డాలర్ నీడన పసిడి వెలవెల...
న్యూయార్క్/ముంబై: అమెరికాలో వడ్డీరేట్లు పెరగడానికి తగిన బలమైన సంకేతాలు రావడంతో ఒక్కసారిగా పసిడిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్ (నెమైక్స్)లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి ఔన్స్ (31.1 గ్రా) కాంట్రాక్ట్ ధర భారీగా నష్టపోయింది. కడపటి సమాచారం అందే సరికి ఔన్స్ ఒక్కింటికీ దాదాపు 40 డాలర్లు నష్టపోయి 1,273 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా 19 డాలర్ల దిగువకు పడిపోయింది.
అమెరికా సెప్టెంబర్ తయారీ రంగం పటిష్ట పడిందన్న వార్తలు ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు ఇచ్చాయి. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుత శ్రేణి 0.25 శాతం 0.50 శాతం) ఈ ఏడాది పెరగవచ్చన్న అంచనాలు పసిడిపై ప్రభావం చూపాయి. ఈ అంచనాలతో డాలర్ బలపడి.. పుత్తడి ధర దిగజారుతోంది.
దేశీయంగానూ ఎఫెక్ట్...
ఇక దేశీయంగానూ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లోనూ మంగళవారం రాత్రి కడపటి సమాచారం అందేసరికి పసిడి 10 గ్రాముల ధర రూ.606 పడిపోయి, రూ.29,973 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కేజీకి రూ.1,816 పడిపోయి రూ.43,077 వద్ద ట్రేడవుతోంది. తాజా ధోరణి ఇదే తీరులో కొనసాగితే... బుధవారం ముంబై స్పాట్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉంది.