ప్రజాసంఘాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈ ఫ్యాక్టరీలో జనరల్ డ్యూటీలకు వెళ్లే మహిళలు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి వెనుకకు పరుగులు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్సై సతీష్ అక్కడకు చేరుకున్నారు. మరోపక్క ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన పాత్రికేయులపై యాజమాన్యం దాడిచేసే ప్రయత్నం చేసింది. మీడియాను లోపలికి రాకుండా నిలువరించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖరరావు, తహసీల్దార్ వరహాలయ్య, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, చీఫ్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్‌రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవీంద్రబాబు, కార్మికశాఖ కమిషనర్ కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణంపై ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ సాంకేతిక నిపుణులతో వారు చర్చించారు. ప్లాంట్లోలోని ఏసీ సామర్థ్యం, ఆక్సిజ¯ŒS లోపం వల్లే మహిళలు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. కార్మికుల భద్రత దృష్టా తాత్కాలికంగా ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేయాలని జేసీ సత్యనారాయణ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న మహిళలు సృహతప్పి పడిపోతుంటే వారిపై సత్తెమ్మ అమ్మవారు పూని అలా కింద పడిపోతున్నారని యాజమాన్యం ప్రచారం చేస్తున్నట్టు సమాచారం.
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
మహిళల అస్వస్థతకు కారణమైన నెక్కంటి సీఫుడ్స్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ, రైతుకూలీ సంఘం, ఆర్పీఐ, లిబరేషన్, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టాయి. 30 మంది సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
సంజీవి ఆస్పత్రికి 18 మంది
కాకినాడ క్రైం: పెద్దాపురం సమీపంలోని నెక్కింటి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో బుధవారం కార్భన్ డయాక్సైడ్ లీకవడంతో అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని యాజమాన్యం కాకినాడలోని సంజీవి ఆస్పత్రికి తరలించింది. ఇదే ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన వారిలో 28 మందిని ఇదే ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. రొయ్యల కంపెనీలో వెదజల్లిన విషవాయువుపై విచారణ చేపట్టకుండా, లోపాలను సరిచేయకుండా బుధవారం కంపెనీలో పనులు నిర్వహించడంపై సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ తక్షణమే విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.