కళారంగాన్ని ప్రోత్సహించాలి
సురేష్ మండువకు ఆత్మీయ సత్కారం
నెల్లూరు(బారకాసు): సమాజ మార్పు కోసం కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, 25 కళాసంఘాల గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. హరివిల్లు క్రియేషన్స్ పర్యవేక్షణలో 25 కళాసంఘాల ఆధ్వర్యంలో టౌన్హాల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ మాజీ అధ్యక్షుడు సురేష్ మండువకు ఆత్మీయ అభినందన పురస్కార కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడారు. కళారంగం కనుమరుగువుతున్న తరుణంలో అమెరికాలో ఉద్యోగ రీత్యా స్థిరపడిన నెల్లూరీయుడు సురేష్ మండువ అక్కడ కళాకారులకు మంచి అవకాశాలు కల్పించి వారితో ప్రదర్శనలను నిర్వహించేలా చొరవ చూపడాన్ని అభినందించారు. అనంతరం ఓఎస్డీ పెంచలరెడ్డి మాట్లాడారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు అమెరికాలో తన వంతు కృషి చేస్తున్న సురేష్‌మండువ అభినందనీయుడన్నారు. పురస్కార గ్రహీత సురేష్‌మండువ మాట్లాడుతూ.. కళారంగమన్నా, కళలపై తనకెంతో అభిమానమని, తాను అమెరికాలో స్థిరపడినా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను అక్కడి వారికి తెలియజేసేందుకు పలు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. ప్రతిభ కలిగిన కళాకారుల గురించి తనకు తెలియజేస్తే అమెరికాలో వారితో ప్రదర్శనలిచ్చే అవకాశం కల్పిస్తామన్నారు. అనంతరం సురేష్మండువను శాలువాలు, గజమాలలతో సత్కరించారు. ప్రముఖ నృత్య కళాకారిణి నదియా తన నాట్య ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర పలువురి సినీ కళాకారుల గొంతులను అనుకరించారు. గురుకృప కళాక్షేత్ర విద్యార్థుల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, సాయిహేమంత్‌కృష్ణ నాశిక వేణుగానం ఆహూతులను ఆకట్టుకున్నాయి. నాటా కార్యవర్గ సభ్యుడు కృష్ణపాటి రమణారెడ్డి, వాకాటి విజయ్‌కుమార్‌రెడ్డి, కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యంయాదవ్, మయూరి బ్యూటీపార్లర్ అధినేత్రి దుర్గాదేవి, అందె శ్రీనివాసులు, హరివిల్లు క్రియేషన్స్ అధినేత దోర్నాల హరిబాబు, పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ అధినేత గాలి కిరణ్‌కుమార్, ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, గుర్నాథం, పురస్కార గ్రహీత తండ్రి మండువ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.