పసిడి.. పరుగో పరుగు!
దేశీయంగా ఏడాది గరిష్ట స్థాయి
న్యూయార్క్/ముంబై: అంచనాలకు భిన్నంగా పసిడి ఆశ్చర్యకరంగా పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, ఆర్థిక మందగమన ధోరణి, క్రూడ్ ధరల పతనం నేపథ్యంలో న్యూయార్క్ ప్రధాన కమోడిటీ మార్కెట్ నెమైక్స్‌లో పసిడి ధర అదేపనిగా పెరుగుతోంది. ఈ సానుకూల సంకేతాలతో పాటు స్థానిక కొనుగోళ్ల మద్దతు లభించడం దేశీయంగా పసిడి బలిమి పెరుగుతోంది. ముంబై ప్రధాన మార్కెట్‌లో 10 గ్రాములకు 99.9 స్వచ్ఛత పసిడి సోమవారం ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.345 ఎగసి రూ. 27,925కి చేరింది. 99.5 స్వచ్ఛత పసిడి ధరా ఇంతే మొత్తం పెరిగి రూ.27,775కు ఎగసింది. పసిడికి ఈ ధరలు ఏడాది గరిష్ట స్థాయి. 2015 ఫిబ్రవరి తరువాత ఈ స్థాయికి ధరలు ఎగయడం ఇదే తొలిసారి. ఇక వెండి కేజీ ధర రూ.235 ఎగసి రూ.36,390కి ఎగసింది.
అంతర్జాతీయంగా చూస్తే...
సోమవారం కడపటి సమాచారం అందే సరికి నెమైక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న మార్చి డెలివరీ పసిడి కాంట్రాక్ట్ ధర క్రితం ముగింపుతో పోల్చితే... ఔన్స్ (31.1గ్రా)కు 38 డాలర్ల లాభంతో 1,195 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి సైతం 15 డాలర్లపైన ట్రేడవుతోంది.
దేశీయ ఫ్యూచర్స్‌లో...
భారత్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా ట్రేడింగ్ జరుగుతోంది. కడపటి సమాచారం అందే సరికి 10 గ్రాముల ధర క్రితం ముగింపుతో పోల్చితే రూ.800 లాభంతో రూ.28,320 వద్ద ట్రేడవుతోంది. వెండి కేజీ ధర రూ.1,255 లాభంతో రూ.37,060 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగి ట్రేడింగ్ ముగిస్తే... మంగళవారం ఇక్కడి స్పాట్ మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పెకైగసే అవకాశం ఉంది.