nemaiks
-
డాలర్ నీడన పసిడి వెలవెల...
న్యూయార్క్/ముంబై: అమెరికాలో వడ్డీరేట్లు పెరగడానికి తగిన బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా పసిడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ (నెమైక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రా) కాంట్రాక్ట్ ధర భారీగా నష్టపోయింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ ఒక్కింటికీ దాదాపు 40 డాలర్లు నష్టపోయి 1,273 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 19 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా సెప్టెంబర్ తయారీ రంగం పటిష్ట పడిందన్న వార్తలు ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 0.25 శాతం 0.50 శాతం) ఈ ఏడాది పెరగవచ్చన్న అంచనాలు పసిడిపై ప్రభావం చూపాయి. ఈ అంచనాలతో డాలర్ బలపడి.. పుత్తడి ధర దిగజారుతోంది. దేశీయంగానూ ఎఫెక్ట్... ఇక దేశీయంగానూ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లోనూ మంగళవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి పసిడి 10 గ్రాముల ధర రూ.606 పడిపోయి, రూ.29,973 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.1,816 పడిపోయి రూ.43,077 వద్ద ట్రేడవుతోంది. తాజా ధోరణి ఇదే తీరులో కొనసాగితే... బుధవారం ముంబై స్పాట్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉంది. -
పసిడి వెనకడుగు!
న్యూయార్క్/ముంబై: అంతర్జాతీయ మార్కెట్ నెమైక్స్‌లో బలహీన ధోరణి, దేశీయంగా కొనుగోళ్ల మద్దతు తగ్గడం వంటి కారణాలతో పసిడి సోమవారం వెనకడుగు వేసింది. కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న ఫిబ్రవరి కాంట్రాక్ట్ ఔన్స్ (31.1గ్రా) పసిడి ధర క్రితం ధరతో పోల్చితే 21 డాలర్ల నష్టంతో 1,210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి 15 డాలర్ల పైనే ట్రేడవుతున్నా... నష్టాల్లోనే ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్- మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో కూడా కడపటి సమాచారం అందే సరికి పసిడి 10 గ్రాముల ధర క్రితంతో పోల్చితే భారీగా రూ.535 క్షీణించి రూ.28,980 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.534 నష్టంతో రూ.36.983 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే... మంగళవారం స్పాట్ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. కాగా సోమవారం ముంబై స్పాట్ మార్కెట్లో సైతం పసిడి 99.9 ప్యూరిటీ 10 గ్రాముల ధర రూ. 445 తగ్గి రూ.28,650కి చేరింది. 99.5 ప్యూరిటీ ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూ.28,500కు చేరింది. వెండి కేజీ ధర రూ.655 తగ్గి రూ.37,035కు చేరింది. -
పసిడి.. పరుగో పరుగు!
దేశీయంగా ఏడాది గరిష్ట స్థాయి న్యూయార్క్/ముంబై: అంచనాలకు భిన్నంగా పసిడి ఆశ్చర్యకరంగా పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమన ధోరణి, క్రూడ్ ధరల పతనం నేపథ్యంలో న్యూయార్క్ ప్రధాన కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర అదేపనిగా పెరుగుతోంది. ఈ సానుకూల సంకేతాలతో పాటు స్థానిక కొనుగోళ్ల మద్దతు లభించడం దేశీయంగా పసిడి బలిమి పెరుగుతోంది. ముంబై ప్రధాన మార్కెట్లో 10 గ్రాములకు 99.9 స్వచ్ఛత పసిడి సోమవారం ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.345 ఎగసి రూ. 27,925కి చేరింది. 99.5 స్వచ్ఛత పసిడి ధరా ఇంతే మొత్తం పెరిగి రూ.27,775కు ఎగసింది. పసిడికి ఈ ధరలు ఏడాది గరిష్ట స్థాయి. 2015 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి ధరలు ఎగయడం ఇదే తొలిసారి. ఇక వెండి కేజీ ధర రూ.235 ఎగసి రూ.36,390కి ఎగసింది. అంతర్జాతీయంగా చూస్తే... సోమవారం కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న మార్చి డెలివరీ పసిడి కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే... ఔన్స్ (31.1గ్రా)కు 38 డాలర్ల లాభంతో 1,195 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 15 డాలర్లపైన ట్రేడవుతోంది. దేశీయ ఫ్యూచర్స్‌లో... భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా ట్రేడింగ్ జరుగుతోంది. కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.800 లాభంతో రూ.28,320 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర రూ.1,255 లాభంతో రూ.37,060 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగి ట్రేడింగ్ ముగిస్తే... మంగళవారం ఇక్కడి స్పాట్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెకైగసే అవకాశం ఉంది.