Nennel Mandal
-
ప్రియురాలి మరణవార్త విని.. నీవు లేని లోకంలో ఉండలేనంటూ..
‘మనసులు ఏకమయ్యాయి.. కలకాలం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం... నాకు నువ్వు, నీకు నేను తోడుగా కొత్త జీవితం ప్రారంభిద్దామనుకున్నాం.. నీ ఊపిరే నేనని.. నా ఊపిరే నీవని ఊహలపల్లకిలో తేలిపోయాం.. కానీ నీ అకాల మరణం నన్ను ఒంటరిని చేసింది.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను. నీవులేని జీవిత శూన్యం.. నీవెంటే నేను వస్తున్నా..’ అంటూ ప్రియురాలి ఎడబాటును జీర్ణించుకోలేని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెలలో చోటుచేసుకుంది నెన్నెల ఎస్సై సౌమ్య తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కుశ్నపల్లి గ్రామానికి చెందిన జాడి రవి(18) ఈనెల 2న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్యశ్రీ , రవి ఏడాదిగా ప్రేమించుకున్నారు. సత్యశ్రీ అనారోగ్యంతో ఈనెల 2న మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న రవి ప్రియురాలు లేని జీవితం వ్యర్థమని గ్రామ శివారుకు వెళ్లి పురుగుల మందు తాగాడు. బంధువులు వెంటనే అతడిని మంచిర్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. రవి సోదరుడు జాడి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. -
దయ్యం నెపంతో తొక్కి చంపారు
నెన్నెల: మూఢ నమ్మకాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం మైలారంలో ఏడాది క్రితం చనిపోయిన వృద్ధురాలు దయ్యంగా మారి తమను వేధిస్తోందని ఆమె కొడుకును అదే గ్రామానికి చెందిన మహిళలు కొట్టి చంపారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన టేకం చిన్నయ్య(50) తల్లి మారక్క ఏడాది కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అయితే, ఆమె దయ్యంగా మారి కొద్ది రోజులుగా వేధిస్తోందని దీంతో పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని గ్రామానికి చెందిన ఎండల పద్మ, ప్రవళిక అనుమానం. దీంతో తమను రక్షించేందుకు దేవుడి మొక్కులు తీర్చాలని చిన్నయ్యతో వారు గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఉన్న చిన్నయ్యపై వారిద్దరూ దాడి చేశారు. అతన్ని విచక్షణ రహితంగా కాళ్లతో తొక్కి, స్పృహ కోల్పోయే వరకు కొట్టి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ఆదివారం ఉదయం ఇరుగు పొరుగు వారు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిన్నాయని కరీంనగర్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అయితే, కరీంనగర్ వెళ్లేందుకు డబ్బుల్లేక వెనక్కి తీసుకువస్తుండగా మృతి చెందాడు. మృతుడి భార్య బాయక్క ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.